సిరియా అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!

- December 08, 2024 , by Maagulf
సిరియా అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!

డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ లోకి తిరుగుబాటుదారులు ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపెట్టారని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లెబనాన్ గగనతలంలో ఈ ఘటన జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్లలోని వివరాలను తమ పోస్టులకు జతచేస్తున్నారు. ఈజిప్ట్ కు చెందిన రచయిత ఖలీద్ మహమూద్ చేసిన ట్వీట్ ప్రకారం.. సిరియా అధ్యక్షుడు అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం డమాస్కస్ నుంచి బయలుదేరి లెబనాన్ మీదుగా వెళుతుండగా విమానం ఎత్తు సడెన్ గా పడిపోయింది. లెబనాన్ గగనతలంలో 3,650 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా 1,070 మీటర్ల ఎత్తుకు పడిపోయిందని మహమూద్ చెప్పారు. ఆ తర్వాత విమానం ఆచూకీ రాడార్ కు అందలేదని వివరించారు. విమానం ఎకాఎకిన అంత కిందకు దిగడం, ఆ తర్వాత రాడార్ మీద కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐఎల్ -76 ను ఎవరైనా కూల్చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసద్ విమానం కూలిందని చెబుతున్న ఏరియా లెబనాన్ పరిధిలో ఉంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

మరోవైపు..హెచ్‌టీఎస్‌ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని నగరం డెమాస్కస్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసద్‌, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాము రాజధాని చుట్టూ బలమైన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నామని సిరియా హోం శాఖ చెబుతోంది. ఇక, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com