విశ్వ సుందర నట సామ్రాజ్ఞి - బి.సరోజా దేవి

- January 07, 2025 , by Maagulf
విశ్వ సుందర నట సామ్రాజ్ఞి - బి.సరోజా దేవి

చారడేసి కళ్లతో .. కోరచూపులతో .. కొంటె నవ్వులతో .. ముద్దుముద్దు మాటలతో .. పడుచు హృదయాలపై పదనిసలు పలికించిన కథానాయిక బి.సరోజాదేవి. దారితప్పి వచ్చిన దేవకన్యలా .. గడపదాటి వచ్చిన గంధర్వ కన్యలా .. వనాలు విడిచి వచ్చిన వనకన్యలా తెలుగు తెరపై ఆమె చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకుంటారు. నేడు అందాల అభినేత్రి బి.సరోజా దేవి గారి జన్మదినం. 

 బి.సరోజా దేవి గారి పూర్తి పేరు బైరప్ప సరోజాదేవి 1938,జనవరి 7న బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి బైరప్పకు నటన పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. దాంతో ఆయన నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ ప్రభావం ఆమెపై కూడా పడింది. కూతురును లలితకళల్లో ప్రోత్సహించారు. చిన్నతనంలోనే తండ్రి కోరిక మేరకు నాట్యం అభ్యసించారు సరోజాదేవి. 13 ఏళ్ల వయసులో ఆమె ఒక నాటకంలో నటిస్తూ ఉండగా కన్నడ దర్శక నిర్మాత ‘హొన్నప్ప భాగవతార్’ చూసి తాను నటించి, రూపొందించిన ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంతో సరోజా దేవి పరిచయమయ్యారు. వరుసగా కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన తరువాత ఓ తమిళ సినిమాలోనూ సరోజా అందం మురిపించింది. 

తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ తన సొంత చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’ తో తెలుగు తెరకు సరోజా దేవిని పరిచయం చేశారు.ఈ సినిమాలో శృంగార పురుషులను ఆకట్టుకునే ‘కళావతి’ పాత్రలో ఆమె మెప్పించారు. నాటి మేటి హీరోలైన ఎన్టీఆర్, ఏయన్నార్, ఎమ్జీఆర్, శివాజీగణేశన్, రాజ్ కుమార్ అందరి సరసన దక్షిణాదిన సందడి చేసిన సరోజాదేవి ఉత్తరాది చిత్రాల్లోనూ మురిపించారు. మరో అందాల తార వైజయంతీమాల పోలికలు ఉండడంతో వారిద్దరినీ అక్కాచెల్లెళ్ళుగా భావించారు హిందీ సినిమా ప్రేక్షకులు.  తెలుగులో రామారావు, నాగేశ్వరరావు సరసన సరోజాదేవి నటించిన అనేక చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఏయన్నార్ తో “పెళ్ళి కానుక, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, రహస్యం, అమరశిల్పి జక్కన్న” వంటి చిత్రాలలో నాయికగా నటించారు. ముఖ్యంగా ‘పెళ్ళికానుక’ నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది.

అలనాటి కథానాయికలలో సావిత్రికి ఎదురుండేది కాదు. గ్లామర్ పరంగా జమున .. కృష్ణకుమారికి తిరుగుండేది కాదు. అలాంటి సమయంలోనే అందం .. అభినయం రెండూ కలగలిసిన నాయికగా బి.సరోజాదేవి ఎంట్రీ ఇచ్చారు. కనురెప్పలను టపటపలాడిస్తూ తెరపై ఆమె చేసిన చూపుల విన్యాసాలు చూసి, అప్పటి కుర్రాళ్లు ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆ కనురెప్పల మధ్య చిక్కుకుని నాజూకుగా నలిగిపోవాలని ఆశపడ్డారు. ఆనాటి స్టార్ హీరోయిన్స్ తెలుగు బాగానే మాట్లాడేవారు. అయితే బి. సరోజాదేవి కన్నడ నుంచి రావడం వలన తెలుగు అంతగా వచ్చేది కాదు. అయినా అలాగే మాట్లాడేసేవారు. అంతగా రాని తెలుగు ఒక యాసగా మారిపోయి అదో కొత్తదనమైపోయింది. అలా ముద్దుముద్దు మాటలతోనే ఆమె మరింతమంది అభిమానుల మనసులను మూటగట్టారు. 

