మహానటి....!

- December 06, 2024 , by Maagulf
మహానటి....!

ఆ కళ్ల వాకిళ్లలో ఉండిపోతే చాలు..ఆ చూపుల ధారలో పండిపోతే చాలు అనిపించే ప్రబంధనాయిక సావిత్రి. అభినయాన్ని కళ్లతోనే కాదు..పెదాలతోను పలికించవచ్చనే విషయాన్ని ప్రపంచానికి చాటిన ఏకైక నాయిక సావిత్రి.ఒక్కమాటలో చెప్పాలంటే సావిత్రి ఒక అభినయ సుమగంధం..చూపులతోనే మనసు పాత్రలను నింపే మకరందం.పుట్టుకతోనే చేపపిల్లకు ఈదడం వస్తుంది..పుట్టుకతోనే పక్షిపిల్లకు ఎగరడం వస్తుంది.అలా పుట్టుకతోనే  సావిత్రికి అభినయం అబ్బింది.అందుకే ఆమె అభినయం సహజమైనదిగా అనిపిస్తుంది.. స్వచ్ఛమైనదిగా కనిపిస్తుంది.అందుకే సావిత్రి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమా రంగంలో చాలా సంవత్సరాలు టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. నేడు మహానటి సావిత్రి జయంతి.

సావిత్రి 1936,డిసెంబరు 6న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తాడేపల్లి సమితిలోని చిర్రావూరులో నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. రునెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు.విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చదువుకుంది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం,శాస్త్రీయ నృత్యం నేర్చుకుని చిన్నప్పుడే ప్రదర్శనలిచ్చింది. 13 ఏళ్ల వయసులో సావిత్రి కాకినాడలోని ఆంధ్రనాటిక పరిషత్ నిర్వహించిన నాటక పోటీల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పృధ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.పృధ్వీ రాజ్ కపూర్ సావిత్రికి బహుమతి అందిస్తూ..భవిష్యత్తులో మహానటి అవుతావని చెప్పారట.

సినిమాల్లో నటించాలని మద్రాసుకు వెళ్లారు. 1950లో విడుదలైన 'సంసారం' సినిమా ద్వారా నటిగా వెండితెరపై మొదటిసారి కనిపించారు సావిత్రి.ఆ తరువాత 'పాతళ భైరవి' సినిమాలో మరో పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. చిన్న చిన్న పాత్రలలో నటించిన సావిత్రి 'పెళ్లి చేసి చూడు చిత్రం' ద్వారా పాపులర్ అయ్యారు. 'పెళ్లి చేసి చూడు' సినిమా తరువాత 'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్' సినిమాలు సావిత్రికి బ్లాక్ బాస్టర్ హిట్ అందించాయి. 1954 విడుదలైన 'బహుత్ దిన్ హుయే' హిందీ సినిమా ద్వారా సావిత్రి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

తెలుగులో ప్రేమకథలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘దేవదాసు’ సినిమా నుంచి సావిత్రి వెనుదిరిగి చూసుకోలేదు. అలనాటి అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నార్  గార్ల సరసన కథానాయికగా ఆమె స్థానం పదిలమైపోయింది. ఓ ‘మిస్సమ్మ’ .. ఓ ‘కన్యాశుల్కం’.. ఓ ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలను ఎవరు మరిచిపోగలరు? ‘వెలుగు నీడలు' .. ‘గుండమ్మ కథ’ .. ‘రక్త సంబంధం’ .. ‘ఆరాధన’ .. ‘మూగమనసులు’ .. ‘డాక్టర్ చక్రవర్తి’ .. ‘దేవత’ సినిమాల్లోని పాత్రలు ఎవరి మనసు తెరపై నుంచి చెరిగిపోగలవు. ఈ పాత్రలన్నీ సావిత్రి అసమానమైన నటనకు అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి.

ఇక పౌరాణికాల్లోను ఎదురులేని కథానాయికగానే ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘మాయా బజార్’లో మాయా శశిరేఖగా సావిత్రి నటన అపూర్వం .. అసాధారణం. ‘అహనా పెళ్లియంటా’ అనే పాటలో ఘటోత్కచుడు పాత్రను అనుకరిస్తూ సావిత్రి చేసిన డాన్స్ అప్పటికీ ఇప్పటికి ఒక అద్భుతమే. అనితరసాధ్యమైన సావిత్రి నటనా పటిమకు కొలమానమే. మరో పౌరాణికమైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’లో సావిత్రిని చూసినవారు ‘పద్మావతీదేవి’ అచ్చు ఇలానే ఉండేదేమో అనుకున్నారు. ఇక ‘నర్తనశాల’ .. ‘పాండవవనవాసం’ తరువాత ద్రౌపది పేరు ఎక్కడ విన్నా సావిత్రి రూపమే గుర్తుకు వచ్చేంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు.

