'సంగం' డెయిరీ రథసారథి-ధూళిపాళ్ల
- December 15, 2024
ధూళిపాళ్ల నరేంద్ర...తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకు విశేషమైన ప్రస్థానం ఉంది.వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, తన స్వయం కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరియు అంకిత భావంతో రాష్ట్ర నేతగా ఎదిగారు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి పొన్నూరు నియోజకవర్గాన్ని పసుపుమయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. సంగం డెయిరీ ఛైర్మన్ గా పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అతికొద్దీ మంది నాయకుల్లో నరేంద్ర ఒకరు. నేడు సంఘం డెయిరీ రథసారథి, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ప్రజా జీవిత ప్రస్థానాన్ని గురించి తెలుసుకుందాం.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 1967, డిసెంబర్ 14వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు తాలుకా చింతలపూడి గ్రామానికి చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, ప్రమీలా దేవి దంపతులకు జన్మించారు.తమ గ్రామానికి దగ్గర్లోని అనంతవరప్పాడు హైస్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నారు.ఇంటర్ విజయవాడ లయోలా కళాశాలలో పూర్తి చేసి మైసూర్ పట్టణంలోని జయచామరాజేంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బాచ్యులర్ ఇంజినీరింగ్ (బి.ఈ) పూర్తి చేశారు. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో, ఢిల్లీ రావూస్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకోని రెండో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లారు.
నరేంద్ర తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గుంటూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. దానికంటే ముందే సంగం డెయిరీ ఛైర్మన్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన "పాల వీరయ్య"గా ఆయన చిరస్మరణీయులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (APDDCF) వ్యవస్థాపక ఛైర్మన్ గా సేవలందించారు. 1994లో రోడ్డు ప్రమాదంలో వీరయ్య చౌదరి గారి ఆకస్మిక మరణంతో మూడో సారి ప్రిలిమ్స్ రాయకుండానే ఇంటికి వచ్చేశారు.
1994 మార్చిలో తన తండ్రి స్థానంలో సంగం డెయిరీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర , అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆశీస్సులతో పొన్నూరు నుంచి తెదేపా తరపున పోటీ చేసి 28 ఏళ్ళ వయసులో తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ హేమాహేమీలకు నిలయమైన గుంటూరు జిల్లా అతి తక్కువ వయస్సులో ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రికార్డ్ సృష్టించారు. అసెంబ్లీలో తనతో పాటుగా మొదటిసారి ఎన్నికైన దివంగత దేవినేని వెంకట రమణ, పయ్యావుల కేశవ్ (ప్రస్తుత ఏపీ ఆర్థిక శాఖ మంత్రి)లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు.
1996లో వెంకట రమణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర, కేశవ్ లు జట్టుగా ఏర్పడి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిస్కారం కోసం పనిచేవారు. 1999లో రెండో సారి ఎన్నికైన తర్వాత దేవినేని రమణ ఆకస్మిక మరణం, కేశవ్ ఓటమి చెందడంతో, ఇదే సమయంలో ఒంటరిగానే నరేంద్ర అసెంబ్లీ వేదికగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులను విడుదల చేయించుకోవడంతో పాటుగా, వ్యవసాయం మరియు పాడి రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తెచ్చేవారు. జన్మభూమి కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో విజయవంతం చేశారు. 2002-04 వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడిగా పనిచేశారు.
2004 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మరియు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ సునామిని తట్టుకొని పొన్నూరు నుంచి మూడో సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.నాడు గుంటూరు జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాల్లో ఒక్క పొన్నూరులోనే నరేంద్ర రూపంలో తెదేపా విజయం సాధించింది. 2004లో తెదేపా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్ష బాధ్యతలతో పాటుగా అసెంబ్లీలో వైఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తూర్పార బట్టేవారు.వైఎస్ ప్రభుత్వంతో ముఖాముఖి తలపడటం వల్ల నరేంద్ర రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యారు. నియమాలను తుంగలో తొక్కి తనకు కావాల్సిన వారికి వివిధ రూపాల్లో వైఎస్ ఎలా దోచిపెడుతున్నారో నరేంద్ర ప్రెస్ మిట్స్ పెట్టి వివరించేవారు. ఆరోజుల్లో నరేంద్ర మీడియా ముందుకు వస్తున్నారంటే సంచలన విషయాన్ని బయట పెట్టబోతున్నారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూసేవారు. నరేంద్రను రాజకీయంగా అణచివేయడానికి వైఎస్ ప్రభుత్వం చేసిన విఫలం అయ్యాయి.
2009లో నాలుగోసారి పొన్నూరు నుంచి ఎన్నికైన, పొన్నూరును తెదేపాకు కంచుకోటలాగా మార్చేశారు. అధినేత చంద్రబాబు ఆశీస్సులతో అసెంబ్లీ విప్ బాధ్యతలు చేపట్టి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టేవారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల విషయంలో నరేంద్ర, కేశవ్ మరియు రేవంత్ రెడ్డిలు కలిసి చేసిన మీడియా సాక్షిగా ఎన్నో సార్లు ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పొన్నూరు నుంచి ఐదోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. గుంటూరు డెల్టా ప్రాంతం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన ఏకైక రాజకీయ నాయకుడిగా నరేంద్ర చరిత్రలో నిలిచిపోయారు.
