బెంగాల్ ఉక్కు మహిళ - మమతా బెనర్జీ

- January 05, 2025 , by Maagulf
బెంగాల్ ఉక్కు మహిళ - మమతా బెనర్జీ

దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నేత మమతా బెనర్జీ. మొండి పట్టుదల, మొక్కవోని దీక్షతో పశ్చిమ బెంగాన్ని రాష్ట్రాన్ని తమ కంచుకోటలాగా మార్చుకున్న మూడు దశాబ్దాల కామ్రేడ్ల పాలనకు స్వస్తి పలికిన రాజకీయ ధీరురాలిగా నిలిచారు. అంతకు ముందు దేశ రాజకీయాల్లో సైతం తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా, బెంగాల్ సీఎంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు, పనిచేస్తూనే ఉన్నారు మమతా. నేడు బెంగాల్ ఉక్కు మహిళ మమతా బెనర్జీ జన్మదినం. ఈ సందర్బంగా ఆమె రాజకీయ ప్రయాణాన్ని క్లుప్తంగా మీకోసం.. !

దీదీ(పెద్ద అక్క)గా భారత దేశ రాజకీయాల్లో సూపరిచితులైన మమతా బెనర్జీ 1955, జనవరి 5న కలకత్తా నగరంలోని దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీ దంపతులకు జన్మించారు. మమతా 17 యేళ్ళ వయస్సులో తండ్రి వైద్య వసతి అందక మరణించారు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న మమతా పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని పోషించారు. ఇంకో వైపు జోగమయా దేవి కళాశాల నుంచి బీఏ హిస్టరీ, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇస్లామిక్ హిస్టరీ మరియు జోగేష్ చంద్ర ఛౌదురీ లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేసారు.

మమతా డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విద్యార్ధి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వామపక్ష విద్యార్ధి సంఘాల అల్లర్లకు విసుగెత్తిపోయి ఉన్న ఆమెకు కాంగ్రెస్ విద్యార్ధి విభాగంలో భాగమైన ఛాత్ర పరిషద్ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 70వ దశకంలో  విద్యార్ధి నేతగా ఉన్న మమతాను అప్పటి బెంగాల్ సీఎం, ప్రధాని ఇందిరాకు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన సిద్దార్థ్ శంకర్ రే, ఆమెను రాజకీయంగా ప్రోత్సహించారు. రే ద్వారానే మమతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1975లో కలకత్తా నగరంలో పర్యటిస్తున్న జయప్రకాష్ నారాయణ్ కారుపైకి ఎక్కి ఆయన్ని శాపనార్థాలు పెట్టిన ఫోటోలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఈ ఒక్క సంఘటన వల్ల ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఉదంతం తర్వాత కలకత్తా నగర కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని యువ నాయకురాలిగా ఎదిగారు.

1976-80 వరకు పశ్చిమ బెంగాల్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మమతా, తన గురువు రే ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఒక్కో ఒక్కో మెట్టు ఎక్కుతూ 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా జాదవ్ పూర్ లోక్ సభ నుంచి పోటీ చేసి వామపక్ష దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించారు. సోమనాథ్ పై మమతా విజయం సాధించిన కారణంగా ఢిల్లీ వర్గాల్లో ఆమెకు కావాల్సిన గుర్తింపు రావడం మొదలైంది. రాజీవ్ గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రణబ్ ముఖర్జీని రాజకీయంగా పక్కన పెట్టడంతో మమతాకు రాజకీయంగా కలిసి రావడమే కాకుండా, ఆమెకు ఢిల్లీలో ప్రధానిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసే వెలుసుబాటు లభించింది. ఇదే సమయంలో అఖిల భారత యూత్ కాంగ్రెస్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా సైతం ఎన్నికయ్యారు.

