ఫ్రీ WIFI సేవలు అందించే తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా

- January 02, 2025 , by Maagulf
ఫ్రీ WIFI సేవలు అందించే తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా

న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో ఉచిత వైఫై సేవలు అందించడం ద్వారా చరిత్ర సృష్టించింది. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా, దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9, మరియు సెలెక్ట్ ఎయిర్ బస్ ఏ321 నియో విమానాల్లో అందుబాటులో ఉంటాయి.

విమాన ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు విమానం 10 వేల అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు ఒకేసారి పలు పరికరాలను వైఫైకి కనెక్ట్ చేసి, నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాలో చాటింగ్, మరియు టెక్ట్స్ మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేయవచ్చు.

ఇంట్రడ్యూసరీ పీరియడ్‌లో భాగంగా, దేశీయ సర్వీసుల్లో ఈ వైఫై సేవలు కాంప్లిమెంటరీగా అందిస్తారు.ఈ నిర్ణయం ద్వారా ఎయిర్ ఇండియా, దేశీయ విమానాల్లో ఇన్-ఫ్లైట్ వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా నిలిచింది. గతంలో, విస్తారా ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ రూట్లలో వైఫై సేవలు అందించగా, ఇప్పుడు ఎయిర్ ఇండియా దేశీయ రూట్లలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.

ఈ సేవలు అందుబాటులోకి రావడంతో, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా అనుభవించగలరు.ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం, విమాన ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com