2014-19 మధ్యలో జరిగిన మంత్రివర్గ కూర్పులో మంత్రి పదవిని దక్కించుకోలేకపోయారు. మంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికి అధినేత చంద్రబాబు కరుణించకపోవడంతో ఎమ్యెల్యేగానే ఉండిపోయారు. నరేంద్రకు మంత్రి పదవి దక్కకపోవడంతో తెదేపా మీద గుర్రుగా ఉన్న పొన్నూరు ప్రజానీకం 2019 ఎన్నికల్లో తెదేపా మీదున్న కసితో ఆయన్ని ఓడించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ తేడాతో పలువురు సీనియర్లు, మంత్రులు ఓటమి పాలైన, నరేంద్ర కేవలం స్వల్ప (1112 ఓట్లు) తేడాతోనే ఓడిపోయారు.
2019-24 వరకు నరేంద్ర మునుపెన్నడూ లేని విధంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన అనేక ఒత్తిడులను సైతం లెక్క చేయకుండా ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీ లేని పోరాటం చేశారు. నరేంద్రను అదుపు చేయడానికి జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది. జైల్లో పెట్టినా వెనక్కి తగ్గకుండా మునుపటి కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ప్రజా పోరాటాలు నిర్వహించారు. అందుకు ఫలితమే 2024 ఎన్నికల్లో పొన్నూరు నుంచి 32 వేల మెజారిటీతో ఆరో సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
సంగం డెయిరీ ప్రస్తావన లేకుండా నరేంద్ర జీవిత ప్రస్థానం ముగియదు. తన తండ్రి మానసపుత్రిక అయిన సంగం పాల డెయిరీని అభివృద్ధి పథంలో నరేంద్ర నడిపిస్తున్నారు. 1994-95 వరకు మొదటి సంగం ఛైర్మన్ బాధ్యతల్లో ఉన్న నరేంద్ర, డెయిరీ అభివృద్ధికి ప్రణాళికలు రచించారు కాని రాజకీయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2010లో మరోసారి డెయిరీ సారథ్య బాధ్యతలను చేపట్టి, డెయిరీ అభివృద్ధికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలు పెట్టారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా గడపుతూనే రోజువారీగా డెయిరీ డైరెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చేవారు. 2013లో రాష్ట్ర సహకార చట్టం మాక్స్ పరిధిలో నుంచి కంపెనీ చట్టంలోకి మారడం జరిగింది.
సంగం డెయిరీ కంపెనీ చట్టంలోకి మారిన తర్వాత డెయిరీ ఆధునీకరణకు కేంద్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య నుంచి రాయితీలు మరియు ఇతరత్రా సాంకేతిక సహకారాన్ని రాబట్టారు. నరేంద్ర డెయిరీ బాధ్యతలు చేపట్టే నాటికి 200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ ఉండగా దాన్ని 1000 కోట్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకే పరిమితమైన సంగం బ్రాండ్ పాలు మరియు పాలధారిత ఉత్పత్తులను రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించారు. ఇక పాల సేకరణలో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు నుంచి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలకు విస్తరించారు. ఆంధ్రలోని విజయ, విశాఖ సహకార పాల డెయిరీల కంటే ఎక్కువ పాలను సేకరిస్తున్న సంస్థగా సంగం సహకార డెయిరీ రికార్డు సృష్టించింది.
సంగం డెయిరీ విజయంలో భాగస్వాములైన పాడి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటుగా బోనస్ లు కూడా సకాలంలో చెల్లిస్తూ వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. పశువులకు కావాల్సిన దాణాను ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. పశువులు అనారోగ్యానికి గురైతే వాటికి వైద్య సేవలను అందించేందుకు మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు గేదెలను కొనుక్కోడానికి తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇచ్చే ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సంగం డెయిరీ తరపున అధునాత సాంకేతిక సౌకర్యాలతో కూడిన DVC మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి సంగం డెయిరీకి పాలు పొసే ప్రతి రైతు కుటుంబానికి ఉచితంగానే వైద్య పరీక్షలు చేసే విధానాన్ని నరేంద్ర ప్రవేశ పెట్టారు. రాబోయే రోజుల్లో సంగం డెయిరీని దక్షిణ భారతదేశమంతటా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో మూతపడ్డ చిన్న చిన్న పాల డెయిరీలను సంగం తరపున కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.
మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజా ప్రతినిధిగా, సంగం డెయిరీ రథ సారథిగా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తెదేపాలో పదవులు పొంది, సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలకు బాబు పెద్ద పీఠ వేస్తూ నరేంద్ర వంటి సమర్ధవంతుడైన నాయకుడిని పదవులకు దూరంగా ఉంచడం ద్వారా నిబద్దత కలిగిన మరియు పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే వారికి ఎన్నటికి ఉన్నత పదవులకు అర్హులు కారని అధినేత బాబు చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబులోని ఈ ధోరణి మారి కులాల భేరీజు వేసుకొని కాకుండా సమర్థతకు పట్టం కట్టి ప్రజా జీవితంలో విశేషమైన అనుభవాన్ని కలిగి ఉన్న నరేంద్ర లాంటి ప్రజా నాయకుడికి మంత్రి పదవి ఇస్తే తన సమర్థతతో రాష్ట్రాభివృద్ధికి భాగస్వామ్యం అవుతారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో నరేంద్ర కచ్చితంగా మంత్రి పదవిని పొందుతారని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి