భారత రాజకీయ దురంధరుడు - వాజపేయ్
- December 25, 2024
నైతిక విలువలకు కట్టుబడిన రాజకీయం.. పార్టీలకు అతీతమైన రాజనీతిజ్ఞత.. పార్లమెంటులో ఎంపీలనే కాదు.. విద్యారంగ సదస్సులో విద్యావేత్తల్ని, బహిరంగ సభల్లో సామాన్య ప్రజల్ని సైతం సమ్మోహుతుల్ని చేసే ఉపన్యాస ఝరి, భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ వారసత్వ సంపదే ఈ దేశం ఆత్మ అనే తాత్విక అవగాహన.. ఇవన్నీ కలిపితే అటల్ బిహారీ వాజపేయ్ అవుతారు. భారత దేశ రాజకీయాల్లో పార్టీల, సిద్ధాంతాల సరిహద్దులకు అతీతంగా గౌరవాభిమానాల్ని పొందిన ఆజాతశత్రువు ఆయన. భాజపాను స్థాపించి అధికారంలోకి తీసుకురావడమే కాకుండా దేశాన్ని ఐదేళ్ల పాటు పాటించిన తోలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిన రాజకీయ దురంధరుడు వాజపేయ్. భారతదేశ రాజకీయాల్లో సుపరిపాలనకు నిజమైన భాష్యం పాలనా దక్షత ఆయన సొంతం. కర్తవ్య నిర్వహణలో బాధ్యత, మాటలతో కట్టిపడేసే చతురత, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని దృఢమైన మనస్తత్వం వాజపేయ్ ప్రత్యేకతలు. నేడు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయ్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన జీవితంలో స్ఫూర్తినిచ్చే ఘట్టాల అవలోకనం.
అటల్ బిహారీ వాజపేయ్ 1924,డిసెంబర్ 24న ఒకప్పటి సింధియా సంస్థానం యొక్క కేంద్రమైన గ్వాలియర్ పట్టణంలో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణబిహారీ వాజపేయ్, కృష్ణదేవి దంపతులకు జన్మించారు. గ్వాలియర్ పట్టణంలోని విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో డిగ్రీ పూర్తి చేసి, కాన్పూరు (నేటి యూపీ రాష్ట్రంలో ఒక ప్రధాన నగరం) పట్టణంలోని DAV కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. అదే కళాశాలలో లా చదువుతూ మధ్యలోనే ఆపేశారు. చిన్నతనంలోనే కవిత్వం, వక్తృత్వం మక్కువ పెంచుకొని, నిరంతర సాధనతో ఆ రెండిటి మీద పట్టు సంపాదించారు.
వాజపేయ్ చిన్నతనంలోనే ఆరెస్సెస్ సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. సంఘంతో పాటుగా ఆర్య సమాజంలో సైతం సభ్యత్వాన్ని కలిగి ఉండేవారు. యుక్త వయస్సు వచ్చేనాటికి సంఘంతో ఆయన అనుబంధం బలపడి ఆ సంస్థ కోసం పూర్తి స్థాయిలో పనిచేసే సంఘ్ ప్రచారక్ బాధ్యతలు తీసుకునేలా ప్రేరేపించింది. సంఘ్ తరపున నాటి యునైటెడ్ ప్రావిన్స్ (నేటి యూపీ )రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న దశలోనే సంఘ్ తరపున ప్రారంభించిన రాష్ట్రధర్మ, పాంచజన్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. 1950లో జనసంఘ్ ఏర్పాటైన తర్వాత సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి రాజకీయ కార్యదర్శిగా నియమితులై జనసంఘ్ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. కాశ్మీర్ పర్మిట్ రద్దు ఉద్యమంలో పాల్గొని ముఖర్జీ ఆకస్మిక మరణం పొందగా, పార్టీ ప్రధాన కార్యదర్శి దీనదయాల్ ఉపాధ్యాయతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు.