ప్రణబ్ స్థానే రాజీవ్ గాంధీ ప్రతినిధిగా బెంగాల్ రాజకీయాల్లో వామపక్ష కూటమితో తలపడటం మొదలు పెట్టిన మమతా ఆరంభంలో వారి చేతుల్లో పలు మార్లు దాడులకు గురయ్యారు. అయినా పట్టుదలతో వారిని రాజకీయంగా ఎదుర్కొంటూ రాజకీయంగా ముందుకు సాగిన మమతాకు బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లోని కొన్ని వర్గాల వారు మద్దతుగా నిలవడం మొదలు పెట్టారు. 1989లో జాదవ్ పూర్ నుంచి ఓటమి పాలైనా, అప్పటికే రాజీవ్ గాంధీ, రే ఆశీస్సులతో బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకమైన నాయకురాలిగా ఎదిగారు.

ప్రణబ్ రాజకీయ వనవాసాన్ని పూర్తి చేసుకొని తిరిగి కాంగ్రెస్ చేరే నాటికి మమతా బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ఉండటం చేత ఆయన తిరిగి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. 1991లో కలకత్తా సౌత్ నుంచి రెండో సారి ఎంపీగా ఎన్నికైన మమతాను మానవనరులు, స్త్రీ, శిశు సంక్షేమం మరియు యువజన సర్వీసెస్ & క్రీడా శాఖల సహాయ మంత్రిగా అప్పటి ప్రధాని పివి తన  మంత్రివర్గంలో చేర్చుకొని, పాలనాపరమైన ఓనమాలు నేర్చుకొనే అవకాశాన్ని కల్పించారు.

కేంద్రమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ బెంగాల్ రాజకీయ వ్యవహారాల మీదే ధ్యాస ఉండటంతో, అది గుర్తించిన పివి ఆమెను 1993లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి బెంగాల్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టేలా ప్రోత్సహించారు. పివి చెప్పిన విధంగానే ఆమె తన మంత్రి పదవికి రాజీనామా బెంగాల్ పార్టీ  బాధ్యతల్లో నిమగ్నమై బెంగాల్ వామపక్ష ప్రభుత్వంపై ఉద్యమాలు నడుపుతూ ప్రజల్లోకి చొచ్చుకు పోయారు. వామపక్షాలపై రాజీ లేని పోరాటాన్ని చేస్తున్న ఆమెను కలకత్తా నగర ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారు. కలకత్తా సౌత్ నుంచి 1996, 1998,1999,2004 మరియు 2009లలో ఎంపీగా ఎన్నికయ్యారు.  

1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూసిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కేంద్రంలో యూనైటెడ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు నిరసిస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.1998-2004 మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నడిపేందుకు ఆమె ఎంతో కష్టపడ్డారు. పార్టీ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు సైతం ఆమె వద్ద డబ్బులుండేవి కావు. అయితే, కలకత్తా నగర ప్రజల్లో ఆమెకున్న మంచి ఇమేజ్ పార్టీ నిర్వహణకు తోడ్పడేది.

1998 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ 7 స్థానాలను సాధించిన పిమ్మట, కేంద్రంలో వాజపేయ్ సర్కారుకు బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా కొన్ని రాజకీయ ప్రయోజనాలు మమతాకు చేకురాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో అయితే భాజపాతో నేరుగా పొత్తు పెట్టుకొని 8 స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా వాజపేయ్ మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైల్వే మంత్రిగా బెంగాల్ రాష్ట్రానికి నూతన రైల్వేలను మంజూరు చేయించారు. అలాగే, రైల్వే క్లాస్ 4 మరియు ఒప్పంద ఉద్యోగాల్లో మరియు శాఖలోని పలు కీలక  స్థానాల్లో  బెంగాలీలకు ప్రాధాన్యత ఇచ్చారని మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి.

2001లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఘోరమైన  పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2003లో తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన మమతా తిరిగి కేంద్ర మంత్రిగా వాజపేయ్ మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టారు. 2004 జనవరిలో కేంద్ర ఉక్కు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కొద్దీ కాలం పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసి లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడారు. 8 నుంచి 2 స్థానాలకే పరిమితం అయ్యారు. అయినా, మనో నిబ్బరంతో రాజకీయాల్లో ముందుకు నడిచారు.

