అభినవ తిక్కన ... !

- December 25, 2024 , by Maagulf
అభినవ తిక్కన ... !

మహాత్ముడి ప్రభావంతో కలం పట్టి జాతీయోద్యమ భావాలను ముమ్మరంగా తన కలంతో అక్షరీకరించిన జాతీయ మహాకవి తుమ్మల సీతారామమూర్తి. జాతీయాభిమానం ఆయన జీవనాడి. రాష్ట్రాభిమానం ఆయన ఊపిరి. అందుకే ‘రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబుగార్చి’ రాష్ట్రగానం ఆలపించాడు. మాతృభాషాభిమానం ఆయనకు ప్రాణం. ప్రతి పద్యంలో, పదంలో తెలుగు సొగసుల పరిమళాలను గుబాళింపజేసిన స్వచ్ఛమైన తెలుగుకవి. నైతిక పునరుజ్జీవన వికాసం, విశ్వహిత కాంక్ష, మానవతావాదం, పీడిత మానవ సానుభూతి గ్రామీణశోభ, శ్రామిక జన సంక్షేమం, దోపిడీకి నిరసనలు ఆయన కవితా లక్ష్యాలు. నేడు అభినవ తిక్కనగా, తెలుగులెంకగా, గాంధీజీ ఆస్థాన కవిగా సుప్రసిధ్ధుడైన ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యులు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి జయంతి. 

తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు 1901,డిసెంబర్ 25న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లో భాగమైన అవిభక్త గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకా కావూరు గ్రామానికి చెందిన నారయ్య, చెంచమాంబ దంపతులకు జన్మించారు. ఆయన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. వారి దగ్గర చదివి భాషా పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ‘ఉభయభాషా ప్రవీణు’డయ్యారు. 1930 నుండి 1957వరకు గుంటూరు జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేశారు.

చెరుకుపల్లి గ్రామంలో జరిగిన శతావధాన సభను చూసి పద్య రచన పట్ల మక్కువ పెంపొందించుకున్నారు. ‘ధర్మజ్యోతి’, ‘అమరజ్యోతి’, ‘రాష్ట్ర సిద్ధి’, ‘ఉదయగానం’, పరిగపంట’, ‘శబల’ వంటి పద్య కావ్యాలు రసవత్తరంగా రచించి పద్య కవితా వ్యాప్తికి కృషి చేసిన సంప్రదాయ కవి. ఎక్కట్టు పేరుతో సామాజిక స్పందనతో ముక్తకాలు ప్రచురించారాయన. గాంధీజీ స్వీయచరిత్రను ‘ఆత్మకథ’ పేరిట (1936) హృద్యమైన పద్య కావ్యంగా తీర్చిదిద్దారు. ఈ కావ్యాన్ని గూర్చి తన అనుభూతిని వ్యక్తీకరిస్తూ ‘‘నాకృతులన్నింటనుత్తమము, పవిత్రమునైన ఈ కావ్యము నా సారస్వతానుభూతికి, నా తెనుగుదనమూదలగా రూపెత్తుట నా భాగ్యముగా భావింతును’’ అన్నారు. 

తుమ్మల సీతారామ మూర్తి కవనార్థం ఉదయించిన పుంభావసరస్వతి అతడి కవితా విశేషం అనన్య సామాన్యం. అతడొక కవిత్వ హిమవన్నగపాండితీ మేరునగం. తెలుగుదనం, తెలుగుభాష, తెలుగు రాష్ట్రం పట్ల అపారమైన అనురాగం. జీవితకాలంలో మూడువంతులకు పైగా కవిత్వ రచనలో పునీతం చేసికొన్న కవితా తపస్వి. ఆచార్య సినారె వీరిని ప్రశంసిస్తూ పలికిన ‘తుమ్మల కవిత్వంలో పదునైన భావన, పసగల నుడి పట్టం కట్టుకున్నాయి. వారి కవితాత్మ వయసును జయించింది. వారి నియతాత్మ మనస్సును జయించింది’ అనే పలుకులు తుమ్మల కవితాంతరంగాన్ని ఆవిష్కరిస్తాయి.  

