పొలిటికల్ షో మ్యాన్-ఆనం వివేకానంద రెడ్డి
- December 25, 2024
తెలుగు నాట రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆనం వివేకానంద రెడ్డి. ఆయన పెట్టే ప్రెస్ మీట్లలో ప్రదర్శించే వైవిధ్యమైన హావభావాలతో సామాన్య ప్రజల మొహాల్లో నవ్వులు పూయించారు.ఉమ్మడి రాష్ట్రంలో తన వేష భాషలతో పాటుగా తనదైన వ్యవహార శైలితో "పొలిటికల్ షో మ్యాన్" గా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. నెల్లూరు యాసతో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన చేసే విమర్శలకు ఉక్కిరి బిక్కిరి కాని నేతలు లేరంటే అతిశయోక్తి కాదు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా, మంత్రి పదవులు వెతుక్కుంటూ వచ్చినా, తన విధానానికి సరిపడవని తిరస్కరించిన ఏకైక నాయకుడు వివేకానంద. నేడు సింహాపురి రాజకీయ దిగ్గజం ఆనం వివేకానంద రెడ్డి గారి జయంతి.
ఆనం వివేకానంద రెడ్డి 1950, డిసెంబర్ 25న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని నెల్లూరు పట్టణంలో ఆనం వెంకట రెడ్డి, వెంకట రమణమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వి.ఆర్.కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వివేకా, తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కళాశాలలో బీఏ, యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ ఆఫ్ జనరల్ లా(BGL) డిగ్రీలను పూర్తి చేశారు. ఆనం కుటుంబానికి 9 దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర ఉంది. వివేకా పెదనాన్న ఆనం చెంచు సుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హోమ్, కమర్షియల్, పరిశ్రమలు, పి.డబ్ల్యూ.డి, సినిమాటోగ్రఫీ మరియు మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేశారు. తండ్రి వెంకట రెడ్డి, అన్న సంజీవ రెడ్డి, తమ్ముడు రాం నారాయణ రెడ్డిలు సైతం మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో రాం నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
పెదనాన్న, తండ్రి స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టారు వివేకానంద రెడ్డి. 1978 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనం కుటుంబం కాంగ్రెస్ నుంచి జనతా పార్టీలోకి చేరి ఎన్నికల్లో పోటీ చేయగా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో నెల్లూరు జిల్లాలోనే కాక, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆనం కుటుంబం కథ ముగిసింది అనే సమయంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన రెడ్డి సహకారంతో వివేకా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరి 1981లో నెల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1982లో నెల్లూరు జిల్లా లాండ్ మోర్ట్‌గేజ్ బ్యాంకు ఛైర్మన్ అయ్యారు. అదే ఏడాది మధ్యలో నెల్లూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన తండ్రి, తమ్ముడితో కలిసి తెదేపాలో చేరారు.
1983 ఎన్నికల్లో తెదేపా వ్యవస్థాపక సభ్యుడు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సహకారంతో తన తండ్రి వెంకట రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి, తమ్ముడు రాం నారాయణ రెడ్డికి టిక్కెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నారు. 1983-89 వరకు తెదేపాలో కొనసాగిన వివేకా తన తమ్ముడు రాం నారాయణ రెడ్డికి మంత్రి పదవిని ఇప్పించుకున్నారు. ఇదే సమయంలో వివేకా నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో తెదేపా ఓటమి తర్వాత నేదురుమల్లి సహకారంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994లో తన తమ్ముడు రాం నారాయణను రాపూరు నుంచి గెలిపించుకోవడమే కాక, 1995లో తానూ నెల్లూరు మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
1995-99 వరకు మున్సిపల్ ఛైర్మన్ గా నెల్లూరు నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్ల ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో సైతం అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు రూరల్ నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా రికార్డ్ సృష్టించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి నెల్లూరు జిల్లాను శాసించిన ఆనం వారి రాజకీయ కుటుంబం నుంచి రెండో తరం ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేకా రాజకీయాలే సర్వస్వంగా తన చివరి శ్వాస వరకు బతికారు. రాజకీయం తప్ప వేరొక ఆయనకు తెలియదు. అలా, అని ఆయన రాజకీయ ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎత్తు పల్లాల బాటలో, ఎగుడు దిగుడుగా నడిచింది. ఎన్నో ఎదురు దెబ్బలు. ఎన్నెన్నో ఆశాభంగాలు. వాటన్నిటినీ ఎదుర్కొని, ఎంత కష్టమైనా భరించి, ఎన్ని అవమానాలైనా దిగమ్రింగి, తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకొనేవారు. ప్రజలకు, తమ కుటుంబానికి వారధిగా నిలిచేందుకు ఎన్టీఆర్, వైఎస్సార్, రోశయ్యలు పిలిచి మరీ మంత్రి పదవులు ఇస్తామన్న నిర్ద్వందంగా తిరస్కరించారు.
