విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టద్దు..! - కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల కు కార్మికుల విజ్ఞప్తి

- January 07, 2025 , by Maagulf
విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టద్దు..! - కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల కు కార్మికుల విజ్ఞప్తి

గతకొంతకాలంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కానున్నట్లు వస్తున్నవార్తల నేపథ్యంలో దాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. ఈ కర్మాగారంతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయించవద్దని.. సాధ్యమైనంత మేరకు వాటికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశం
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సన్నాహకంగా నిర్వహించే ప్రి-బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం 11 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్‌ ప్రతినిధి పవన్‌కుమార్‌ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పింఛను పథకాన్ని రద్దు చేసి పాత పింఛను పథకాన్నే (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఇళ్లలో పనిచేసేవారి డేటా సేకరించి వారికి సామాజిక భద్రత కల్పించే విషయం పరిశీలిస్తామని నిర్మల హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈపీఎఫ్‌ కనీస పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని, ఐటీ మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ‘గిగ్‌’ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com