పాట ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది .. అలా పరిగెడుతున్న పాటతో కలిసిపోయి, హావభావాలను ఆవిష్కరించడం అంత తేలికైన విషయమేం కాదు. సంగీతం .. సాహిత్యం .. సందర్భం .. పాత్ర స్వభావం .. అది పొందుతున్న అనుభూతి .. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాటకి ప్రాణం పోయవలసి ఉంటుంది. అలా పాటకి పూర్తిస్థాయి న్యాయం చేసిన కథానాయికలలోను సావిత్రి పేరే ముందుగా కనిపిస్తుంది. ‘అంతా భ్రాంతియేనా .. జీవితాన వెలుగింతేనా’ .. ‘వాడిన పూలే వికసించెనే’ .. ‘నీ చెలిమి నేడే కోరితిని’ .. ‘పాడమని నన్నడగవలెనా’ .. మొదలైన పాటలు ప్రేక్షకుల మనసులతో ముడివేసుకుపోతాయి. ముఖ్యంగా ‘నీవు లేక వీణ పలుకలేనన్నది’ అనే పాట, కళ్లతో సావిత్రి చేసిన గమ్మత్తయిన గారడికి సాక్ష్యంగా నిలుస్తుంది.

కెరియర్ తొలినాళ్ల నుంచే సావిత్రి తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తూ వెళ్లారు. తమిళంలో అలనాటి అగ్రకథానాయకులందరితోను ఆమె నటించారు. తెలుగు ప్రేక్షకులు ఆమెను ‘మహానటి’గా ప్రశంసిస్తూ కళాభినేత్రిగా ఆదరించారు .. ఆమెతో ‘గజారోహణం’ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళ ప్రేక్షకులు కూడా సావిత్రికి నిలువెత్తు నీరాజనాలు పట్టారు. ‘నడిగెయర్ తిలగం’గా తమ హృదయ సింహాసనంపై ఆమె రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఇలా సావిత్రి పేరు ప్రతిష్ఠలు దశదిశలా వ్యాపించాయి. అభిమానుల హృదయాకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న సావిత్రి, ఒక్కసారిగా వివాహమనే ‘పంజరం’లోకి జారిపోయారు.

తమిళ చిత్రపరిశ్రమలో రొమాంటిక్ హీరోగా పేరున్న జెమినీ గణేశన్ తో ప్రేమలో పడిన సావిత్రి, తల్లికీ .. పెదనాన్నకి తెలియకుండానే వివాహం చేసుకున్నారు. అప్పటికే జెమినీ గణేశన్ కి ఇద్దరు భార్యలు .. వాళ్లకి పిల్లలు కూడా ఉన్నారు. అందువలన జెమినీ గణేశన్ తో వివాహం వద్దని సావిత్రితో సన్నిహితంగా ఉండే చాలామంది చెప్పిచూశారు. అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లిద్దరి అన్యోన్యతకు గుర్తుగా విజయచాముండేశ్వరీ .. సతీశ్ కుమార్ జన్మించారు. భర్తను,  పిల్లలనే తన లోకంగా సావిత్రి భావించారు. కానీ భర్త లోకంలో తనకి గల స్థానం చాలా చిన్నదనే విషయాన్ని ఆమె గ్రహించారు. అది ఆమె మనసుకు పిల్లలను కూడా పట్టించుకోనంత పెద్దగాయం చేసింది. భర్త మాటను వినిపించుకోకుండా ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు ఆర్థికపరమైన నష్టాలను తెచ్చిపెట్టాయి.

ఊహతెలిసిన దగ్గర నుంచి అనుకున్న దిశగా అడుగులు వేసిన సావిత్రి, కోరినవాటిని పట్టుదలతో సాధించుకున్న సావిత్రి, వివాహ జీవితం కోసం కెరియర్ ను వదులుకోవడానికి సిద్ధపడిన సావిత్రి, తాను అనుకున్న ఆదరణ లభించకపోవడంతో ఒక్కసారిగా కుంగిపోయారు. దర్శక నిర్మాతగా ఎదురైన పరాజయాలను జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధను మరిచిపోవడం కోసం మద్యానికి బానిస అయ్యారు. మొండితనంతో సావిత్రి తీసుకున్న నిర్ణయాలు ఆ భార్యాభర్తల మధ్య మరింత దూరాన్ని పెంచాయి. నాలుగురాళ్లు వెనకేసుకోవడం కోసం సావిత్రి చుట్టూ చేరిన స్వార్థపరులు, చెప్పుడు మాటలతో ఆమె మనసును మరింత కలుషితం చేశారు.. ఆమె అనారోగ్యానికి మరింత దోహదం చేశారు. ప్యాలెస్ లాంటి ఇంట్లో నుంచి సింగిల్ రూమ్ కి సావిత్రి మకాం మారేలా చేశారు.

