హర్యానా హరికేన్ - కపిల్ దేవ్

- January 06, 2025 , by Maagulf
హర్యానా హరికేన్ - కపిల్ దేవ్

భార‌తదేశంలో క్రికెట్‌ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ క‌పిల్‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ త‌రం అభిమానుల‌కు కూడా క‌పిల్ దేవ్ సుప‌రిచిత‌మే. భారత క్రికట్‌ ప్రస్థానంలో ఆయనో సంచలనం. కపిల్ కెప్టెన్సీ ఓ చరిత్ర. ఆయన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన అమోఘం. భార‌త్‌కు తొలి సారి వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన‌ కెప్టెన్‌గా భారత దేశపు క్రికెట్ క్రీడాభిమానులు మ‌న‌స్సుల్లో చెరగని ముద్ర వేశారాయ‌న‌. ఒక్కమాటలో చెప్పాలంటే.. '1983 ప్రపంచకప్‌ భారత్‌ గెలిచింది' అనేకన్నా 'కపిల్‌దేవ్‌ గెలిపించాడు' అనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రికెట్ మైదానంలో కపిల్ ఎన్నో అద్భుతాలు చేసి అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. అంతలా పేరుగాంచిన కపిల్‌ భారత్‌లో ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శప్రాయుడయ్యారు. ఆటతీరుతో యావత్‌ క్రీడాలోకాన్నే ఔరా అనిపించారు. ఏమాత్రం అంచనాల్లేని టీమ్ఇండియాను ఏకంగా విశ్వవిజేతగా తీర్చిదిద్దారు. క‌పిల్‌దేవ్ అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మ‌ళ్లీ భార‌త జ‌ట్టుకు ఆ స్థాయి పేస్ ఆల్‌రౌండ‌ర్ ల‌భించ‌లేదంటనే ఆయ‌న స‌త్తా ఎంటో అర్థం చేసుకోవ‌చ్చు. నేడు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పుట్టినరోజు. 

కపిల్ దేవ్ పూర్తి పేరు కపిల్ దేవ్ రామ్ లాల్ నిఖంజ్. 1959, జ‌న‌వ‌రి 6న కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ పట్టణంలో రామ్ లాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు దంప‌తుల‌కు జన్మించారు. కపిల్ తల్లిదండ్రులు దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చి చండీగఢ్ పట్టణంలో స్థిరపడ్డారు. తండ్రి కలప వ్యాపారిగా చండీగఢ్ పట్టణంలో సుపరిచితులు. కపిల్ విద్యాభ్యాసం మొత్తం చండీగఢ్ లోనే పూర్తి చేశారు. చండీగఢ్ లోని D. A. V కళాశాలలో బీకామ్ చదివారు. 

కపిల్ చిన్నతనం నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్నారు. 1975 హర్యానా తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన కపిల్ తన 
అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హర్యానా జట్టు విజయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. 1975-78 వరకు దేశవాళీ టోర్నీల్లో ఆడిన ఆయన తన ఆటతీరుతో భారత జట్టు సెలెక్టర్లను ఆకర్షించి  1978లో భార‌త జ‌ట్టులో అడుగుపెట్టారు. అక్టోబ‌ర్ 1న పాకిస్థాన్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అదే నెల‌లో 16న‌ పాకిస్థాన్‌తో కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. అక్క‌డి నుంచి భార‌త క్రికెట్ జ‌ట్టులో మంచి పేస్ ఆల్‌రౌండ‌ర్‌గా స్థిర‌ప‌డిపోయారు. 

క‌రాచీలో జ‌రిగిన ఆ సిరీస్‌లోని మూడో టెస్టులో 33 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో వేగంగా హాఫ్ సెంచ‌రీ సాధించిన భార‌త బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కేవలం 124 బంతుల్లోనే 126 పరుగులు త‌న‌ కెరీర్‌లో తొలి టెస్ట్ శతకాన్ని సాధించారు. 1978-83 వరకు కపిల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు మరపురాని విజయాలను సాధించి పెట్టారు కపిల్. నాటి క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండ‌ర్స్ జాబితాలో ఇండియా నుంచి  కపిల్ పేరు మాత్రమే ఎంపికయ్యేది అంటే అతిశయోక్తి కాదు! 

