కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!

- January 06, 2025 , by Maagulf
కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ టీం తో సమావేశమయ్యారు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ తన న్యాయవాదులతో హాజరు కావాలని పట్టుబట్టడంతో పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు విచారణకు పిలుస్తారన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో రేపు పిలిచే అవకాశం లేదు.

కాగా, ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టేట్‌ మెంట్ ను ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన ఆ లేఖలో ఏముందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందని.. అప్పటివరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు. తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి నోటీసులు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 08వ తేదీన బీఎల్‌ఎన్‌ రెడ్డి, 09వ తేదీన అరవింద్‌ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ సారైనా హాజరు అవుతారో లేదో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com