అద్దానికి దుమ్ముపట్టినంత సహజంగా సావిత్రి కెరియర్ మసకబారింది. అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి, తన స్థాయికి తగని పాత్రలను చేయడానికి సైతం సిద్ధపడ్డారు. చిన్న రూములో సర్దుకున్నట్టుగానే, చిన్న పాత్రలతోనే సరిపెట్టు కున్నారు. ఏ సెట్ కి వెళ్లినా గతంలోని ఆదరణ లేదు .. అభిమానం లేదు. ఒకవేళ ఆ రెండూ చూపించినా పట్టించుకునే స్థితిలో సావిత్రి లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు..అనారోగ్య సమస్యలు సావిత్రిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సమస్యల సుడిగుండాలు చుట్టుముట్టి సతమతం చేశాయి.ఒక సమస్యను మరిచిపోవడం కోసం తన చుట్టూ తాను అనేక చిక్కుముళ్లు వేసుకున్న సావిత్రి కోమాలోకి వెళ్లారు.కోట్లాది మంది ప్రేక్షకులకు దుఃఖాన్ని మిగిల్చి దూరమయ్యారు.సావిత్రికి ముందు ఎంతోమంది కథానాయికలు ఉన్నారు..ఆమె తరువాత మరెంతోమంది కథానాయికలు వచ్చారు.. కానీ సావిత్రి స్థానం ప్రత్యేకం. ఆకాశంలా..అందులోని చందమామలా..ఆపైన ధృవతారలా సావిత్రి ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

సావిత్రి చాలా చురుకైనది .. కానీ అవతలివారిని వెంటనే నమ్మేసే అమాయకత్వం కూడా ఆమెలో ఉంది. సావిత్రికి పట్టుదల ఎక్కువ .. కానీ పంతానికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఆమెలో పట్టుసడలని ఆశయమే కాదు .. పట్టరాని ఆవేశము ఉంది. ఉత్సాహమే కాదు .. ఇబ్బందుల్లోకి తోసే తొందరపాటుతనమూ ఉంది. కష్టాల్లో ఉన్నవారికే కాదు .. కాలక్షేపం చేసేవారికి కూడా ఆమె దానధర్మాలు చేశారు. తను మంచితనం అనుకున్నదానికి .. అవతలివారు ‘అమాయకత్వం’ అనే బోర్డు తగిలించారనే నిజం ఆమెకి తెలియదు. నిజానికీ .. నీడకి మధ్యగల సన్నని గీతను ఆమె గుర్తించలేకపోయారు. అమృతమేదో .. హాలాహలమేదో గ్రహించలేకపోయారు. అందుకు ప్రధానమైన కారణం తెరవెనుక నటించడం ఆమెకి తెలియకపోవడమే.

‘వెలుగు నీడలు’ సినిమాలో ‘కల కానిదీ .. విలువైనదీ .. బ్రతుకు కన్నీటి ధారాలలోనే బలి చేయకు ..’ అంటూ తన పాత్రను ఉద్దేశించి సాగే పాటను సావిత్రి ఒకసారి కాకపోతే ఒకసారైనా గుర్తుకు తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో. ఆమె జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం అశేష ప్రేక్షకులకు ఓ తీపిజ్ఞాపకమే. ఏది ఏమైనా అభినయమే ఆశయంగా .. అభినయమే ఆయుధంగా జైత్రయాత్రను కొనసాగించిన సావిత్రి, అభిమానుల మనసులను ఎప్పటికీ పెనవేసుకుపోయే ఉంటుంది. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ – ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుట తిలకమై సావిత్రి నిలిచే ఉంటుంది. నటనతో పట్టాభిషేకం .. నవరసాలతో కనకాభిషేకం చేయించుకున్న ఆ మహానటి జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురసరించుకుని ఆ అభినయ దేవతను 'మా గల్ఫ్ (maa Gulf)' స్మరించుకుంటోంది.  

   --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com