గాన గంధర్వుడు-ఘంటసాల
- December 04, 2024తెలుగు సినిమా స్వర్ణయుగంలో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన అనేక చిత్రాలు ఘంటసాల స్వరకల్పనలోనూ, గళవిన్యాసలతోనూ రూపొందాయి.ఈ నాటికీ ఆయన పంచిన మధురాన్ని తెలుగువారు మననం చేసుకుంటూనే ఉన్నారు. నవతరం సైతం ఘంటసాల మాధుర్యాన్ని తలచుకొని పరవశించి పోతోంది. ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా… తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా,దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా ఆయనకు ఆయనే సాటి. తెలుగు వారికి గానామృతం పంచిన గాన గంధర్వుడు, పాటల దేవుడిగా కొలవబడే ఘంటసాల జయంతి నేడు.
ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబరు 4వ తేదీన కృష్ణాజిల్లా చౌటపల్లిలో తల్లిగారింట జన్మించారు. వారి స్వగ్రామం దివిసీమలోని టేకుపల్లి. తండ్రి సూరయ్య ఆ గ్రామంలో అర్చకులు. తరంగాలు పాడేవారు. ‘మృదంగం వీపుకు కట్టుకుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని ఎక్కడ భగవత్సంకీర్తన జరిగితే అక్కడికి ఎంతదూరమైనా వెళ్లి మృదంగం వాయిస్తూ పాడుతూ నా చేత నృత్యం చేయిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో నన్ను అందరూ ముద్దుగా బాలభరతుడని పిలిచేవారు’ అని ఘంటసాల ఒక వ్యాసంలో రాశారు.
ఘంటసాల 11వ యేటనే తండ్రి మరణించారు. దీంతో యాయవారం చేసుకుంటూ జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి అవసాన దశలో దగ్గరకు తీసుకుని ‘సంగీత విద్యలో తరించు’ అని ఆదేశించారట. దీంతో తండ్రి కోరిక తీర్చటానికి పెద్ద కళ్లేపల్లి గ్రామంలో సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రి వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్లారు. గురువుగారికి సేవలు చేయటం, వారాలు చేసి పొట్ట నింపుకోవటం తప్ప సంగీతం గీతాల స్థాయి దాటలేదు. దీంతో కొడాలిలో ఘంటసాల నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు వద్ద్దకు వెళ్లారు. అక్కడ సంగీతం పెద్దవర్ణాల వరకూ మాత్రమే వచ్చింది.
ఉత్తర సర్కారు జిల్లాల్లో ఆ రోజుల్లో విజయనగరంలో మాత్రమే సంగీత కళాశాల ఉండేది. ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్. ఘంటసాల ఆయన్ని కలిసి సంగీతభిక్ష అర్థించారు. ఎల్లమ్మ గుడిలో పడుకుంటూ, వారాలు చేసుకుంటూ మహరాజా సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోసాగారు. అప్పుడు ఆ సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ఉండే పట్రాయని సీతారామశాస్త్రి. ఘంటసాలకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, ఆదరించారు. భుజాన జోలె తగిలించుకుని వీధీవీధీ తిరిగి మధూకరం ఎత్తి పొట్ట పోషించుకున్న ఘంటసాల ఆ తరువాత ఎంత సంపదగలిగినప్పటికీ ఈ గతాన్ని ఏనాడూ మరచిపోలేదు. జీవితాంతం గురుభక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గురుపుత్రుడు పట్రాయని సంగీతరావుని మద్రాసు పిలిపించుకుని తన సహాయకుడిగా నియమించుకున్నారు కూడా! ‘ఏనాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్య పూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది..’ అని వ్రాసుకున్నారు ఘంటసాల కృతఙ్ఞతాపూర్వకంగా!
ఘంటసాల కళకళ కోసమేనన్నట్టుగా జీవించిన వారు కాదు. పూట గడవటం కష్టంగా ఉన్న రోజుల్లోనూ ఆయన దేశభక్తిని వదల్లేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18మాసాలు కారాగార శిక్ష అనుభవించారు. జైలులో బెజవాడ గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, బి.ఎస్.మూర్తి వంటివారి సాహచర్యం లభించాయి. ‘జైలు జీవితం నాకు ఎన్నో విధాలుగా మహోపకారం చేసింది. కర్తవ్యదీక్ష, స్థిరసంకల్పం, నియమబద్ధమైన జీవితం నేర్పింది’ అని ఘంటసాల చెప్పుకున్నారు. దేశభక్తి గీతాలను హృదయపూర్వకంగా, ఉత్తేజకరంగా పాడేవారు.