1957లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన వాజపేయ్ లోక్‌సభలో విదేశీ వ్యవహారాల మీద తొలిసారి చేసిన ప్రసంగం నాటి ప్రధాని నెహ్రూను అమితంగా ఆకర్షించింది. ఎంతగానంటే.. అప్పట్లో భారత సందర్శనకు వచ్చిన ఓ విదేశీ నేతకు ఎంపీలను పరిచయం చేస్తూ.. వాజపేయి దగ్గరికి వచ్చే సరికి ‘ఈ యువకుడు ఏదో ఒకనాడు భారతదేశ ప్రధానమంత్రి అవుతారు’ అని నెహ్రూ చెప్పారట. 1962లో ఎంపీగా ఓటమి పాలైనా రాజ్యసభకు ఎన్నికై నెహ్రూ ప్రభుత్వ తప్పులను రాజ్యసభ వేదికగా తూర్పార బట్టారు. ఇదే సమయంలో తన సహాయకుడిగా నియమితులైన అద్వానీని రాజకీయంగా ప్రోత్సహించారు. జనసంఘ్ పార్టీ వ్యవహారాల్లో అద్వానీ పాత్రను మరింత క్రియాశీలకం చేయడం ద్వారా వారి వ్యక్తిగత మైత్రికి పూనాది పడిదింది. 1969లో ఉపాధ్యాయ ఆకస్మిక మరణం తర్వాత వాజపేయ్ - అద్వానీ ద్వయం జనసంఘ్ పార్టీని నడిపిస్తూ బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలిపారు. 1975-77 మధ్యలో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి వాజపేయ్ అరెస్ట్ అయ్యి జైల్లో గడిపారు.
1977లో జనతాపార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు కృషి చేసిన వాజపేయ్ గారికి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా నెహ్రూ విధానాలను సమర్థిస్తూ ఉన్నారని స్వపక్ష నేతలే ఆయన్ని విమర్శిస్తే, ఆయన తన కవితాత్మ ధోరణిలో వాటిని తిప్పికొట్టారు. ఇదే సమయంలోనే ఐరాస ప్రతినిధి సభలో హిందీలో మాట్లాడిన తోలి విదేశాంగ మంత్రిగా వాజపేయ్ చరిత్ర సృష్టించారు. 1979లో ప్రభుత్వంలో జనసంఘ్ నేతలకు, ఇతర నేతలకు వచ్చిన
భేదాభిప్రాయాలు కారణంగా ప్రభుత్వం నుంచి వైదొలిగారు. 1980 సార్వత్రిక ఎన్నికల తర్వాత సంఘ్ పెద్దల ఆశీస్సులతో వాజపేయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) స్థాపించడం జరిగింది. భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1980-84 వరకు కొనసాగారు.
1984 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ వాజపేయ్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. 1985-95 వరకు వాజపేయ్ భారత రాజకీయ ముఖ చిత్రంలో ఎక్కవగా కనిపించరు. ఈ దశాబ్దం మొత్తం ఆయన రాజకీయ సహచరుడు మరియు మిత్రుడైన అద్వానీ వెలుగు వెలిగారు. మిత్రుడి రాజకీయ ప్రభను చూసి వాజపేయ్ ఆనందించారు తప్పించి ఈర్ష్య పడలేదు. ఈ దశబ్దం మొత్తం ఆయన కవితలు రాయడానికి, మిత్రులతో సైదంతిక చర్చలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
1995 నుంచి వాజపేయ్ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లి పార్టీ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా 161 సీట్లను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా 11వ లోక్‌సభలో అవతరించింది. 13 రోజులు పాటు వాజపేయ్ దేశ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, సభలో మెజారిటీని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను మనసులో పెట్టుకొని1996లో అద్వానీని రాజకీయంగా దెబ్బతీసేందుకు నాటి పీవీ సర్కార్ జైన్ హవాలా కుంభకోణంలో ఇరికించడంతో, తన శిష్యుడైన అద్వానీని నైతికంగా, మానసికంగా బలమైన మద్దతుదారుగా నిలిచారు.
