ఆంధ్రా గాంధీ-మూర్తిరాజు

- December 17, 2024 , by Maagulf
ఆంధ్రా గాంధీ-మూర్తిరాజు

మూర్తి రాజు ... ఈ పేరు ముందుగా గుర్తొచ్చేది గాంధీ టోపీ పెట్టుకున్న ఆరడుగుల నిరాడంబరమైన రూపం. గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచినారు. చిన్నతనంలోనే మహాత్ముడి బోధనలకు ప్రభావితుడై చివరి శ్వాస వరకు  గ్రామీణాభివృద్ధికి పాటుపడుతూ వచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో బాపిరాజు విద్యాసంస్థలను ప్రారంభించారు. సర్వోదయ ఉద్యమానికి చేయూతగా తనకున్న 1800 ఎకరాల యావదాస్తిని విద్యాసంస్థలకు, ప్రజలకు పంచిపెట్టి ఎందరికో జీవితాన్నిచ్చారు. రాజకీయ జీవితంలో ఓటమెరుగని రాజకీయ మేరునగధీరుడిగా మూర్తి రాజు గారు నిలిచారు. నేడు గాంధేయవాది, నిష్కళంక ప్రజా నాయకుడు మూర్తి రాజు గారి జయంతి.

మూర్తి రాజు గారి పూర్తి పేరు   చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తి రాజు. 1919,డిసెంబర్ 16న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గోదావరి జిల్లాలోని తణుకు తాలూకా సత్యవాడ గ్రామంలో సంపన్న జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మల దంపతులకు జన్మించారు. హైస్కూల్ విద్య వరకే చదువుకున్నారు.

మూర్తి రాజు గారు విద్యార్ధి దశలోనే మహాత్మ గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితుడై ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రా  షుగర్స్ వ్యవస్థాపకుడు, తణుకు జమీందారు ముళ్ళపూడి తిమ్మరాజు గారి కుమారుడు, ఆంధ్రా బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారితో ఉన్న స్నేహం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వీరిద్దరూ కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్ధి కాంగ్రెస్ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. తణుకుకు జాతీయ నేతలైన జయప్రకాశ్ నారాయణ్, బాబు రాజేంద్ర ప్రసాద్ గార్లను రప్పించి ఉపన్యాసాలు ఇప్పించిన వీరిద్దరికి దక్కుతుంది.

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మూర్తి రాజు గారు క్రియాశీలకంగా వ్యవహరిస్తు వచ్చారు. 1952-1983 వరకు తాడేపల్లిగూడెం,పెంటపాడు, ఉంగుటూరు నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. 30 ఏళ్ళ పాటు ఎమ్యెల్యేగా పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట సీమ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. పివి నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఆహ్వానం మేరకు మార్కెటింగు, గిడ్డంగులు, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎందరో సామాన్య యువకులను నాయకులుగా తీర్చిదిద్దారు. మాజీ మంత్రులు యర్రా నారాయణ స్వామి, దండు శివరామరాజు, కంతేటి సత్యనారాయణ రాజులతో పాటుగా ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఎందరో నాయకుల ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజు గారు తోడ్పడ్డారు. 1982లో క్రియాశీలక రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు.

మహాత్మా గాంధీ ప్రభావం మూర్తి రాజు గారిపై అధికంగా ఉండేది. గాంధీజీ ప్రబోధించిన విధంగానే సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. 1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు. భూమి లేని ఎందరో నిరుపేదలకు తనకు వారసత్వంగా సంక్రమించిన 1800 ఎకరాల భూమిని ఉచితంగా పంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

 విద్యారంగంలో మూర్తి రాజు గారు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరూ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు ఎంఎస్‌ నారాయణ, పురాణ వ్యాఖ్యాత మైలవరపు శ్రీనివాసరావు ఆయన నెలకొల్పిన పాఠశాలల విద్యార్థులే. సినీ రచయిత మరియు నటులు పరుచూరి గోపాలకృష్ణ ఆయన స్థాపించిన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు.

కొల్లేరు ప్రాంతంతో మూర్తి రాజు గారి అనుబంధం గాఢమైనది. తమకున్న వ్యవసాయ భూములను చూసుకోవడానికి తరచూ ఆ ప్రాంతానికి వెళ్లేవారు. దుర్భర దారిద్య్రంతో అలమటిస్తున్న కొల్లేరు ప్రజలను చూసి చలించిపోయిన రాజు గారు వారి అభ్యున్నతికి పూనుకొని, తన భూములు వారికి ఉచితంగానే పంచిపెట్టారు. అంతేకాకుండా, కొల్లేరులో చేపలు పట్టేందుకు మర బోట్లను పంపిణి చేయించారు. కొల్లేరు ప్రాంత పిల్లలకు తమ విద్యా సంస్థల్లో చేర్చుకొని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను కలిపి కొల్లేరును జిల్లాగా చేయాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. ఈ విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాషట్రంలో అనేక మంది  ముఖ్యమంత్రులతో పోరాటాలు కూడా చేశారు. తమ అభ్యున్నతికి పాటుపడ్డ రాజు గారిని ఈనాటికి కొల్లేరు ప్రాంత ప్రజానీకం ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది.

ఏడు దశాబ్దాల పాటు వివిధ రూపాల్లో ప్రజా సేవకు పాటుపడ్డ మూర్తి రాజు గారు తన 95వ ఏట 2012, నవంబర్ 12వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. జీవిత చరమాంకం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడటమే కాకుండా వాటిని ఆచరిస్తూ నిస్వార్థ ప్రజా నాయకుడిగా నిలిచిన మూర్తి రాజు రాబోయే తరాలకు సైతం ఆదర్శంగా నిలిచిపోయారు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com