నూటొక్క జిల్లాల అందగాడు... !
- December 12, 2024
‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మరచిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి. నేడు దిగ్గజ నటుడు నూతన్ ప్రసాద్ జయంతి.
నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్.1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరు దగ్గర్లోని కలిదిండి గ్రామంలో ఆయన జన్మించారు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ వినోదం పంచడం అలవాటు. దాంతో చుట్టూ మిత్రులను పోగేసుకొని, నాటకాలు ఆడడం మొదలెట్టారు. నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ, భారత, భాగవత గాథలను భట్టీయం వేశారు. అప్పట్లో మేటి రంగమార్తాండుల ఫక్కీలో పద్యాలు పాడడం మొదలెట్టారు. అలా పురాణజ్ఙానం వంటపట్టింది. నాటకాల్లో అలవోకగా నటించడమూ మొదలైంది.
‘నావూరు’ అనే నాటికలో నూతన్ ప్రసాద్ అభినయం ఎంతోమందిని ఆకట్టుకుంది. దాంతో సినిమా రంగంలో రాణించాలనే అభిలాష కలిగింది. బాపు-రమణ తెరకెక్కించిన ‘అందాల రాముడు’తో నూతన్ ప్రసాద్ తెరకు పరిచయం అయ్యారు. అప్పుడే ఆయన పేరులో ముందు ‘నూతన్’ చేరింది. ఆ తరువాత బాపు ‘ముత్యాల ముగ్గు’లో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు. ‘ప్రాణం ఖరీదు’లో మునుసబు బుల్లెబ్బాయిగా భలేగా ఆకట్టుకున్నారు. ‘చలిచీమలు’, ‘కుడి ఎడమైతే’ చిత్రాలలో నూతన్ ప్రసాద్ డైలాగులు విశేషాదరణ చూరగొన్నాయి. ‘నూటొక్క జిల్లాల అందగాడు’గా జనం మదిలో నిలచిపోయారు. ఆ తరువాత నూతన్ ప్రసాద్ నటించిన ‘కలియుగ భారతం’లో “నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది…” అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి.
అప్పట్లో నూతన్ ప్రసాద్ డైలాగుల కోసమే జనం సినిమాలకు వెళ్ళిన రోజులున్నాయి. ఇక ‘ఇంటింటి రామాయణం’లో హీరోలు రంగనాథ్, చంద్రమోహన్ కు సమానంగా నూతన్ ప్రసాద్ పాత్ర కూడా ఉంది. అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీల్లో కుదురుగా కూర్చోనీయలేదు. ఆ సినిమా తరువాత నూతన్ ప్రసాద్, రమాప్రభ హిట్ పెయిర్ గా మారిపోయారు. బాపు తెరకెక్కించిన పలు చిత్రాలలో నూతన్ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘రాజాధిరాజు’లో “కొత్తా దేవుడండీ…” పాటలో నూతన్ ప్రసాద్ నటన, అందులో అతను ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమా చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరు.
నాటి మేటి నటుల అందరి చిత్రాలలోనూ పలు పాత్రలు పోషించిన నూతన్ ప్రసాద్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సినిమాల్లోనూ కీ రోల్స్ లో అలరించారు. ‘బామ్మ బాట బంగారుబాట’ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురై, ఆయన వెన్నుపూస విరిగింది. అప్పటి నుంచీ కుర్చీకే పరిమితమైన నూతన్ ప్రసాద్, అలా ఉన్నా అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. కడదాకా తన బాణీ పలికిస్తూనే నటించారు.
“నవభారతం, ప్రజాస్వామ్యం” చిత్రాల ద్వారా ఉత్తమ విలన్ గా నంది అవార్డును వరుసగా అందుకున్నారు నూతన్ ప్రసాద్. “సుందరి-సుబ్బారావు, వసుంధర” చిత్రాల ద్వారా ఉత్తమ సహాయనటునిగానూ నంది అవార్డులు దక్కించుకున్నారు. యన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2005లో యన్టీఆర్ అవార్డుతో నూతన్ ప్రసాద్ ను సన్మానించింది. ఆయన చివరగా నటించిన చిత్రాలలో ‘రాజు-మహరాజు’ ఒకటి. 2011 మార్చి 30న ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుల్లో నూతన్ ప్రసాద్ ఒకరిగా వెలుగొందుతూనే ఉన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!