2006లో వరుసగా రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సిపిఎం కురువృద్ధుడు బుద్ధదేవ్ భట్టాచార్య పారిశ్రామిక అభివృద్ధి పేరుతో టాటా నానో కంపెనీ స్థాపించేందుకు సింగూర్, నందిగ్రామ్ ప్రాంతాల్లో స్థానిక ప్రజలను సంప్రదించకుండా భూములు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం అయ్యి ఒక ఉప్పెనలా ఉద్యమం మొదలైంది. రాజకీయంగా తనకు మైలేజీని ఇవ్వబోయే ఈ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. " మా, మాటి, మనుష్" (తల్లి, భూమి, ప్రజలు) అనే నినాదాన్ని ఎత్తుకున్న మమతా ఈ ఉద్యమం ద్వారా మరోసారి జాతీయ స్థాయిలో క్రియాశీలకం అయ్యారు. ఈ ఉద్యమం ద్వారానే బెంగాల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరయ్యి వారి మద్దతును కూడగట్టారు. 2007-11 వరకు జరిగిన ఈ ఉద్యమం వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనపరచింది.

2009 లోక్ సభ ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 19 స్థానాలను కైవసం చేసుకొని యూపీఏ 2 కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి రెండో దఫా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009-11 వరకు ఆ బాద్యతల్లోనే ఉన్న మమతా బెంగాల్ కోసం ప్రత్యేక రైళ్లను మంజూరు చేయడంతో పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు ప్రకటించి బెంగాల్ ప్రజలను తనవైపుకు తిప్పుకున్నారు. 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ళ వామపక్ష ప్రభుత్వాన్ని మట్టి కరిపించి మమతా సీఎం అయ్యారు. బెంగాల్ రాష్ట్ర తోలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు.

2011-16 బెంగాల్ సీఎంగా మమతా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే, 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఆమెకు కొన్ని వర్గాలు దూరమవుతూ వచ్చాయి. 2016, 2021 ఎన్నికల్లో మమతా వరుసగా తృణమూల్ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పటికి, ప్రజల్లో ఆమె రాజకీయాల పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వస్తుంది.

అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి తన ఒకప్పటి సహచరుడైన భాజపా నేత సువెందు అధికారి చేతిలో ఓటమి పాలవ్వడం. అభివృద్ధి విషయంలో ఆమెకు చిత్తశుద్ధి లేకపోవడం, మునుపెన్నడూ లేని విధంగా బెంగాల్ వ్యాప్తంగా ఉన్న పలు పరిశ్రమలు మూత పడటం, అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, పైరవీలు మరియు దౌర్జన్యాల విషయాల్లో వామపక్ష పార్టీలను తృణమూల్ పార్టీ దాటి పోవడాన్ని ఆమె రాజకీయ పతనానికి పూనాదులు రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మూడు సార్లు బెంగాల్ రాష్ట్రానికి సీఎం అయిన మమతా, ప్రస్తుతం తిరిగి జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. ప్రధాని మోడీ ధాటిని   ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ తట్టుకోలేక మూలంగా, భాజపా వ్యతిరేక కూటమికి నాయకత్వ లేమిని పూడ్చే బాధ్యతను చేపట్టాలని మమతా ఉవ్విళ్ళురుతున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న భాజపా వ్యతిరేక పక్ష పార్టీలతో కలిసి ఏర్పాటైన ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను చేపట్టేందుకు మమతా రాజకీయ మంతనాలు ఇప్పటికే మొదలు పెట్టారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయే స్థితికి చేరకముందే తన రాజకీయ మజిలీకి చివరి గమ్యమైన ప్రధాని పదవిని చేపట్టేందుకు అన్ని విధాలుగా అస్త్ర శాస్త్రాలను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2026 జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మమతా జాతీయ రాజకీయ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని తృణమూల్ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటే 2029 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున ఆమె ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ఢీ కొట్టబోతున్నారు.    

- డి.వి.అరవింద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com