యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ కె.ఎస్.ఆర్.దాస్
- January 05, 2025
శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో ప్రేక్షకులను తమ యాక్షన్ చిత్రాలతో అధికంగా అలరించి మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. తెలుగు సినిమాను పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాల నుంచి క్రైమ్ అండ్ యాక్షన్ వైపు పరుగులు తీయించిన దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో ఈ పంథాలో సినిమాలు తీసి మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. నేడు టాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం దాస్ గారి జయంతి.
కె.ఎస్.ఆర్.దాస్ పూర్తి పేరు కొండా సీతారామదాస్. 1936, జనవరి 5న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని వెంకటగిరి జమీందారీకి ప్రధాన కేంద్రమైన వెంకటగిరి పట్టణంలో జన్మించారు. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. థియేటర్లో పనిచేస్తున్న రోజుల్లో ప్రతిరోజూ సినిమాలు చూస్తూ వాటి గురించి విశ్లేషించేవారు. ఒకసారి గేటు పక్కన నిలబడి సినిమా చూస్తూ అందులోని సన్నివేశాల గురించి విమర్శిస్తూ మాట్లాడారు. తనైతే ఇలాంటి సినిమాలు వంద తియ్యగలను అన్నారు. అతని మాటలు పక్కనే ఉన్న ప్రముఖ నిర్మాత ఎస్.భావనారాయణ విన్నారు. సినిమాలపై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి అతన్ని మద్రాస్ రమ్మన్నారు.అక్కడ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేర్పించారు. ఎడిటర్ గా పనిచేసే రోజుల్లోనే తన పేరును కుదించుకున్నారు.
ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో 20 సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆయన పనిచేసిన తొలి సినిమా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బండరాముడు. దాదాపు 10 సంవత్సరాల పాటు భావనారాయణ సంస్థలోనే పనిచేసిన దాస్ అదే సంస్థ నిర్మించిన లోగుట్టు పెరుమాళ్ళ కెరుక చిత్రంతో దర్శకుడయ్యారు. మూడో చిత్రం కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించిన రౌడీరాణి. ఈ సినిమాలో విజయలలిత హీరోయిన్. దక్షిణాదిన ఇదే తొలి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడం విశేషం. ఇది చాలా పెద్ద హిట్ కావడంతో దాస్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా క్రైమ్, జేమ్స్‌బాండ్, యాక్షన్, జానపద, సాంఘిక చిత్రాలను డైరెక్ట్ చేశారు. వాటిలో ఎక్కువ శాతం విజయం సాధించాయి. ముఖ్యంగా క్రైమ్ అండ్ యాక్షన్ మూవీస్ ఒరవడి పెంచిన ఘనత ఖచ్చితంగా కె.ఎస్.ఆర్.దాస్దే. తను చేసే సినిమాల టైటిల్స్ దగ్గర నుంచి హీరో గెటప్స్ వరకు అన్నీ ప్రత్యేకంగానే ఉండేవి. ఆయన సినిమా అనగానే యాక్షన్ సీన్స్ అధికంగా ఉంటాయనే పేరు సంపాదించారు. ఓ ఫైట్ కు మరో ఫైట్ కు సంబంధం లేకుండా ఏదో ఒక స్కీమ్ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించేవారు దాస్. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై దాస్ కు మంచి పట్టు ఉండేది. అందువల్ల ఓ నెల రోజుల్లోనే మొత్తం సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేవారు దాస్.
ఆయనలోని వేగం గమనించిన ఎందరో తమిళ, కన్నడ, హిందీ నిర్మాతలు సైతం దాస్ తో సినిమాలు నిర్మించారు. నిర్మాత పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వచ్చేలా నిర్మాణదశ నుండే ప్రణాళికలు రూపొందించేవారు దాస్. దాంతో నిర్మాతలకు ఏ మాత్రం సమస్యలు ఎదురయ్యేవి కావు. కె.ఎస్.ఆర్.దాస్ తో సినిమా నిర్మించే నిర్మాతలకు ఫైనాన్సియర్స్ కూడా చప్పున పైకం అందించేవారు. అలా అన్ని భాషల్లో వందకు పైగా చిత్రాలు తీయగలిగారు.