మహాత్ముని ఆస్థానకవిగా చెప్పుకున్న తుమ్మలవారు ‘మహాత్మ కథను’ రచించారు. గాంధేయవాద కవిగా 1920 నుంచి గాంధీ అడుగుజాడల్లో పయనిస్తున్న తుమ్మలవారి సత్యదీక్ష ఆయన మహాత్మ కథకు మెరుగులు దిద్దింది. ‘గాంధీ గానం’, ‘మహాత్మాగాంధీ’, ‘తారావళి’ వంటి లఘుకృతులు ఆయన గాంధేయవాదానికి తార్కాణాలు. గాంధేయవాద కవిగా ‘కవిని నేను గాంధీ కవిని నేను’ అని సగర్వంగా మహాత్ముని ఆస్థానకవిగా ప్రకటించుకున్నారు తుమ్మల. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబా భావే సర్వోదయ సిద్ధాంతాన్ని ‘సర్వోదయ గానం’గా రచించి ప్రశంసలందుకున్నారు.  

ఆయన ‘సందేశ సప్తశతి’లో సామాజికాంశాలైన గొప్ప భావాలను అభ్యుదయ, విప్లవకవుల కంటే మిన్నగా పద్యాల్లో చెప్పారు. భావ విప్లవాన్ని తుమ్మల ఆమోదించారు. భాషా విప్లవాన్ని అంగీకరించలేదు. కాలానుగుణ్యమైన సామాజిక మార్పులను తన కవిత్వంలో స్వాగతించారాయన. కవి ఏ ఇజానికి కట్టుబడకూడదన్న సిద్ధాంతం ఆయనది. ఇజాలకు కట్టుబడే కవుల తత్త్వాన్ని గర్హించారు కూడా. కాలానుగుణంగా సంస్కరణ దృక్పథంతో, భావవిప్లవంతో రచించిన కృతులు కలకాలం నిలుస్తాయన్నది ఆయన విశ్వాసం. ఆధునిక కవి తిలక్‌ ‌కూడా ‘ఇజమ్‌లో ఇంప్రిజనైతే ఇంగిత జ్ఞానం నశిస్తుంది’ అని ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో చెప్పారు. 

పద్యాన్ని నిరసించే సంప్రదాయ వ్యతిరేక విమర్శకులైనా ఆయన భావాలను హర్షింపకుండా ఉండలేరు. ఆయన కవితా విహంగానికి శాంతి, అహింసలు రెండు పక్షాలు. గాంధీజీ ప్రభావంతో జీర్ణించుకున్న శాంతి – అహింసలు ఉన్న తన కవిత్వం, విప్లవ కవితా ప్రపంచంలో ఎంతమంది మెప్పు పొందగలదోనన్న సంశయాన్ని వ్యక్తపరచారు. ఆయన అభ్యుదయ, విప్లవకవుల భాషా విప్లవాన్ని అంగీకరించకున్నా సందర్భోచితంగా ముత్యాల సరాల గేయ ఛందస్సును మాత్రం ప్రయోగించారు. ఆయన ఛందస్సుల మర్మం తెలిసిన మహాకవి. ఛందస్సులు ఆయన భావాభివ్యక్తికి శృంఖలాలు కాలేదు. అవి ఆహ్లాదంతో అశ్వగమనాల్లా సాగాయి. మల్లెమాలల్లా పరిమళించి పాఠకులకు అనుభూతి సుగంధాన్ని పంచాయి. ఆయన విప్లవమంటే గాంధీజీ కాంక్షించిన ఆదర్శ సమాజం. వినోబా భావే కోరుకున్న నవ సమాజం. విప్లవ కవుల సాయుధ పోరాట సిద్ధాంతాన్ని గాంధేయవాదిగా తుమ్మల సమర్థించలేదు. 

