ఇండియన్ సినిమా తలైవర్-రజినీకాంత్
- December 12, 2024
ఈ నెంబర్ 1.. నెంబర్ 2 గేమ్స్ మన దగ్గర నడవవు.. నేను సపరేట్.. ఓన్లీ వన్ పీస్.. సూపర్ వన్.. ఇది 2.0లో రజినీకాంత్ తన గురించి తాను చెప్పుకున్న మాట. ఇదే డైలాగ్ వేరే వాళ్లు చెబితే నవ్వుకుంటారేమో కానీ రజినీకాంత్ చెబితే మాత్రం ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు.ఎందుకంటే అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఆయన దూకుడు అలా ఉంటుంది మరి. 49 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకుని.. సిల్వర్ జూబ్లీకి చేరువవుతున్న సమయంలో కూడా ఇప్పటికీ సూపర్ స్టార్‌గా ఉంటూ రికార్డులు తిరగరాస్తున్నారు. నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ జన్మదినం.
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950, డిసెంబర్ 12న రామోజీ రావు గైక్వాడ్, జిజాబాయి దంపతులకు బెంగళూరు పట్టణంలో జన్మించారు. రజినీ ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి చనిపోయారు. ప్రాథమిక విద్యతోనే చదువుకు ముగింపు పలికిన రజినీ కూలీతో సహా అనేక పనులు చేశారు. ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (BTS)లో బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఇదే సమయంలో తన స్నేహితులతో కలిసి నాటకాలు వేస్తూ క్రమంగా నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1973 లో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో డిప్లొమా తీసుకున్నారు.
హీరో అంటే కండలు తిరిగిన బాడీతో.. తెల్లగా అందంగా ఉండాలనే కమర్షియల్ ఫార్ములాను పక్కనబెట్టించి.. స్టైల్‌తో మెస్మరైజ్ చేసిన రజినీకాంత్‌కు అవకాశం ఇచ్చింది కె.బాలచందర్. తమిళం నేర్చుకుంటే మంచి అవకాశం ఇస్తానని చెప్పడంతో.. రజినీ కొద్దిరోజుల్లోనే తమిళం నేర్చుకోగా.. 1975లో రజినీకాంత్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సోలో హీరోగా ఎదిగారు. ఒక్క ఏడాదిలో 20కి పైగా సినిమాల్లో నటించారు. తమిళంలో ‘16 వయతినిలె’ (తెలుగులో ‘16 ఏళ్ల వయసు’) చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించారు. ఇందులో రజినీకాంత్ విలన్‌గా నటించారు.
80వ దశకంలో అంధా కనూన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘అదాలత్’, ‘జాన్ జానీ జనార్దన్’, ‘భగవాన్ దాదా’, ‘దోస్తీ దుష్మాని’, ‘ఇన్సాఫ్ కౌన్ కరేగా’, ‘రియల్ ఫేక్’, ‘హమ్, బ్లడ్ డెట్’, ‘రివల్యూషనరీ’, ‘బ్లైండ్ లా’ ‘చల్బాజ్’, ‘గాడ్ ఆఫ్ ఇన్సానియాట్’ వంటి హిందీ చిత్రాలు ఆయనకు బాలీవుడ్లో ప్రత్యేకమైన స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. రజినీకాంత్ 1988లోనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. బ్లడ్ స్టోన్ అనే సినిమాలో రజినీకాంత్ ప్రత్యేకమైన పాత్రలో నటించారు.
తెలుగులో రజినీకాంత్ నేరుగా చేసిన సినిమాల కంటే తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘దళపతి, బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ తన 49ఏళ్ల కెరీర్లో 170కి పైగా సినిమాల్లో నటించారు.
రజినీకాంత్ అంటే మనదేశంలోనే కాదు.. ఇతరదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకసారి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2006లో జపాన్‌లోని టోక్యోకు వెళ్లారు. అక్కడ జపాన్ పార్లమెంట్లో రజినీకాంత్ ముత్తు సినిమా గురించి ప్రస్తావించగా.. ఒక్కసారిగా సభ్యులు అభిమాన నటుడు పేరు చెబితే అరిచినట్లుగా అరిచారు. ఈ ఒక్క ఘటన రజినీకాంత్ క్రేజ్ గురించి చెబుతుంది. అంతేకాదు.. అనేక కార్పోరేట్ కంపెనీలు మన దేశంలోనే కాదు.. బయట దేశాల్లో కూడా రజినీకాంత్ సినిమా రిలీజ్ రోజు సెలవు ప్రకటిస్తాయి. ”కబాలి”, రోబో సినిమాల సమయంలో కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించాయి అంటే అర్థం చేసుకోవచ్చు సూపర్ స్టార్ మానియా ఏంటో!
ఆకట్టుకునే సిక్స్ ప్యాక్‌లతో కుర్రాళ్లు దూసుకొస్తుంటే రజనీకాంత్ ఆ పోటీని ఎలా తట్టుకున్నారు? హిందీ సినిమా వెండితెరపై శత్రుఘ్న సిన్హా అప్పుడప్పుడూ ఒకటీ అరా విన్యాసాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు వినోదం పంచేలా రజనీకాంత్ చేసే ట్రిక్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి, చేస్తున్నాయి. నటనకు అదనపు విలువ జోడించినట్లు తన విన్యాసాలతో, బాడీ లాంగ్వేజ్‌తో రజనీకాంత్ ప్రత్యేక స్టయిల్ ఏర్పర్చుకున్నారు. చాలా సినిమాల్లో కండువాతో రజనీ చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఎజమాన్ సినిమా నుంచి నరసింహ వరకు.. పంచె విన్యాసాలు తెరస్మరణీయం. నరసింహలో నీలాంబరి అహంకారాన్ని తుంచివేసిన దృశ్యం చిరస్మరణీయం. సిగరెట్ గాలిలోకి గిరికీలు కొట్టించి పెదాలతో పట్టి స్టైలుగా ముట్టించటం దక్షిణాదిన మరెవ్వరూ చేయలేదని చెప్పొచ్చేమో!