సూపర్ స్టార్, నట శేఖరుడైన కృష్ణ గారి కాంబినేషన్లో దాస్ 30 సినిమాలు చేశారంటే.. ఈ కాంబినేషన్‌కి ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ‘టక్కరి దొంగ – చక్కని చుక్క’తో మొదలైన కృష్ణ, కె.ఎస్.ఆర్.దాస్ కాంబో తెలుగు చిత్రసీమలో పలు యాక్షన్ మూవీస్ తో సందడి చేసింది. తెలుగు తెరపై తొలి కౌబోయ్ చిత్రంగా కృష్ణ సోదరులు నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిలచింది. ఈ చిత్రాన్ని కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
కృష్ణతో దాస్ తెరకెక్కించిన “బంగారు కుటుంబం, ప్రేమజీవులు, ఈనాటి బంధం ఏనాటిదో” వంటి కుటుంబకథా చిత్రాలూ ఉన్నాయి. అయితే అవి అంతగా అలరించలేకపోయాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ తో రూపొందిన ‘మామాఅల్లుళ్ళ సవాల్’ ఆకట్టుకుంది. ఇక వారి కలయికలో రూపొందిన ” హంతకులు-దేవాంతకులు, కత్తుల రత్తయ్య, మంచివాళ్ళకు మంచివాడు, భలే దొంగలు, దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి” వంటి యాక్షన్ మూవీస్ మురిపించాయి. కృష్ణ, దాస్ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘ఇన్ స్పెక్టర్ రుద్ర’ . కృష్ణను యాక్షన్ హీరోగా నిలపడంలో కె.ఎస్.ఆర్.దాస్ పాత్ర ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.
కె.ఎస్.ఆర్. దాస్ గారికి నటరత్న ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయనతో ఓ పౌరాణిక చిత్రం తీయాలని ఆశించారు. అయితే దాస్ కెరీర్లో ఒకే ఒక్క సినిమా ‘యుగంధర్’ కోసం ఎన్టీఆర్ తో పనిచేసే అవకాశం లభించింది. ‘డాన్’ హిందీ రీమేక్ గా రూపొందిన ‘యుగంధర్’ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక కన్నడలో 20 సినిమాలు చేసిన దాస్.. అందులో 14 సినిమాలు హీరో విష్ణువర్థన్తోనే చేయడం విశేషం. ఇక నిర్మాతగా 18 సినిమాలు నిర్మించారు. ఈ నాటికీ యాక్షన్ మూవీస్ తెరకెక్కించే కన్నడ దర్శకులు దాస్ పేరునే స్మరించుకుంటూ ఉంటారు. అదీ కన్నద చిత్రసీమలో దాస్ సాధించిన ఘనత.
దాస్ చేసిన సినిమాలు కమర్షియల్ హిట్స్ సాధించినా అవి యాక్షన్ అండ్ క్రైమ్ చిత్రాలు కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాలేదు. అయితే కన్నడ ప్రభుత్వం పుట్టన్న కణగల్ అవార్డుతో కె.ఎస్.ఆర్. దాస్‌ను సత్కరించింది. థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేసిన దాస్.. ఆ సమయంలో ఛాలెంజ్ చేసినట్టుగానే ఇండస్ట్రీకి వచ్చి 100కి పైగా సినిమాలను రూపొందించారు. ఆయన చివరి చిత్రం 2000లో వచ్చిన నాగులమ్మ. ఆ తర్వాత వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరికి 2012 జూన్ 8న చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ నాటికీ డిషుమ్ డిషుమ్... అంటూ సౌండ్ చేసేవారు ఎందరో ఉన్నారు. దానిని బట్టే దాస్ ఇమేజ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







