వ్యాపార దిగ్గజం-ధీరూభాయ్ అంబానీ
- December 28, 2024
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భాగస్వామిగా మారిన వ్యాపారవేత్తల్లో ధీరూభాయ్ అంబానీ ఒకరు. జీవిత ప్రారంభంలో బ్రతుకు తెరువు కోసం దేశం కానీ దేశంలో పెట్రోల్ బంకులో పనిచేసిన ధీరూభాయ్ అనంతర కాలంలో రిలయన్స్ సంస్థను స్థాపించి వేల కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపార సామ్రాజ్యానికి విస్తరించారు. నేడు ప్రపంచంలోనే రిలయన్స్ అత్యంత విలువైన వ్యాపార సంస్థగా కొనసాగుతోంది. నేడు ప్రముఖ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ జయంతి.
ధీరూబాయ్ పూర్తి పేరు ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ. 1932, డిసెంబర్ 28న ఒకప్పటి ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో భాగమైన సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న జునాగఢ్ రాజ్యంలోని చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ, జమ్నాబెన్ దంపతులకు జన్మించారు. హై స్కూల్ విద్యతోనే ఆపేసిన ధీరూభాయ్ కొద్దీ కాలం పండ్ల విక్రయాల వ్యాపారంలో ఉన్నారు. అలా, చిన్న వ్యాపారాలు చేస్తూ కాలాన్ని గడిపిన తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమన్ వెళ్లి ఏడెన్ నగరంలోని పెట్రోల్ బంకులో ఉద్యోగిగా పనికి కుదిరారు. అక్కడ ఆయన నెలకు 300 రూపాయలు జీతంగా తీసుకునేవారు. కొద్దీ కాలానికే పెట్రోల్ బంకు సూపర్ వైజర్ అయ్యారు. ఏడెన్ నగరంలో పనిచేసే సమయంలోనే అరబిక్ భాష నేర్చుకుని స్థానిక వ్యాపారులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత కాలంలో ఈ సంబంధాలే ఆయన వ్యాపార విజయానికి పూనాదులు వేశాయి.
1958లో భారతదేశానికి తిరిగి వచ్చిన ధీరూభాయ్ అంబానీ తన బంధువు చంపక్ లాల్ దమానితో కలిసి రిలయన్స్ పాలిస్టర్ నూలు వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు దిగుమతి ఇంకా ఎగుమతి చేశారు. తరువాత ఇద్దరూ విడిపోయారు. 1960 ప్రాంతంలో భారతదేశంలో రేయాన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే నైలాన్ ని మాత్రం దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అప్పటి ప్రభుత్వం రేయాన్ ఎగుమతి చేసే సంస్థలకు నైలాన్ దిగుమతుల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ నిర్ణయం అంబానీ వ్యాపార జీవితాన్ని మలుపు తిప్పింది.
రిలయన్స్ పరిశ్రమలో రేయాన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసి దానికి తగినంత నైలాన్ దిగుమతి చేసుకుని ఎక్కువధరకు అమ్మి లాభం సంపాదించారు. ఆ తర్వాత ఆయన సింథటిక్ ఉత్పత్తి మీద దృష్టి సారించారు. కేవలం పదేళ్ళ కాలంలోనే సింథటిక్, పాలిస్టర్ ఉత్పత్తిలో రిలయన్స్ దేశంలో అగ్రశ్రేణి సంస్థల సరసన చేరింది. సంవత్సరానికి 10వేల టన్నుల పాలిస్టర్ నూలు ఉత్పత్తి లక్ష్యంగా ముంబైకి సమీపంలోని పాతాళగంగ వద్ద 1980లో ఆధునిక పరిశ్రమను స్థాపించారు. ఆ తర్వాత క్రమంగా 35 వేల టన్నుల, 50 వేల టన్నుల సామర్థ్యానికి పెంచుకుంటూ పోయారు. 1985 రిలయన్స్ టెక్సటైల్స్ ఇండస్ట్రీస్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చారు.
90వ దశకం మొదటి నుంచి క్రమంగా పెట్రోలియం, టెలి కమ్యూనికేషన్ల రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. 1999లో జామ్ నగర్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేశారు. ధీరూభాయ్ అంబానీ మరణించే నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తుల విలువ 50 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. భారత వ్యాపార రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పూరస్కారాన్ని ప్రదానం చేసింది. భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన అంబానీ తన 69వ ఏట గుండె పోటు కారణంగా 2002, జూలై 6న ముంబైలో మరణించారు. అంబానీ మరణించి రెండు దశాబ్దాలు అవుతున్నా, ఆయన స్థాపించిన రిలయన్స్ సంస్థలు నానాటికి దేదీప్య మానంగా వెలిగిపోతూ ఎందరికో ఉపాధి కల్పిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతూనే ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