బాషా, నరసింహ, చంద్రముఖి, రోబో.. ఇంకా చాలా చిత్రాల్లో కూలింగ్ గ్లాసెస్‌తో రజనీకాంత్ మ్యాజిక్స్ చూడముచ్చటగా ఉంటాయి. రజనీకాంత్ దర్బార్ సినిమాలో వాడిన సన్ గ్లాసెస్‌తో స్టయిలిష్‌గా కన్పించారు. కాలా సినిమాలో ఆయన ఉపయోగించిన కూలింగ్ గ్లాసెస్ మార్కెట్లో కాలా గ్లాసెస్‌గా ప్రాచుర్యం పొందాయి. 1940, 1960ల్లో కళ్లజోళ్ల ఫ్రేములు మళ్లీ రజనీ స్టయిల్లో ట్రెండీ ఫ్యాషన్ సెన్సేషన్స్గా దూసుకొచ్చాయి. రజనీకాంత్ కబాలీలో వింటేజ్ కూలింగ్ గ్లాసెస్ ధరించి వాటి ఆకర్షణను రెట్టింపు చేశారు. డిస్కవరీలో 'ఇన్‌టూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్‌కు కళ్లజోడు ఫ్లిఫ్ చేయటం నేర్పారు రజనీ. ఏడుపదుల రజనీ ఉత్సాహం చూసి బేర్‌గ్రిల్స్ ఆశ్యర్యపోవడం విశేషం.
యువహీరోలకు సాధ్యం కాని మ్యాజిక్ రజనీ స్టైల్. స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగులలో పంచ్ వల్ల దశాబ్దాల తరబడి ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. భాషతో సంబంధం లేకుండా డైలాగుల యాస, నటనే శ్వాసగా, చిత్ర విచిత్ర విన్యాసాలతో నటిస్తుంటే అభిమాన ప్రపంచం ఫిదా అయ్యింది. సదా ఆయన వెంటే నడిచింది. 70 ఏళ్ల వయసులోనూ ఫైట్లు ఆయనకే సాధ్యం.
2007లో ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్నరెండో నటుడిగా రజనీకాంత్ నిలిచారు. జాకీ చాన్ది అగ్రస్థానం. సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుంటారు రజనీ. ఆయనకు ఎటువంటి ఆడంబరాలు ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటారు. అప్పుడప్పుడు హిమాలయాకు వెళ్లొస్తుంటారు. ధ్యానం చేస్తుంటారు.ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలన్నది రజనీ చిరకాల కోరిక. సీబీఎస్ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్. ఫ్రమ్ బస్ కండక్టర్ టు ఫిల్మ్‌స్టార్ పేరుతో సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు రజనీ జీవితం ఓ పాఠంగా ఉంటుంది.
తన నట జీవితంలో అనేక అవార్డులను అందుకున్నారు. పద్మభూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016), దాదా ఫాల్కే (2019) అవార్డులు అందుకున్నారు రజనీ. ఇక ఫాల్కే అవార్డును తన గురువు, దర్శకుడు బాలచందర్, మిత్రుడు (బస్ డ్రైవర్) రాజ్ బహుదూర్, తనతో సినిమాలు చేసిన వారికి, తమిళ ప్రజలకు అంకితమిచ్చారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని చేస్తున్నారు.
వయసుతో సంబంధం లేకుండా.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్న రజనీకాంత్.. తనని ఇంతటి వాడిని చేసిన వారి కోసం ఎంతటి కష్టమైనా పడతానని చెబుతుంటారు. తనని ఎవరెమన్నా పట్టించుకోరు. వారి పాపాన వారే పోతారులే అని ప్రశాంతతను కోరుకునే ఈ ‘నరసింహ’.. హద్దులు దాటితే మాత్రం ‘ఒకరేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే’ అనేలా ఉగ్రవతారం ప్రదర్శిస్తారు. అలా చెప్పిందే.. పైన చెప్పిన ‘మొరగని కుక్క.. నోరు, ఊరు’ డైలాగ్. అది ఎవరికి తగలాలో, ఎవరిని తాకాలో వారిని తాకింది.
నటన, వైవిధ్య పాత్రలు, నూతన దర్శకుల ఎంపిక, ప్రతి విషయంలో తీసుకునే జాగ్రత్తలు రజనీకాంత్ శిఖరం అంచున ఉంచాయి. రజనీకాంత్ ఇంకా యువ హీరోలకంటే దూకుడుగా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ నాలుగున్నర దశాబ్దాలు వెండితెరపై ఏకఛత్రంగా అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నారు. రాళ్లు పడుతున్నప్పుడు తట్టుకోవాలి. పూలు పడుతున్నప్పుడు తప్పుకోవాలి. ఇదే రజనీ సిద్ధాంతం. పొగడ్తలకు దూరంగా ఉంటారు. ఆయన ముళ్లదారిని పూలబాటగా మలుచుకున్నారు. శిలాఫలకాల మీద మిగలటం కాదు..ప్రజల మనో ఫలకాలపై మిగలాలి. రజనీకాంత్ వెనకడుగు వేసినప్పుడల్లా వేయి ఏనుగుల బలంతో ముందుకు వచ్చారు. తలెత్తుకుని వచ్చి శిఖరమయ్యారు. ఏడుపదుల వయసులోనూ వెండితెరపై సునామీలు సృష్టిస్తున్నారు. అందుకే రజనీకాంత్ కాలాతీత కథానాయకుడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి