కీర్తి ప్రతిష్ఠల నిర్ణయం

- July 08, 2015 , by Maagulf
కీర్తి ప్రతిష్ఠల నిర్ణయం


పూర్వం గౌతమీ నదీ తీరంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో రామానందుడు చాలా మంది శిష్యులకు వేద విద్యాశాస్త్రాలు బోధించేవాడు. ఆయన బోధనను పుస్తకాల ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా చూపించి వాటిలోని సారాన్ని తెలియ జేసేవాడు. అందులో భాగంగా ఒకరోజు రామానందుడు తన శిష్య గణంతో ఒక గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామం మధ్యలో ఒక వ్యక్తి విగ్రహాన్ని చూపించి ఈయన పేరు ధర్మయ్య. పేరుకు తగ్గట్టుగానే అడిగినవారికి అడగని వారికి దానధర్మాలు చేసుకుంటూ పోయాడు. ఆయన కొడుకు ఈ విగ్రహాన్ని కట్టించాడు అని చెప్పి మరికొంచెం దూరం వెళ్లగా అక్కడ ఒక చెరువు కనిపించింది. దాన్ని చూపిస్తూ ఇది ఒకప్పుడు చెత్తచెదారంతో మురికితో నిండిఉండేది. ఈ ఊరిలో దుర్గయ్య అనీ ఒక వడ్డీ వ్యాపారస్తుడు ముక్కు పిండి వడ్డీలకు వడ్డీలు వసూలు చేసేవాడు. దాంతో ఊరి జనానికి దుర్గయ్య పేరు వింటేనే భయం పుట్టుకొచ్చేది. దుర్గయ్య కొడుకు మాత్రం చాలా మంచివాడు. ఆయన ఈ చెరువును బాగుచేయించి, మంచి నీటి చెరువుగా మార్చడంతో ఊరి జనం అంతా దాహార్తిని తీర్చుకోగల్గుతున్నారు. దీంతో అతని తండ్రి మీదున్న చెడు అభిప్రాయం తొలగి ప్రజలకు మంచి భావం ఏర్పడింది అని చెప్పి మరికొంచెం ముందుకు సాగారు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన చేరి ఠారెత్తిస్తున్నాడు. అటు వైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి వీరిని చూసి స్వామీ! ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తారు. మా ఇంటికి రండి విశ్రాంతి తీసుకుని చల్లబడ్డాక వెళ్దురుగానీ అని ఆహ్వానించాడు. దాంతో రామానందుడు తన శిష్యులతో అతని వెంట వెళ్లగా ఆ వ్యక్తి వారికి ఎంతో అతిథి సత్కారాలు చేశాడు. అందుకు రామానందుడు సంతోషించి నీవు చాలా సాంప్రదాయమైన కుటుంబంలో జన్మించి ఉంటావు. నీ పూర్వీకులు చాలా గొప్పవారై ఉంటారు అని అతన్ని ఆశీర్వదించాడు. దానికి ఆ వ్యక్తి లేదు స్వామీ నా పూర్వీకులంతా పెద్ద పేరు మోసిన దొంగలు. నేను కూడా ఒకప్పుడు దొంగతనాలు చేసుకుని జీవనం సాగించేవాడిని. అయితే దుర్గయ్య కొడుకు చేసే పుణ్యకార్యాలను ఆదర్శంగా తీసుకుని ఇలా మంచి వ్యక్తిగా మారాను అని చెప్పాడు. అక్కడి నుండి సెలవు తీసుకుని ఆశ్రమానికి తిరుగు ముఖం పట్టారు రామానందుడు, శిష్యులు. అప్పుడు తన శిష్యులకు రామానందుడు ఈ యాత్రలోని సారాంశాన్ని వివరిస్తూ కీర్తి ప్రతిష్టలు అనేవి శాశ్వతంగా ఒక వ్యక్తితోనే ఉండిపోవు. ఒకప్పుడు చెడ్డవాడైన వ్యక్తి కూడా తను, తనవారి చేతలతో మంచి వ్యక్తిగానూ, ఒకప్పుడు మంచివాడైనా అతను చేసే మంచికి కాలంతో పాటు మార్పు వచ్చి కీర్తి విలువ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఈ ధర్మయ్య కీర్తి విగ్రహం దగ్గరే ఆగిపోయింది. కానీ దుర్గయ్య చెడ్డవాడైనా కానీ కొడుకు ద్వారా అతని కీర్తి ఊరూరా పాకి మర్చిపోలేనంత గా ఎదిగింది. అందుకే కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కావు అనేది తెలుస్తుంది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com