గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు

- June 28, 2016 , by Maagulf
గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు

ఉన్న ఊళ్లో బతుకుదామంటే కరువు పగపట్టింది. పొట్టకూటి కోసం పక్క దేశానికి వెళితే అమాయకత్వంతోనో, తెలిసీతెలియనితనంతోనో కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉన్న ఊరికి రాలేక, ఉన్న చోట బ్రతకలేక నరకం అనుభవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొన్ని వందల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. సౌదీ, దుబాయ్ దేశాలకు ఎన్నో కలలతో వెళ్లిన తెలుగు ప్రజలు ఆ కలలన్నీ కల్లలవడంతో కుమిలిపోతున్నారు. డ్రగ్స్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి పరిస్థితి మరీ ఘోరం. గల్ఫ్ దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఈ శిక్షలకు ఎంతోమంది తెలుగువారు బలైపోయారు. బలవుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్‌కి డ్రగ్స్ కేసులోనే మరణ శిక్ష పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన దాదాపీర్ కువైట్‌లో తన గదిలో డ్రగ్స్‌తో దొరికిపోయాడు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించారు. 2007-13 సంవత్సరాల మధ్య కువైట్‌లో ఉరిశిక్ష అమలును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. పెరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని 2013లో మళ్లీ ఉరిశిక్షను అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలోనే వివిధ కేసుల్లో కొందరికి ఉరిశిక్ష పడింది. ఈ ఉరిని అమలు చేసే సమయంలో జర్నలిస్టులను పిలిచి మరీ శిక్షను విధించడం గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగువారి దీన స్థితికి నిదర్శనం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com