జాతీయవాద పాత్రికేయుడు-పిరాట్ల

- December 08, 2024 , by Maagulf
జాతీయవాద పాత్రికేయుడు-పిరాట్ల

పిరాట్ల వెంకటేశ్వర్లు...నమ్మిన సిద్ధాంత భావజాలం పట్ల అంచంచెలమైన విశ్వాసం కలిగిన జర్నలిస్ట్.యువతను పెడ ద్రోవ పట్టిస్తున్న వామపక్షవాదాన్ని తన కలంతో చీల్చి చెండాడిన మేధావిగా పిరాట్ల తెలుగు ప్రజానీకానికి సుపరిచితం.దేశాభివృద్ధికి ఆటంకాలను కలిగిస్తున్న విద్రోహ శక్తుల చర్యలను కృష్ణా పత్రిక ద్వారా ఖండించారు. ఆధునిక పోకడల వల్ల నానాటికి అంతర్ధానం అయిపోతున్న  తెలుగు భాష పరిరక్షణకు నడుంకట్టి భాషా ప్రచార ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

పి.విగా సుపరిచితులైన పిరాట్ల వెంకటేశ్వర్లు 1940, జూలై 16న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా   వెన్నునూతల గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితులై బాల స్వయం సేవక్ గా సంఘంలో చేరారు. విద్యార్ధి దశలోనే సంఘ్ అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ తరపున పనిచేశారు. సంఘ్ సేవ ద్వారా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కొద్దీ కాలం పనిచేసారు.

ప్రచారక్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంఘ పెద్దల సూచనల మేరకు  ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, సమకాలీన విద్యార్ధి ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఆంధ్రప్రదేశ్ జనసంఘ్ పార్టీలోనూ క్రియాశీలకంగా వచ్చిన పిరాట్ల, ఎమర్జెన్సీ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏబీవీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టి ఉద్యమంలో పాల్గొన్నారు.1977లో జనతా పార్టీ తరపున ప్రచార బాధ్యతలను నిర్వహించారు.1980లో భాజపా ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిద్ధాంతకర్తగా వ్యవహరించారు.పార్టీ అగ్రనేతలైన వాజపేయ్, అద్వానీలకు సన్నిహితంగా మెలిగారు.

తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చిన జాతీయవాద పత్రికైన కృష్ణా పత్రికను 1982లో కొనుగోలు చేసిన పిరాట్ల దాన్ని తిరిగి పునరుద్ధరించారు. కృష్ణా పత్రిక సంపాదకుడిగా ఉంటూ పత్రిక ప్రాభవాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఆయన చేసిన అనన్యమైన కృషి గురించి ఎంత చెప్పిన తక్కువే. చైతన్య వంతమైన సంపాదకీయాలతో ఈ పత్రిక వీరి ఆధ్వర్యంలో నిర్మొహమాటమైన నిష్పాక్షికమైన పంథాను అవలంబించింది. 1982-2014 వరకు పత్రికను పిరాట్ల వారు నడిపించారు. తన పత్రిక ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.  

పిరాట్ల వారి సారథ్యంలో కృష్ణాపత్రిక కార్యాలయం సాహితీవేత్తలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలతో సందడిగా ఉండేది. ఎన్నో చారిత్రక, రాజకీయ, సాహిత్య చర్చలు ఆరోగ్యవంతమైన రీతిలో జరిగేవి. పత్రికా దర్బార్, కాకతీయ విజయం, భువనవిజయం, గోల్కొండ విజయం మొదలైన సాహిత్య రూపకాలు పత్రికా కార్యాలయ ప్రాంగణంలో జరిగేవి. ప్రసాదరాయకులపతి, ఓగేటి అచ్యుతరామశాస్త్రి, రాళ్ళబండి కవితాప్రసాద్, జి.ఎం.రామశర్మ, కసిరెడ్డి వెంకటరెడ్డి, మరుమాముల దత్తాత్రేయ శర్మ, అనంతలక్ష్మి, సాధన నరసింహాచార్య వంటి సాహిత్యవేత్తలతో ఇతని ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్యకార్యక్రమాలు జరిగేవి.

కృష్ణా పత్రిక బాధ్యతల్లో ఉంటూనే జాతీయవాద రచనలు చేస్తూ వామపక్ష పెడ ధోరణులను ఎండగట్టారు. నక్షలైట్, విద్యార్ధి ఉద్యమాల  చాటున దేశం పట్ల యువతలో ద్వేషాన్ని పెంచుతున్నారో తన రచనల ద్వారా తెలియజేశారు. వామపక్ష ముసుగులో ఉస్మానియా కేంద్రంగా విద్యార్ధి నేతగా జార్జి రెడ్డి చేసిన అరాచకాలు, ఉత్తర తెలంగాణలో అమాయక గిరిజనులను పోలీస్ ఇన్ఫార్మర్స్ పేరుతో కాల్చివేస్తున్న నక్సలైట్ల గురించి విఫులంగా చర్చించారు. దేశాభివృద్ధికి ఆటంకంగా నిలిచిన వామపక్ష పార్టీలు, మేధావుల మీద సైతం ఆయన రచనలు చేశారు.  

"రెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా", "వందేమాతరం", "అజేయ భారత్‌", "మార్క్సిజం-మేధావుల మత్తుమందు", "కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగేనా ?", "సాంస్కృతిక జాతీయవాదం" , "అంతరంగిక భద్రత-మావోయిస్టులు" , "వందేళ్ళ వందేమాతర ఉద్యమం", "జనతా జనార్దనుడా ! నీ వోటెవరికి ? " వంటి పలు పుస్తకాలను పిరాట్ల రాశారు.వీటిలో "రెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా" పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమై మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

జర్నలిజం రంగంలో పిరాట్ల చేసిన కృషికి గాను 2001లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి తాపీధర్మారావు స్మారక ధర్మనిధి పురస్కారం, 2013లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, ఇందిరా గాంధీ సద్భావన అవార్డులను అందుకున్నారు. సుదీర్ఘకాలం తెలుగు నేల మీద జాతీయవాద సిద్ధాంత భావజాల వ్యాప్తికి కృషి సల్పిన పిరాట్ల వారు 2014 డిసెంబరు 8న మరణించారు.  

   --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com