తుమ్మలవారు తన కవిత్వంలో దోపిడీ వ్యవస్థను నిరసించారు. స్వార్థపరులైన ధనవంతులు పాపభీతి లేక పేదల రక్తాన్ని కొండ తేనెలా పీల్చేందుకు అలవాటుపడ్డారని ఆవేదనతో నిరసించాడు. దోపిడీ వ్యవస్థలో ధనికుల విలాసవంతమైన భవనాల నిర్మాణానికి తమ శక్తిని ధారపోసిన పేదవాడు ఆకలికి అలమటించి, చలికి చలించి, మొండిరోగాలతో మరణించడానికి స్వార్థపరమైన దోపిడీ వ్యవస్థే కారణమని నిరసించారు తుమ్మలవారు. స్వార్థపరులు విలాస ప్రీతికి పేదవారి పొట్ట కొట్టడం తగదని నిందించారు. పెచ్చు పెరిగిన దోపిడీ వల్ల ధనికుడి సంపద అపరిమితంగా పెరుగుతున్నది. పేదవాడు క్రమేపి పేదరికంలో మగ్గుతున్న స్థితిని సందేశ సప్తశతి కావ్యంలో ‘‘మిద్దెవాడు నాల్గు మేడలవాడామె, గుడిసెవాడు పోయె గుట్టనీడ’’ అన్నారాయన. 

తుమ్మలవారు భాషాపరమైన చమత్కారంతో స్వతంత్ర భారతదేశంలో ప్రజలు కలలు కన్న ‘నవత’ అరసున్నతో వచ్చిందని (నవఁత- రాలేదన్న వ్యతిరేకార్థం) అధిక్షేపించారు. పీడితుల పట్ల మానవతా దృష్టితో సానుభూతి చూపారు. దారిద్య్రంతో, నిరక్షరాస్యతతో అలమటించే అమాయకులు కూడు, గుడ్డ, గూడు లేక ఆక్రోశిస్తున్న స్థితికి ఆర్ద్ర హృదయంతో చలించారు. వారి స్థితి బాగుపడకుంటే సమాజానికి శాంతి లేదని, జీవకాంతి రాదని నిర్మొహమాటంగా చాటారు. 

ప్రజా ప్రభుత్వం సామ్యవాదమైనా, ప్రజాస్వామ్య మైనా, మరే ప్రభుత్వమైనా కూడు, గూడు, గుడ్డలేని బికారి మెప్పు పొందలన్నారు. అదే సమసమాజం. గాంధీజీ కాంక్షించిన ఆదర్శ సమాజం. గాంధేయవాది వినోబా భావే కోరుకున్నసర్వోదయ సమాజం. తుమ్మల వారు తెలుగుదేశపు గ్రామీణ శోభను రమణీయంగా ‘సంక్రాంతి తలపులు’ ఖండకావ్యంలో రైతు జీవితాన్ని పంటల పండుగైన సంక్రాంతితో సమన్వయించి వర్ణించారు. ప్రకృతి వర్ణనల్లో తుమ్మల వారి ప్రత్యేకతను సూచించే •ండకావ్యం ‘చుక్కలు’. ఇందులో ఆకలితో అలమటిస్తూ తమ రక్తమాంసాలను ధనమదాంధులకు బలిపెట్టిన మాలమాదిగలు ఆకాశంలో ‘చుక్కలు’గా వెలిశారని ఉదాత్తంగా వాటిని మానవీకరించి ఉత్ప్రేక్షించారాయన. 

ఆంధ్రాభిమానాన్నీ, ఆంధ్రత్వాన్నీ అణువణువునా జీర్ణించుకొని అక్షరీకరించిన కవి తుమ్మల సీతారామమూర్తి. ‘‘ఆంధ్రుడవై జన్మించితి / వాంధ్రుడవై యనుభవిపుంపుమీ యుర్విభావం / బాంధ్రుడవై మరణింపుము / ఆంధ్రత్వములేని బ్రతుకు నాశింపకుమీ’’ అని తన రాష్ట్ర గానంలో ప్రబోధించారు. 

వైవిధ్యభరితమైన బహుగ్రంథ కర్తగా, జాతీయ కవిగా, గాంధీకవిగా, మానవతావాద మహాకవిగా, సమసమాజ స్థాపనా భావుకతతో సాహితీ ప్రియుల మన్ననలందుకున్న తుమ్మలవారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ఆయన అభిమానులు కనకాభిషేక గండపెండేరాలు బహూకరించి ఎన్నో ఘన సన్మానాలతో సత్కరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు 1985లో డి.లిట్ డిగ్రీతో గౌరవించారు. 1990 మార్చి 21న గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామంలో తన 88వ ఏట కన్నుమూశారు. తెలుగు భాషా సాహిత్యాలున్నంత వరకు తుమ్మలవారు సాహితీప్రియుల హృదయాల్లో చిరస్మరణీయులు. 

- డి.వి.అరవింద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com