50వ దశకం ద్వితీయార్ధంలోనే తన ఉనికిని చాటుకున్న సరోజాదేవి, 60వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఈ దశకంలో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం సూపర్ట్ హిట్లుగా నిలిచాయి. ఈ దశకంలో వచ్చిన ‘పెళ్లికానుక’ .. ‘జగదేకవీరుని కథ’ ..’ ఆత్మబలం’ .. ‘ శ్రీకృష్ణార్జున యుద్ధం’ .. ‘శకుంతల’ .. ‘అమరశిల్పి జక్కన్న’ వంటి సినిమాలు ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. తనని తాను తీర్చిదిద్దుకుంటూ గ్లామర్ పరంగా కూడా ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. థియేటర్ ను వదిలి ఇళ్లకు వెళ్లాలంటే బెంగపెట్టుకునేంతగా అభిమానులను ఆకట్టుకున్నారు. సరోజా దేవి తన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఇతర హీరోయిన్లకు భిన్నంగా కనిపించడానికి ఆమె ప్రయత్నించారు .. సఫలీకృతులయ్యారు.

‘జగదేకవీరుని కథ’ చూసినవారు, నిజంగానే ఆమె దేవకన్య ఏమో అనుకున్నారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’చూసినవారు ‘ సుభద్ర’ ఇలాగే ఉండేదేమోనని అనుకున్నారు. ‘శకుంతల’ చూసినవారు .. దుశ్యంతుడు ఉన్నపళంగా మనసు పారేసుకోవడంలో అర్థం ఉందనుకున్నారు. ‘అమరశిల్పి జక్కన్న’ చూసినవారు .. ఇంతటి సౌందర్య రాశిని అంత దగ్గరగా చూసినవాళ్లు కవులో .. శిల్పులో కావడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నారు. 

‘పెళ్లికానుక’ సినిమాలో ఆమె రెండు జడలు వేసుకుని సైకిల్ పై కాలేజ్ కి వెళుతుంటే, ఆ కాలేజ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలామంది కుర్రాళ్లు ఉత్సాహపడ్డారు .. ఉబలాటపడ్డారు. ఈ సినిమాలో ‘కన్నులలో పలకరించు వలపులు .. ‘ పాట చూస్తే, ఆమె కళ్లపైనే రాశారేమోనని అనిపించక మానదు. ఇక ‘ఆత్మబలం’ సినిమాలో ‘చిటపట చినుకులు .. ‘పాటలో తడుస్తూ కళ్లతో ఆమె వేసిన కోలాటాలు చూసి చాలామంది తమని తాము మరిచిపోయారు. ఇప్పటికీ ఆ పాట ఎక్కడైనా వినిపిస్తే మనసుకి ముసురుపట్టినట్టుగానే అనిపిస్తుంది. ఇలా తెరపై సరోజాదేవి సిగ్గుదొంతరలు పేరుస్తూ .. వయ్యారాలుపోతూ, ప్రేక్షకులను మురిపించారు .. మైమరపించారు.  

నందమూరి తారక రాముడి చిత్రాలతోనే సరోజాదేవి తెలుగునాట ఓ వెలుగు వెలిగింది అంటే అతిశయోక్తి కాదు. యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సీతారామకళ్యాణం’లో మండోదరి పాత్రలో నటించి మెప్పించారామె. ఆ తరువాత రామారావుతో “జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, దాగుడుమూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండీగౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూరకర్ణ” చిత్రాలలో నటించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’లోనూ, ఆయన చివరి సారిగా దర్శకత్వం వహించిన ‘సామ్రాట్ అశోక’లోనూ సరోజాదేవి నటించడం విశేషం.  

సరోజా దేవిలోని అందానికీ .. అభినయానికి పోటీ పెట్టేసి ఆ తమాషాని అల్లరి కళ్లతో వీక్షించే కథానాయికగా బి. సరోజాదేవిని గురించి చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో ఎక్కువ మార్కులు దేనికి ఇస్తారు? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే తెరపై ఆమె చేసే చూపుల మాయాజాలంలో చిక్కుకుని మార్కుల ఊసే మరిచిపోయే అవకాశాలు ఎక్కువ. సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాల్లో నాయికగా తనదైన ముద్రవేశారు. తెలుగు కథానాయికలలో ‘అతిలోక సుందరి’ ఎవరంటే దాదాపుగా అందరూ శ్రీదేవి పేరే చెబుతారు. ఆమెకంటే ముందున్న తారల్లో ‘అతిలోక సుందరి’ ఎవరంటే మాత్రం ఎవరైనా సరే బి.సరోజాదేవి పేరు చెప్పాల్సిందే.

ఎన్నో విభిన్నమైన, విలక్షణమైన పాత్రలలో నటించిన ఆమెను ఎన్నో బిరుదులు, మరెన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. 5 దశాబ్దాలుగా చిత్రసీమకు చేసిన సేవలకు గాను 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2009 సంవత్సరానికి గాను యన్టీఆర్ నేషనల్ అవార్డు తో ఆంధప్రదేశ్ ప్రభుత్వం సరోజాదేవిని గౌరవించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల మదిలో అందాలతారగానే నెలకొన్న సరోజాదేవి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా ఆ నట పారిజాతానికి " మా గల్ఫ్ " టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com