వామపక్ష సైద్ధాంతిక మేధావి-మాకినేని

- December 14, 2024 , by Maagulf
వామపక్ష సైద్ధాంతిక మేధావి-మాకినేని

భారత రాజకీయాల్లో ఆయన ప్రస్థానం మరువరానిది. వామపక్ష భావజాలాన్ని దేశ ప్రజలకు చేరువయ్యేలా వ్యూహరచనలు చేసిన మేధావుల్లో కీలకమైన వ్యక్తి.  మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడిగా నిలిచిపోయారు మాకినేని బసవపున్నయ్య. నేడు వామపక్ష రాజకీయ దిగ్గజం కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య జయంతి. 

కామ్రేడ్ ఎంబీగా దేశ రాజకీయాల్లో సుపరిచితులైన మాకినేని బసవపున్నయ్య 1914, డిసెంబరు 14న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా తూర్పుపాలెం గ్రామంలో జన్మించారు. రేపల్లె, మచిలీపట్నంలో హైస్కూల్ విద్యను పూర్తి చేసి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీని గుంటూరు ఏసీ కళాశాలలో పూర్తి చేశారు. 

బసవపున్నయ్య చిన్నతనం నుంచే దేశ స్వాతంత్య్రంలో పాల్గొనాలని అభిలషించే వారు. మచిలీపట్నంలో చదువుతున్న సమయంలో అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే, ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేయడం పట్ల అసంతృప్తి చెంది క్రమంగా వామపక్ష వాదం వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే కమ్యూనిస్టు పార్టీకి చెందిన పులుపుల శివయ్య, పోలేపెద్ది నరసింహమూర్తి తో ఏర్పడ్డ సన్నిహిత పరిచయం వీరిని కమ్యూనిస్టు పార్టీ వైపు నడిపించింది. 

బసవపున్నయ్యతో పాటుగా తన మిత్రులైన లావు బాలగంగాధరరావు, వేములపల్లి శ్రీకృష్ణ, మోటూరు హనుమంతరావు, వై.వి కృష్ణారావు మరియు టి.వెంకటేశ్వరరావులతో కలిసి 1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వామపక్ష విద్యార్ధి సంఘం అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడిగా విద్యార్ధి ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. 1934-40 వరకు విద్యార్ధి నేతగా ఉంటూనే గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా పనిచేశారు. 1936లో జరిగిన విద్యార్థిసంఘం సంస్థాపక మహాసభలో జతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 

1937,1938లో కొత్తపట్నం, మంతెనవారిపాలెం గ్రామాల్లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ వేసవి రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందారు. 1940లో గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో గుంటూరు జిల్లా నుంచి ఎందరో యువకులను కమ్యూనిస్టు పార్టీలో చేర్పించడంలో ప్రధాన భూమికను పోషించారు.1943 నాటికి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుందరయ్య, చలసాని వాసుదేవరావు, కంభంపాటి సత్యనారాయణ, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు  వంటి వామపక్ష దిగ్గజాలతో కలిసి పనిచేశారు.1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 

1948లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న బసవపున్నయ్య, తన సహచర సుందరయ్యతో కలిసి నిజాం రజాకార్ల మీద జరిగిన గెరిల్లా పోరాటంలో విప్లవ దళాలకు నాయకత్వం వహించారు. 1948-50వరకు కమ్యూనిస్టు పార్టీ మీదున్న నిషేధం మూలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1950లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికై 1964 వరకు పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విశాలాంధ్ర ఉద్యమానికి వ్యూహ రచన చేసిన వ్యక్తుల్లో వీరు ముఖ్యులు. 1952,1955 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఓటమికి గల కారణాలను విశ్లేషించి పొలిట్ బ్యూరోకు నివేదిక సమర్పించారు. 

1964లో విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు మహాసభల్లో దేశంలో విప్లవ సాధనకు అనుసరించవలిసిన వ్యూహం పట్ల పార్టీ దృష్టి సారించడంలో విఫలం అయ్యిందని బహిరంగంగానే పేర్కొనడంతో ఆయన్ని మరియు ఆయన వాదాన్ని బలపరిచిన నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. తనతో పాటుగా బహిష్కరణకు గురైన నేతలతో కలిసి 1964లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ని స్థాపించారు. ఆ పార్టీ వ్యవస్థాపక జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా మరణించే వరకు కొనసాగారు. నూతన పార్టీ విస్తరణ, బలోపేతం మరియు సిద్ధాంతాల రూపకల్పన బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించారు. 1952-66 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 

బసవ పున్నయ్య గొప్ప వక్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుందరయ్య మరియు వీరి మాట్లాడే సభలకు జనం తండోపతండాలుగా వచ్చేవారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై నాటి నెహ్రూ, శాస్త్రి మరియు ఇందిరా ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిని ఎండగట్టేవారు. సభ్యుడిగా ఆయన చేసిన పలు సూచనలను ప్రభుత్వాలు పాటించేవి. 

మాకినేని గొప్ప రచయిత. మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని దేశ రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా అన్వయించే విధానాన్ని వామపక్ష రచయితలకు సూచించడమే కాకుండా, ఆయనే స్వయంగా పలు సిద్ధాంత పుస్తకాలు రాశారు. పార్టీకి అనుబంధంగా ఉన్న పీపుల్స్ డెమోక్రసీ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన రాసిన సంపాదకీయాలు గురించి ఆరోజుల్లో పార్లమెంట్లో సైతం చర్చకు వచ్చేవి.   

ఐదు దశాబ్దాల పాటు వామపక్ష భావజాలం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసంతో నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన మాకినేని బసవపున్నయ్య ఎందరో యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దారు. మాజీ సీపీఎం కార్యదర్శిలైన ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి వంటి ఎందరినో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ ఎదుగుదలకు దోహద పడ్డారు. అనారోగ్యం కారణంగా 1992, ఏప్రిల్ 12న ఢిల్లీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com