1998 - 2004 వరకు వరుసగా రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజపేయ్ దేశాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆరేళ్ళ పాటుగా దేశ ప్రధానిగా కొనసాగిన ఆయన హయాంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటుచేసుకొంది. యువశక్తి అత్యంత చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి ఒక దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్ జీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి చాలా శ్రద్ధ తీసుకుంది. అదే సమయంలో భారత్‌లో సంధాన సదుపాయాల కల్పన విషయంలోనూ ముందుచూపు కనిపించింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలా మంది గుర్తు పెట్టుకుంటున్నారు.
సామాజిక రంగం విషయానికి వస్తే, సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాలవారికీ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలని అటల్ జీ కన్న కలను గురించి ప్రధానంగా చెబుతుంది. అలాగే, ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక ఆలోచనా విధానాలతో సాగిన దేశంలో... ఆర్థిక పురోగతికి బాటవేసి, అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు వాజపేయ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది.
1998 మే నెలలో వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత్.. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో ఐదు భూగర్భ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. శత్రుదేశాల గుండల్లో రైళ్లు పరిగెత్తించింది. 1974లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించగా.. మళ్లీ 24 ఏళ్ల తర్వాత "ఆపరేషన్ శక్తి" పేరిట పోఖ్రాన్లో ఆ పరీక్షలు జరిపి తన అణ్వాయుధ పాటవాన్ని యావత్ ప్రపంచం ఎదుట చాటిచెప్పింది. తొలుత ఆంక్షలు విధించిన అమెరికా.. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ కేవలం ఆరునెలల్లోనే వాటిని ఎత్తివేసింది.
వాజపేయ్ హయాంలో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం.. భారత సైన్యం చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. 1999 మే నెలలో పాకిస్థాన్ సైనికులు, మిలిటెంట్లు కార్గిల్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో చొరబాట్లు, ఆక్రమణ ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టటానికి మే నెల 26న భారత సైన్యం "ఆపరేషన్ విజయ్"ను ప్రారంభించింది. 3 నెలలపాటు జరిగిన యుద్ధంలో 500 మందికిపైగా జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్ వైపున దాదాపు 4 వేల మంది సైనికులు, మిలిటెంట్లు మరణించినట్లు తర్వాత కాలంలో నివేదికలు వెల్లడయ్యాయి. కార్గిల్ విజయంతో దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వాజపేయ్ ప్రతిష్ఠ పెరిగిపోయింది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణాలను పునర్నిర్వచించిన ఎన్డీయేకు అటల్జీ నాయకత్వం వహించారు. అందరినీ ఒక్కచోట చేర్చి అభివృద్ధి, జాతీయ ప్రగతి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చే శక్తిగా ఎన్డీయేను తయారుచేశారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ ఆయన మాటలు ఆ సమయంలో శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడలాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టేవారు.
అధికారం కోసం ఏనాడూ వాజపేయ్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు.1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆయన రాజీనామా చేయడానికి మొగ్గు చూపారే తప్ప, ఎలాంటి నీచ రాజకీయాలకు, బేరసారాలకు పాల్పడలేదు.. 1999లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ ఆయన మాత్రం న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో అటల్జీ ఉన్నత స్థానంలోనే ఉంటారు.
వాజపేయ్ భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ పార్లమెంటేరియన్లలో ఒకరిగా పేరుగాంచారు. ఆయన ఎల్లప్పుడూ చర్చలు, ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేసేవారు. అధికారపక్షం విపక్షాల గొంతు నొక్కటాన్ని ఆయన ఎన్నడూ సమర్థించేవారు కాదు. అలాగే, విపక్షం పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టటాన్నీ ఆమోదించేవారు కాదు. పత్రికా స్వాతంత్రానికి వాజపేయ్ అమిత ప్రాధాన్యతనిచ్చేవారు. 2003లో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ 125వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ, ‘భారత ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ విడదీయరాని భాగం. దానికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది. ఈ దేశ సంస్కృతి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించటమే కాదు.. స్వయంగా భిన్నాభిప్రాయాలకు అండగా ఉంటుంది. భిన్న వాదనలను ప్రోత్సహిస్తుంది’ అని చెప్పారు.