‘స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి’, ‘ఆ మొగల్ రణధీరులు’, ‘అమ్మా! సరోజినీదేవీ’ మొదలైన ఘంటసాల ప్రైవేట్ రికార్డులు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. అలాగే, తన పాటలతో నాటి ఆంధ్రోద్యమానికి ఊపిరి పోయటమే కాకుండా పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ వెంటఉండి ప్రార్థనాగీతాలు పాడి అమరజీవికి నివాళులర్పించారు. రాష్ట్రావతరణం సందర్భంలో తెలుగు జాతిని ప్రబోధిస్తూ ఎన్నో గీతాలూ పద్యాలూ పాడారు. అనేక పాటలతో తెలుగు జాతికి మేల్కొల్పులు చేశారు. ఘంటసాల స్వీయ రచనలు ‘బహుదూరపు బాటసారీ’, ‘మరువలేనె మరువలేనె నా వలపురాణి’ ఎంతగానో ప్రచారం పొందాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, తులు, హిందీ భాషల్లోనూ ఘంటసాల స్వరకల్పన చేసి అలరించారు. ఇక ఆయన గాత్రంలో జాలువారిని అనేక మధుర గీతాలు ఈ నాటికీ మురిపిస్తూనే ఉన్నాయి. ఘంటసాల సినిమా గీతాలే కాకుండా, ఆయన ఆలపించిన పలు ప్రైవేట్ రికార్డ్స్ సైతం ఆ రోజుల్లో అభిమానులను పులకింప చేశాయి. ముఖ్యంగా ఘంటసాల గానం చేసిన ‘భగవద్గీత’ దేశవిదేశాల్లోని తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. 1969-72 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్ధాన గాయకునిగా కొనసాగారు. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.
ఏ గాయకుడయినా స్వభాషలో పాడటానికి, పరభాషలో పాడటానికీ తేడా ఉంటుంది. మాతృభాషలో పాడుతున్న గాయకుడి గొంతులో అప్రయత్నంగా వినిపించే స్వేచ్ఛ, స్వచ్ఛత- ఆ భాష రానివారు పాడుతున్నప్పుడు ఎలా సాధ్యమౌతాయని ఘంటసాల అనేవారు. తమిళ చిత్రాలలో పాడమని నిర్మాతలు అడిగినప్పుడు తమిళ గాయకులను కాదని తన చేత పాడించవద్దని చెప్పేవారు. ఆయన ఎంతటి మానవతామూర్తో అంతటి వినయమూర్తి కూడా! ‘అమ్మా!’, ‘బాబూ!’, ‘నాయనా! అంటూ ఆత్మీయంగా మాట్లాడేవారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆపన్నులను ఆదుకోవటానికి అందరికన్నా ముందు ముందుకొచ్చేవారాయన. పాటలు పాడి ప్రజలకు వినిపిస్తూ ధన సేకరణకు తోడ్పడేవారు. చైనా పాకిస్తాన్ దురాక్రమణల సమయాల్లోనూ, తుఫాను బాధితులకోసం, అనేక సాంఘిక కార్యక్రమాల కోసం ఉచితంగా సంగీత కార్యక్రమాలు అందించి తోడ్పడేవారు. ‘నేను తలపెట్టిన ప్రతి సాంఘిక సేవా కార్యక్రమానికీ నేనున్నానంటూ ఘంటసాల ప్రథమంగా ముందుకు వచ్చేవారు’ అని ఎన్.టి. రామారావు పేర్కొన్నారు.
ఘంటసాల ఒక చరిత్ర .. ఆయన గురించి కొన్ని మాటల్లోనో .. కొన్ని పేజీఏల్లోనో చెప్పుకోలేం. అప్పట్లో ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున ఏఎన్నార్ ఇద్దరూ కూడా ఎవరి సినిమాలతో వారు బిజీ. ఇద్దరి సినిమాలకి పాడుతూ ఘంటసాల మరింత బిజీ. పాట .. పద్యం ఏదైనా సరే ఘంటసాల వారు పాడవలసిందే అనే రోజులవి. ఘంటసాలవారికి సంగీత సాహిత్యాలపై మంచి పట్టు ఉండేది. సంగీతాన్ని ఒక తపస్సులా భావించి సాధనచేసినవారాయన. గ్రామీణ నేపథ్యంలో పెరగడం వలన, జానపదాలపై కూడా కావలసినంత పట్టు ఉండేది.
ఘంటసాల వారు ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరించి మల్లెపువ్వులా కనిపించేవారు. ఆయనది కల్లాకపటం లేని మనసు. ఆ స్వచ్ఛత ఆయన పాటల్లోను కనిపించేది .. వినిపించేది. తాను మహాగాయకుడినని ఆయన పొంగిపోయిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. నిర్మలమైన నవ్వుతోనే ఆయన అందరినీ ఆకట్టుకునేవారు. వచ్చిన దానిలోనే సంతృప్తిని పొందేవారు. ఒకరిని గురించి మరొకరి దగ్గర మాట్లాడటం .. ఇతరులను చులకనగా చూడటం ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఎదుటివారిని ప్రేమించడం .. గౌరవించడం అంతే.