1983 ప్రపంచ కప్ టోర్నీకి కొద్దీ నెలల ముందే సునీల్ గవాస్కర్ స్థానంలో టీం ఇండియా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన కపిల్, ఆ ఏడాది జట్టును విశ్వవిజేతగా నిలబెట్టారు. ఆ  ప్రపంచకప్​కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 9న ప్రారంభమైన టోర్నీ 25న జరిగిన ఫైనల్​​తో ముగిసింది. ఆ కాలంలో వరల్డ్​కప్​ను "ప్రుడెన్షియల్ కప్" అనేవారు. ప్రముఖ ప్రుడెన్షియల్ ఇన్సురెన్స్ లిమిటెడ్ ఆ టోర్నీకీ ప్రచారకర్తగా ఉండటమే అందుకు కారణం. తర్వాత రోజుల్లో ప్రపంచకప్​గా రూపాంతరం చెందింది. 

గ్రూప్ దశలో హైలైట్​గా చెప్పుకోదగ్గది జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్. ఓ దశలో కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత్. 78 పరుగులకు 7 వికెట్లు నష్టపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా సయ్యద్ కిర్మాణితో కలిసి కపిల్ 9 వికెట్‌కు రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డును సాధించారు. ఆ మ్యాచ్‌లనే కిర్మాణి, కపిల్ కలిసి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్​ ఆడారు. ఆ మ్యాచ్‌లో కపిల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 175 పరుగులు చేశారు. దీంతో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ కొట్టేవరకు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరు మీదనే ఉన్నది.  

1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ దేవ్ వెనక్కి పరిగెత్తుతూ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ పట్టకపోయుంటే, బహుశా ఆ వరల్డ్ కప్ భారత్ పేరున ఉండేది కాదు. అప్పుడు 184 పరుగుల విజయ లక్ష్యంతో విండీస్ బ్యాటింగ్ చేస్తోంది. వివియన్ రిచర్డ్స్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి క్రీజులో కుదురుకుని ఉన్నాడు. మదన్ లాల్ బౌలింగ్‌లో రిచర్డ్స్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి షాట్ కొట్టాడు. షార్ట్ మిడ్ వికెట్‌లో ఉన్న కపిల్ దేవ్ వెనక్కు పరిగెత్తుతూ ఆ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. 2011 వరల్డ్ కప్ ముందు ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో వివియన్ రిచర్డ్స్ "కపిల్ వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టగానే, నా టైం ముగిసిందనే విషయం నాకు అర్థమైంది" అని చెప్పారు.  నాడు క‌పిల్‌దేవ్ నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యంతో దేశంలో క్రికెట్ ద‌శ మారిపోయింది. యువ‌త క్రికెట్ ప‌ట్ల అమిత‌మైన ఆస‌క్తి పెంచుకున్నారు. 

కపిల్ దేవ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేసేవారు. తన టెస్ట్ కెరీర్‌లో ఒకసారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కాలేదంటేనే కపిల్ ఫిట్‌నెస్ స్థాయి ఏ లెవల్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కపిల్‌లా సుదీర్ఘ కాలం ఆడే అవకాశం చాలా తక్కువ మంది ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే లభిస్తుంది. అంతేకాదు, తన బౌలింగ్ సత్తాతో చాలా కాలం పాటు కపిల్ టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ పగ్గాలు చేపట్టారు."ఒక క్రికెటర్ తన ఫిట్‌నెస్‌పై ఎలా దృష్టి పెట్టాలో చెప్పాలంటే కపిల్ దేవ్ దానికి ఒక పెద్ద ఉదాహరణ" అంటారు టీం ఇండియా మాజీ ఆటగాడు కిరణ్ మోరే. 16 ఏళ్ల సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో కపిల్ ఎప్పుడూ ఫిట్‌నెస్ వల్ల డ్రాప్ అవడం జరగలేదు. అవుట్ ఫీల్డ్‌లో ఆయన లాంటి అద్భుతమైన ఫీల్డర్‌ను నేను చూళ్లేదు అని క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికి చెబుతూనే ఉంటారు. 

