దుబాయ్ లో నయనానందంగా సాగిన తన్మయి ఆర్ట్ స్టూడియో 'నృత్యార్చన'

- December 16, 2024 , by Maagulf
దుబాయ్ లో నయనానందంగా సాగిన తన్మయి ఆర్ట్ స్టూడియో \'నృత్యార్చన\'

దుబాయ్: మన తెలుగువారి నృత్యకళ 'కూచిపూడి' ని గల్ఫ్ దేశం అయిన యూఏఈ లో నలుదిశలా వ్యాపింపచేసి ఎందరో కళాకారులను తీర్చిదిద్దుతున్న 'తన్మయి ఆర్ట్ స్టూడియో' వారిచే దుబాయ్ లోని 'జెమ్స్ దుబాయ్ అమెరికన్ అకాడమీ' లో 'నృత్యార్చన-2' నిర్వహించబడింది. ప్రీతి తాతంభొట్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్,  ప్రముఖ పారిశ్రామికవేత్త H.E లైలా రహ్హాల్, SRR ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ కుమార్ తోట, గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

తన 9 సంవత్సరాల వయసు నుంచే నాట్యాన్ని అభ్యసించటం ప్రారంభించిన ప్రీతి తాతంభొట్ల, గత 16 సంవత్సరాలకు పైగా అంకితభావంతో గురువైన డాక్టర్ శోభా నాయుడు దగ్గర శిక్షణ పొంది నేడు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. తన గురువు సాధన నుండి 'నవరస నటభామిని' అనే నృత్యమాలిక ను 'నృత్యార్చన-2' లో భాగంగా  షుమారు 80 మంది శిష్యులతో కలిసి, నవ రసాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్నలను పొందారు ప్రీతి. భీభత్స రసాన్ని చూపే దక్షయజ్ఞ ఘట్టం, కరుణ రసాన్ని చూపే మన్మధ ఘట్టం, హాస్య రసానికి పార్వతి తన సఖిలతో కలిసి చేసే సృజనాత్మక ఘట్టం, భయానకానికి గజాసుర ఘట్టం మరియు వీర రసానికి మహిషాసుర మర్ధని వంటి పలు ఘట్టాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమానికి సమకూర్చిన వస్తు సమూహం, దేవతా వస్త్ర/వేష ధారణ ఔరా అనిపించాయి అనడంలో అతిశయోక్తి లేదు. తెరవెనుక పడ్డ కష్టం ప్రేక్షకుల హర్షధ్వానాలతో మర్చిపోయాం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిర్వాహకులు.

గౌరవ అతిధిగా విచ్చేసిన చంద్రబోస్ మాట్లాడుతూ "కొన్ని కార్యక్రమాలు చూడాలంటే అవకాశం తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈరోజు ఇంత మనోహరమైన నృత్యార్చన కు అతిథిగా విచ్చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రీతి తాతంభొట్ల వయసులో చిన్నవారైనా..కళలో గొప్ప ప్రావీణ్యం సంపాదించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. నేడు ఈ కార్యక్రమానికి లభించిన స్పందన చూస్తుంటే..తెలుగు వాడిగా ఎంతో గర్వంగా ఉంది. పిల్లలు కనబరిచిన ప్రతిభ నిజంగా అద్భుతం. ఒకరిని మించి ఒకరు అన్నట్టు తమ ప్రతిభను కనబరిచారు. నృత్యార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా ఆశీస్సులు. ఫలాపేక్ష రహితంగా, కళను నలుగురికీ పంచాలనే సహృదయంతో ప్రీతి చేసిన ఈ కార్యక్రమం మరిన్ని సీసన్స్ జరుపుకోవాలి అని ఆశిస్తున్నాను." అని అన్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకుల అభ్యర్ధన మేరకు చంద్రబోస్ రచించిన కొన్ని ఆణిముత్యాలను ఆయన ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక ఆస్కార్ ను సంపాదించిపెట్టిన 'నాటు నాటు' పాట ఆలపించడంతో చిన్నారులే కాక పెద్దలు సైతం గొంతు కలిపి కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

భారత కాన్సల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ "ఇటువంటి కళలను ప్రోత్సహించడం ఎంతో అవసరం... రేపటి భవిష్యత్తుకు ఈ సంస్కృతీ, సంప్రదాయాలు దిక్సూచి. ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి రావటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. పిల్లలు ఎంతబాగా చేశారంటే..నాకు ఎవరిని మెచ్చుకోవాలో తెలీలేదు. ఇంత గొప్పగా శిక్షణ ఇచ్చిన ప్రీతి తాతంభొట్ల కు నా అభినందనలు. మన భారత సంస్కృతిని అభివృద్ధి పరచడంలో మా సహాయసహకారాలు ఎల్లప్పుడూ కమ్యూనిటీ కి అందుతాయి. అద్భుత ప్రతిభ కనబరిచిన కళాకారులందరికీ నా బెస్ట్ విషెస్." అని అన్నారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన H.E లైలా రహ్హాల్ మాట్లాడుతూ "భారతీయుల కళా సంపద నిజంగా అద్భుతం. రంగులీనుతూ సాగిన ఈ కార్యక్రమం ఎంతో రమణీయంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి రావటం ఇదే మొదటిసారి..నేను ఆనందంతో మైమరచిపోయాను. విమెన్ ఎంపవర్మెంట్ కు చక్కని ఉదాహరణ ప్రీతి. కమ్యూనిటీ కి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని అన్నారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించిన డాక్టర్ రామ్ కుమార్ తోట మాట్లాడుతూ... "మన కళలను ఇలా అంతర్జాతీయ వేదిక పై పదర్శించటం, అందులో నేను భాగం అవ్వటం చాలా ఆనందంగా ఉంది. సీసన్ 1 ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఈ నృత్యార్చన కార్యక్రమం ఇలా విజయాన్ని సాధిస్తూ ముందుకు కొనసాగాలి" అని అన్నారు.

తన్మయి ఆర్ట్ స్టూడియో వ్యవస్థాపకురాలు ప్రీతి తాతంభొట్ల మాట్లాడుతూ "సీసన్ 1 అప్పుడు అనుకోలేదు ఇంత ఆదరణ లభిస్తుందని. ఆ ప్రోత్సాహంతో సీసన్ 2 చేశాము. మా గురువు గారి ఆశీస్సుల బలంతోనే 'నృత్యార్చన' విజయవంతంగా చేయగలుగుతున్నాం. విదేశాల్లో ఒక సాంస్కృతిక కళకు ఇంత ఆదరణ లభించడం ఆనందాన్ని ఇస్తోంది. పిలల్లు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ కళపై ఉన్న మక్కువతో ఎంతో దూరాలనుండి వచ్చి మరీ నృత్యాన్ని నావద్ద నేర్చుకోవటం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయగలిగాను అంటే, నా స్టూడెంట్స్ మరియు నా కుటుంబం అందించిన సహాయసహకారాలే కారణం. స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండులు అందించిన -సహాయం మాటల్లో చెప్పలేనిది.. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా, నన్ను..ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మరియు స్పాన్సర్లకు నా కృతజ్ఞతలు." అని అన్నారు.

--- సౌమ్య చిత్తర్వు, సీనియర్ కరెస్పాండెంట్​, మాగల్ఫ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com