చట్టవిరుద్ధ కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపిన అబ్కారీ శాఖ: రాహుల్ దేవ్ శర్మ

- December 31, 2024 , by Maagulf
చట్టవిరుద్ధ కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపిన అబ్కారీ శాఖ: రాహుల్ దేవ్ శర్మ

విజయవాడ: ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసిన ఫలితంగా విభిన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్), నార్కోటిక్ డ్రగ్స్,  సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్)పై ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం చేపట్టిన దాడులు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. గణాంకాల ప్రకారం, 2024 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ 14,539 ఐడి మద్యం, బెల్లం కేసులను గుర్తించిందన్నారు.6,157 మందిని అరెస్టు చేయటమే కాక, 1,68,185 లీటర్ల ఐడి మద్యం, 381 వాహనాలు సీజ్ చేసామన్నారు.  61, 09, 472 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసామన్నారు.ఎన్‌డిపిఎల్ మద్యంకు సంబంధించి 8,681 , ఎన్‌డిపిఎస్ పరంగా 149 కేసులు నమోదు చేసి,  362 మంది నిందితులను అరెస్టు చేశామని రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. 4,983 కిలోల గంజాయి, 11.3 కిలోల ఓపియం గసగసాలు, 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.అక్రమ కల్లు వ్యాపారం నియంత్రణలో భాగంగా 266 కేసులు నమోదు చేసి 58 మందిని అరెస్టు చేసామని, 94 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేసారు. 

నూతన సంవత్సరం ఆగమన శుభవేళ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ అబ్కారీ శాఖ చేపట్టిన ప్రయత్నాలు గణనీయమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. అక్రమ మద్యం, ఇతర నిషేధిత పదార్థాల అమ్మకాలు, పంపిణీని నిరోధించడానికి భవిష్యత్తులో సైతం అవిశ్రాంతంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.  కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి, అబ్కారీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసామని,  ఎక్సైజ్ సంబంధిత నేరాల గురించి ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్-ఫ్రీ నంబర్ (14405) అందుబాటులో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను మద్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు నవోదయం 2.0 పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. 

నూతన సంవత్సర వేడుకల కోసం నేడు వ్యాపార గంటల పొడిగింపు

నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో 2025 జనవరి 1వ తేదీన కూడా మద్యం దుకాణాలు, బార్‌ల పని వేళలను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి  12 గంటల వరకు మద్యం దుకాణాల వారు విక్రయాలు జరుపుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసారు.సాధారణ బార్ లతో పాటు ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బార్ లు, ఇన్-హౌస్ , ఈవెంట్ పర్మిట్  లైసెన్స్‌లు కలిగిన వారు  రాత్రి ఒంటిగంట వరకు మధ్యం సరఫరా చేయవచ్చు. అయితే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఐడీ మద్యం అమ్మకాలు అమ్మకాలపై గట్టి నిఘా ఉంటుందని మీనా స్పష్టం చేసారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com