టెస్టు కెప్టెన్‌గా బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. టెస్టు కెప్టెన్‌గా బౌలింగ్‌లో కపిల్ దేవ్ 9 వికెట్లు పడగొట్టారు. 1983లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ 9 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో అప్పటికే కెప్టెన్‌గా 8 వికెట్లు పడగొట్టి టాప్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ రికార్డును కపిల్ దేవ్ బద్దలుకొట్టారు. ఇమ్రాన్ ఖాన్ 1982లో ఈ రికార్డు పడగొట్టారు. కాగా 1985లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ 8 వికెట్లు పడగొట్టారు. 

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో బౌలర్‌గా 400కు పైగా వికెట్లు తీయడమే గాకుండా, 5000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆల్‌రౌండర్‌గా కపిల్ దేవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మొత్తంగా 131 టెస్టు మ్యాచ్‌లాడిన కపిల్ దేవ్ 434 వికెట్లు తీశారు. ఇందులో 23 సార్లు 5 వికెట్ల హాల్ ఉంది. బ్యాటింగ్‌లో 31 సగటుతో 5248 పరుగులు చేశారు. ఇందులో 8 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. 

ఒక టెస్ట్ సిరీస్‌లో 250కి పైగా పరుగులు చేసి, 30కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఆల్ రౌండర్‌గా కపిల్ దేవ్ ప్రపంచరికార్డు నెలకొల్పారు. 1979లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కపిల్ దేవ్ చెలరేగారు. 6 మ్యాచ్‌ల ఆ టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌లో 278 పరుగులు చేసిన కపిల్ దేవ్, బౌలింగ్‌లో 32 వికెట్లు తీశారు. 

కపిల్ 225 వన్డేలు ఆడి మొత్తం 3783 పరుగులు చేశారు. 250కి పైగా వికెట్లు పడగొట్టారు. ఆ సమయంలో దేవ్ స్ట్రయిక్ రేట్ 95.07, అంటే ప్రతి వంద బంతులకు కపిల్ 95.07 పరుగులు చేశారు. ఈ గణాంకాలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే కపిల్ తన ఆఖరి వన్డే మ్యాచ్ 1994 అక్టోబర్‌లో ఆడారు. ఆ సమయానికి క్రికెట్ ప్రపంచంలో బ్యాట్స్‌మెన్ల మెరుపుదాడి మొదలవలేదు. వన్డేల్లో కపిల్ సాధించిన ఈ స్ట్రయిక్ రేట్, సచిన్, ధోనీ, కోహ్లీ, వివియన్ రిచర్డ్స్, యువరాజ్ సింగ్ లాంటి బ్యాట్స్‌మెన్ల కంటే ఎక్కువ. 

ఇక  టెస్టుల్లో 131 టెస్టు మ్యాచ్‌లు ఆడి 31 స‌గ‌టుతో 5248 ప‌రుగులు చేశారు. అత్య‌ధిక స్కోర్ 163 ప‌రుగులు. అదే స‌మ‌యంలో 434 వికెట్లు ప‌డ‌గొట్టారు. మొత్తంగా త‌న కెరీర్‌లో 356 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 9,031 ప‌రుగులు చేయ‌డంతోపాటు 687 వికెట్లు తీశారు. రిటైర్ అయ్యాక‌ కొంత కాలం భార‌త జ‌ట్టుకు కోచ్‌గా కూడా ప‌ని చేశారు.  

క్రికెట్ రంగానికి కపిల్ దేవ్ చేసిన సేవలకు గానూ 1980లో అర్జున అవార్డు, 1982లో ప‌ద్మ‌శ్రీ అవార్డు, 1983లో విజ్డేన్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు, 1991లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు, 2002లో విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ, 2013లో కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని క‌పిల్‌దేవ్‌ అందుకున్నారు. ప్ర‌స్తుతం క్రికెట్ విశ్లేష‌కుడిగానే బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. 

- డి.వి.అరవింద్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com