తన అవసరం కోసం ఎంతటి వాడినైనా మచ్చిక చేసుకోవడం వివేకానందరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆ అవసరం తీరిన తర్వాత సహాయం చేశాడన్న కృతజ్ఞత లేశ మాత్రం లేకుండా, వెటకారపు మాటలతో మానసిక క్షోభ పెట్టేవారు. వివేకా రాజకీయ విజయ యాత్రకు ఆ సిద్ధాంతమే ఉపకరించింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివేకాకు రాజకీయంగా చేయూత ఇవ్వని నేత లేడు; వివేకా చేత మాటలు పడని నేత లేడు.
విచిత్ర వేష ధారణ, వినోదం కల్గించే వ్యవ హార శైలి, సినిమా తరహా స్టైలిష్ నడవడిక వివేకానందరెడ్డి జీవన శైలిలో ఒక భాగం. నెల్లూరు నగరంలో ఎమ్యెల్యేగా పర్యటనకు వెళ్లినప్పుడల్లా, క్రింద కూర్చొని దోశలు పోయడం, ఇస్త్రీ బండి వద్ద నిలుచుని బట్టలు ఇస్త్రీ చేయడం, చీరలంగడి ప్రారంభానికి వెళ్తే అక్కడి చీరలు వంటికి చుట్టుకొని ఫోటోలు తీయించుకోవడం వంటి చిత్ర విచిత్ర ప్రచార కార్యక్రమాలతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేవారు.
వివేకానందరెడ్డి పత్రికా విలేఖరుల సమావేశాలు నెల్లూరు ప్రజలకే కాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చక్కటి వినోద కాలక్షేపాలు, ఎంతటివాడినైనా, తన నెల్లూరు యాసతో కూడిన వెటకారపు మాటలతో వ్యాఖ్యానించేవాడు. పత్రికా సమావేశాల నిర్వహణలో సైతం వివేకా మార్క్ స్పష్టంగా ఉండేది. నెల్లూరులోని బోడిగాడి తోట సశ్మానంలో, నెల్లూరు చెరువు పడవలో పెట్టేవారు. ప్రతి అంశాన్నీ ఒక వినోదంగా మార్చడం వివేకా శైలి, వాటిలో ఎంత వినోదం వుండేదో. అంత తీవ్రమైన విమర్శ, పరుష పద జాలం కూడా వుండేవి.
నాలుగు దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయడం వల్ల చివరి రోజుల్లో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి ఆయన్ను ఆవహించింది, మరొకరైతే, ఆనాటి నుంచే మానసికంగా కృంగి పోయే పరిస్థితి. వివేకా మాత్రం ధీరోదా త్తంగా, అనూహిత ఆత్మబలంతో దాన్ని ఎదిరించి పోరాడాడు. ఏ మాత్రం మానసిక స్థైర్యం కోల్పోలేదు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2018, ఏప్రిల్ 25న తుదిశ్వాస విడిచారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