2002లో యూజీసీ స్వర్ణోత్సవాల్లో విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని హోదాలో వాజపేయ్ చేసిన ప్రసంగాన్ని వింటే.. విద్యారంగాన్ని అమితంగా ప్రేమించే ఓ విద్యావేత్త మాటల్లాగా ఉంటాయి. ‘విద్య అసలు సారం స్వీయ ఆవిష్కరణ. నిన్ను నువ్వు ఒక శిల్పంగా మల్చుకోవటమే ఆ ప్రక్రియ. విద్య ద్వారా లభించే శిక్షణ ఏదో ఒక రంగంలో కొన్ని మెళకువలనో, ఎంతో కొంత జ్ఞానాన్నో సంపాదించటం కాదు.. నీలోని మేధోపరమైన, కళాత్మకమైన, మానవత్వంతో కూడిన సామర్థ్యాలను ఆ శిక్షణ వికసింపజేయాలి’ అని ఉద్బోధించారు.
దేశ విభజన జరిగి భారత్-పాకిస్థాన్‌లుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీసును వాజపేయ్ హయాంలోనే ప్రారంభించారు. ఢిల్లీ-లాహోర్ బస్సును ప్రారంభిస్తూ 1999 ఫిబ్రవరిలో వాజపేయి స్వయంగా పాకిస్థాన్‌కు బస్సులో వెళ్లారు. ఈ బస్సు యాత్ర పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరిచింది. వాజపేయ్, నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంయుక్తంగా లాహోర్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ డిక్లరేషన్ నిర్దేశించింది. ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడుతున్న దశలో సంభవించిన కార్గిల్ చొరబాట్లు పరిస్థితిని తిరిగి క్షీణింపజేశాయి. అనంతరం రెండేళ్లకు 2001లో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్ఫతో ఆగ్రాలో జరిపిన శిఖరాగ్ర సమావేశం కూడా గొప్ప మలుపు. అయితే, అది ఆశించిన ఫలితాలను సాధించలేదు.
భారతీయ సంస్కృతితో అటల్జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండేవారు. అటల్జీ వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. ఆయన జీవితం సాహిత్యం, అభివ్యక్తి పట్ల ప్రేమతో నిండిపోయింది. ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్ఫూర్తి నింపేందుకు, ఆలోచనలను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది.
అటల్జీ నుంచి నేర్చుకొనే, సంభాషించే అవకాశం దక్కడం ఎంతో మంది రాజకీయ నాయకులు అదృష్టంగా భావించేవారు. భారత దేశ రాజకీయాల్లో ఆయన ఎంతో యువతను రాజకీయంగా ప్రోత్సహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపప్రధాని అద్వానీ, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, దివంగత నేతలైన మనోహర్ పారికర్, ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వంటి ఎందరినో రాజకీయాల్లో ప్రోత్సహించిన ఘనత వాజపేయ్ గారికి మాత్రమే దక్కుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ సీఎంలైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గార్లు సైతం వాజపేయ్ స్పూర్తితో అభివృద్ధి రాజకీయాలు చేస్తూ ఆయా రాష్ట్రాల ప్రగతికి బాటలు పరుస్తున్నారు.
వాజపేయ్ ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. అలాగే, ఆయన పుట్టిన రోజును" జాతీయ సుపరిపాలన దినోత్సవం"గా ప్రకటించింది. అనారోగ్యం కారణంగా తన 93వ ఏట 2018,ఆగస్టు 16న కన్నుమూశారు. ఆయన నమ్మిన సిద్ధాంతం, అధికారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటిదానినే ఎంచుకొవడానికి ఏమాత్రం సంకోచించేవారు కాదు. కాంగ్రెస్ చూపిస్తున్న ప్రపంచాన్ని కాకుండా, మరో దృక్కోణంలో ప్రపంచాన్ని చూడటం సాధ్యమేనని ఆయన దేశాన్ని ఒప్పించగలిగారు. వాజపేయ్ గారిని ఒక పార్టీకి, ఒక వర్గానికి ప్రతినిధిగా భారత ప్రజలు ఏనాడు చూడలేదు. దేశాన్ని ప్రగతి పథంలో వికాస పురుషుడిగా ఆయన భారత దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