అప్పట్లో సంగీతంపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుల పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతూ ఉండేది. అయినా తాను కూడా ఒక వైపున పాడుతూ .. మరో వైపున సంగీత దర్శకుడిగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా ఘంటసాల వారి స్థాయిలో విజయాలను అందుకున్నవారు మరొకరు కనిపించరు. తాను పడిన కష్టాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలను అందించిన సౌమ్యమూర్తి ఆయన.
ఘంటసాల వారు కూడా సొంత సినిమాలను నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఘంటసాలవారిలో మంచితనం ఎక్కువ. అందువలన ఆయనలో కావలసినంత మొహమాటం సహజంగానే ఉండేది. మొహమాటం ఉన్నవారు వ్యాపారాలు చేయకూడదని అంటారు. కానీ ఘంటసాల వారు నిర్మాణ రంగంలోకి దిగి ‘పరోపకారం’ .. ‘సొంతవూరు’ .. ‘భక్త రఘునాథ్’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలు ఆయనను అప్పులపాలు చేశాయి. వాటిని తీర్చుకోవడానికి ఆయన ఆస్తులను అమ్ముకోవలసి వచ్చింది. తక్కువ మొత్తానికి డబ్బింగ్ సినిమాల్లో పాటలు పాడవలసి వచ్చింది. ఒక చిత్తూరు నాగయ్య .. ఒక సావిత్రి .. ఒక కాంతారావు .. ఒక ఘంటసాల .. వీరిలో ఎవరిని చూసినా, తమ మంచితనం .. అమాయకత్వం కారణంగా నష్టపోవడమే ఎక్కువగా కనిపిస్తుంది.
1969 నుంచి తరచూ ఘంటశాల అనారోగ్యానికి గురయ్యేవారు. 1971లో ఐరోపా, ఆమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఘంటశాలకు గుండెనొప్పి వచ్చింది. హుటాహుటీన అక్కడి ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలనే కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసి సినిమా పాటలు పాడుకూడదని నిర్ణయించుకున్నారు. 1972లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్ చిత్రాలకు పాటలు పాడారు.
ఘంటసాల తెలుగువారి గుండె చప్పుడు. స్వాతంత్ర్యోద్యమ యోధుడు, మానవతావాది, సినీ నేపధ్య గాయకుడు. తెలుగుతల్లి గారాల స్వరపుత్రుడు. తన జీవితమే ఒక సందేశంగా జీవించినవాడు. తెలుగు భాషలోని తీయదనాన్ని పాటగా ఆలపించినవాడు. శాస్త్రీయ సంగీతానికి ఉన్నంత గౌరవాన్నీ, ప్రజాదరణనూ లలిత సంగీతానికీ కల్పించి సుసంపన్నం చేసినవాడు మన ఘంటసాల. ఆయన గళంనుంచి వెలువడినందునే కొన్ని పద్యాలు, శ్లోకాలు మరింత జనరంజకమైనాయి. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల స్వర్గస్థులయ్యారు.
తెలుగుజాతి ఉన్నంతకాలం ఘంటసాల పాట ఉంటుందనే ప్రసిద్ధిని పొందారు. తన పాటద్వారా ఆయన భావి తరాలకు అందించింది భాషనే! ఆయన పాట నిలిచి ఉన్నంతకాలం తెలుగు నిలిచి ఉంటుంది. పాశ్చాత్య భాషా వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరం కనీసం ఘంటసాల పాటద్వారానైనా తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుసుకో గలుగుతున్నారు. ఘంటసాల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఎంతటి కృషి ఉంటే అంతటి మహోన్నతుడౌతాడని ఆయన నిరూపించారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. అది సాధన ద్వారా సమకూరిన విలువలతో సిద్ధించిన అమృతభాండం! ఆ అమృతాన్ని ఆయన తన గానం ద్వారా లోకాస్సమస్తానికీ పంచి ఇచ్చారు.
ఆ దివి నుండి ఈ భువికి దిగి వచ్చిన గానగంధర్వునిగా ఘంటసాల జేజేలు అందుకున్నారు. ఆయన పాటలతో ఆ రోజుల్లో ఎంతోమంది గాయకులుగా తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పటికీ వర్ధమాన గాయకులు ఘంటసాల పాటలనే పాడుతూ సాగుతున్నారు. ఇలా తరతరాలను అలరిస్తూన్న ఘంటసాల శతజయంతి సంపూర్ణమయినా, ఆయన గాన మాధుర్యాన్ని మననం చేసుకుంటూ తెలుగువారు సదా ఘంటసాల మాస్టారు ప్రతిభను జగతికి చాటుతూనే ఉంటారని చెప్పవచ్చు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం