విలక్షణ నటుడు-రఘువరన్

- December 11, 2024 , by Maagulf
విలక్షణ నటుడు-రఘువరన్

సన్నగా పొడుగ్గా కళ్లాద్దాల చాటు మేధావితనంతో కనిపించే రఘువరన్‌ విలక్షణ విలన్‌. మంచి క్యారెక్టర్​ ఆర్టిస్ట్‌. ఎప్పుడూ హుందాగా ఉండే ఆయనదో ప్రత్యేకమైన నటనశైలి, విభిన్నస్వరం, వైవిధ్యమైన ఉచ్చారణ. ఈ లక్షణాలతోనే ఆయన తెరని ఏలారు. ఎన్నో పాత్రలకు ప్రతిభ అద్దారు. మరీ ప్రత్యేకించి ప్రతినాయకుడి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలన్నింటిలో కలిపి 200 సినిమాలకు పైగా నటించి అభిమానులను అలరించారు. తెలుగులో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తింపు మాత్రం అసాధారణం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అప్పటి యంగ్ హీరోల వరకు చాలా మంది స్టార్లతో రఘువరన్ నటించేశారు. నేడు విలక్షణ నటుడు రఘువరన్ జయంతి. 

రఘువరన్ పూర్తి పేరు రఘువరన్ వేలాయుధన్ నాయర్. 1958, డిసెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కోలెంగూడ్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. రఘు చిన్నతనంలోనే వారి కుటుంబం మొత్తం కోయింబత్తూర్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడే సెయింట్‌ ఆన్స్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు‌. ఆపై లండన్‌ ట్రినిటీ కళాశాలలో పియానో నేర్చుకున్నారు. కోయంబత్తూర్ గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో హిస్టరీలో బాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరారు. అయితే, నటనను వృత్తిగా ఎంచుకోవాలన్న ఆలోచనతో చదువును కొనసాగించలేకపోయారు. 

మొదటగా రంగస్థల నటుడుగా రాణించిన రఘువరన్‌... చెన్నైలోని ఎం.జి.ఆర్‌ ప్రభుత్వ సినిమా, టెలివిజన్‌ శిక్షణా ఇన్​స్టిట్యూట్‌లో నటనలో డిప్లొమా చేశారు. ఆ తరువాత కోలీవుడ్‌ స్టూడియోలకు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా ఎట్టకేలకు హీరోగా ఓ తమిళ సినిమాలో ఎంపికయ్యారు. ఆ సినిమాకు ఎన్నో పురస్కారాలు వరించినా రఘువరన్‌కు మాత్రం అనుకున్నంత స్థాయిలో అవకాశాలు ఇవ్వలేకపోయింది. ఆ తరువాత హీరోగా చేసిన రెండు సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేవు. అయితే, సిల్క్‌ సిల్క్‌ సిల్క్‌ అనే సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించినందుకు ఆయనకు బాగా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌ అవడం వల్ల అవకాశాలు వరుస కట్టాయి. అనంతరం ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ ముందుకు సాగారు.

నిజానికి 1980లలో రఘువరన్‌ హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. అవి వాణిజ్య పరంగా బాగా నడిచాయి కూడా. మైఖేల్‌ రాజ్‌ వంటి సినిమాలు కెరీర్‌ను సుస్థిరపరచడంలో ఆయనకు బాగా సహాయపడ్డాయి. న్యాయవాది, పోలీసు ఆఫీసర్‌ , మంచి హృదయం ఉన్న రౌడీ , గూండాగా మారిన నిజాయతీ కలిగిన వైద్య విద్యార్థిగా, ఓ సామాన్యుడిగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరోగా ఉత్తమ స్థాయిని అందుకోవడానికి ఈ పాత్రలు ఆయనకు ఎంతో సహకరించాయి. అయితే, సహాయక నటుడి నుంచి ప్రతినాయకుడి వరకు అన్ని రకాల పాత్రలను పోషించాలని రఘువరన్‌ అనుకునేవారు. అలా హీరో పాత్రలే కాకుండా పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా పోషించడం వల్ల కథానాయకుడు కన్నా ప్రాధాన్యమున్న పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అలా పలు బాలీవుడ్​,టాలీవుడ్ స్టార్​ హీరోల​ హిట్​ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. 

చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమాతో రఘువరన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తరవాత చిరంజీవి హీరోగా వచ్చిన ‘రుద్రనేత్ర’, ‘లంకేశ్వరుడు’ సినిమాల్లో నటించారు. అయితే, నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన ‘శివ’ సినిమాతో రఘువరన్‌కూ తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.తెలుగులో ఆహ, సుస్వాగతం, నాగ, జానీ, నాని, మాస్‌ వంటి ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ చెరగని ముద్ర వేశారు.  ఏడాదికి 5 నుంచి 12 సినిమాలు చేస్తూ ఎంతో బిజీ ఆర్టిస్టుగా ఉండేవారు రఘువరన్. ఆయన మరణించిన సంవత్సరంలోనూ 8 సినిమాల్లో నటించారాయన. అందులో నితిన్ హీరోగా వచ్చిన ‘ఆటాడిస్తా’ ఒకటి. 

రఘు వ్యక్తిగత జీవితానికి వస్తే 1996లో ప్రముఖ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రోహిణితో రఘువరన్‌ వివాహం అయింది. వీరికి 1998లో రిషి అనే కుమారుడు జన్మించారు. 2004లో రోహిణి, రఘువరన్​లు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నా వీరిద్దరూ పరస్పర గౌరవ భావంతో మెలిగేవారు. రఘు కుమారుడు రిషి త్వరలోనే నటుడిగా వెండి తెర మీద మెరవనున్నాడు. రఘువరన్‌ తమిళ, మలయాళం, తెలుగు సినిమాలకు సంబంధించి తన నటనకు గానూ ఎన్నో రాష్ట్ర, ఫిలింఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు. 

26 సంవత్సరాల కెరీర్‌లో, ప్రతీ పాత్రను తనదైన మ్యానరిజంతో పోషించేవారు రఘువరన్‌. పెద్దపెద్ద నటులు, హీరోలతోనే శభాష్‌ అని అనిపించుకునేవారు. రఘువరన్‌కు ఆయన స్వరం కూడా కలిసొచ్చింది. పాత్రలకు అనుకూలంగా స్వరాన్ని మార్చేవారు. తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ఎన్నో సినిమాలలో నడక తీరుని కూడా మార్చి మరీ ఆయా పాత్రలకు ప్రాణం పోసేవారు. నటన పట్ల ఇంత అంకితభావన ఉండడం వల్లే ప్రేక్షాధారణ, అభిమానం, పాపులారిటీ సంపాదించుకోగలిగారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో 2008, మార్చి 19న 49 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం చెందారు. 

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com