రాజకీయ దక్షుడు-చెన్నారెడ్డి
- January 13, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో అత్యంత సమర్ధవంతమైన పరిపాలనా దక్షుల్లో మర్రి చెన్నారెడ్డి ముందువరుసలో ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై చెన్నారెడ్డి వేసిన ముద్ర చెరగనిది. తెలంగాణ తొలి దశ ఉద్యమ సారథిగా, రాజకీయ దురంధరుడిగా, పరిపాలనాదక్షుడుగా, ప్రజానేతగా, రాజకీయ చాణిక్యుడిగా ఆయన నడిచిన బాట అనితర సాధ్యం.అత్యంత చిన్న వయసులోనే మంత్రి హోదా, రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి, కేంద్రమంత్రి.. సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గిరి ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో ఆయన అధిరోహించని పదవులు లేవు అంటే అతిశయోక్తి కాదు. నేడు రాజకీయ దక్షుడు మర్రి చెన్నారెడ్డి గారి జయంతి.
మర్రి చెన్నారెడ్డి 1919,జనవరి 13న నిజాం పాలనలోని హైదరాబాద్ సుభా(జిల్లా) లోని వికారాబాద్ తాలూకా పెద్దమంగళారం గ్రామంలో తమ అమ్మమ్మ గారింట మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు జన్మించారు. చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. హైస్కూలు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేయడం, గ్రంథాలయాలను స్థాపించడం, సేవాకార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తోటి విద్యార్థుల్లో ఉత్తేజం నింపేవారు.
వికారాబాద్‌లో ఇంటర్ చదివి, ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలని కలగన్న చెన్నారెడ్డి తన 22వ ఏట ఎంబీబీఎస్ పట్టా తీసుకోవడం ద్వారా ఆయన కల నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత వరంగల్ లోని గాంధీ ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్‌గా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరిన రెండు నెలల్లోనే ఆయనకు నాగార్జున సాగర్‌కు బదిలీ కావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో సొంతంగా రెండు హాస్పిటళ్లు ఏర్పాటు చేసి వైద్యం చేయడం మొదలుపెట్టారు. రెండేండ్ల తర్వాత ఆ రెండు హాస్పిటళ్లను మూసివేసి, తన జీవితాన్ని దేశ రాజకీయాలకు అంకితం చేశారు.
చెన్నారెడ్డి కాలేజీలో చదువుతున్న రోజుల్లో సాంఘిక సేవా దళాలను ఏర్పాటు చేసి.. వాటికి నాయకత్వం వహించడమో లేదా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ మహాసభల్లో ప్రతినిధిగా పాల్గొనడమో చేస్తూ ఉండేవారు.గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో చెన్నారెడ్డి పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రంగా చెప్పవచ్చు. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకునిగా, విద్యార్థి నాయకునిగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకునిగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను కూడా అనుభవించారు. తర్వాత రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెస్‌ను స్థాపించారు. అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థల్లో చురుకుగా పాల్గొనే వారు. ఒక వారపత్రికకు రెండేండ్ల పాటు సంపాదకత్వం వహించారు. అనేక పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన స్వాతంత్ర్యోద్యమంలో చెన్నారెడ్డి పాల్గొన్నారు.
1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1946లో జరిగిన రాష్ట్ర స్టేట్ కాంగ్రెస్ మహాసభకు చెన్నారెడ్డి ఆహ్వాన సంఘ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చివరికి స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ప్రజలు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం మీద సాగించిన ఈ పోరాటాన్ని అహింసాయుత పద్ధతిలో నడిపించాలన్నది చెన్నారెడ్డి అభిమతం. ఆ సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్లి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితరులను కలుసుకుని వచ్చారు. మహాత్మాగాంధీ ఆశీస్సులను కూడా పొందారు.
మర్రి చెన్నారెడ్డి అనేక సంవత్సరాల పాటు ఆంధ్రా ప్రావిన్స్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం ఉధృత రూపం దాల్చడంతో, నిజాం ప్రభుత్వం నాయకులందరినీ అరెస్టు చేసింది. ఇలా అరెస్టు అయిన నాయకుల్లో చెన్నారెడ్డి చాలా చిన్నవారు. చర్చల ఫలితంగా జైలు నుంచి విడుదలై, స్టేట్ కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాద్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడి నుంచి ఉద్యమం సాగించారు. ఆ సమయంలో చెన్నారెడ్డి విజయవాడ వెళ్లి.. “హైదరాబాద్” అనే వారపత్రికను నిర్వహిస్తూ హైదరాబాద్ ప్రజలు సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
భారత ప్రభుత్వం కలుగజేసుకుని నిజాంపై పోలీసు చర్యలకు దిగి, హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేసింది. దాంతో పార్లమెంటుకు హైదరాబాద్ రాష్ట్రంలోని కొందరిని ప్రజాప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆనాటి పార్లమెంటు సభ్యుల్లో చెన్నారెడ్డి కూడా ఒకరు. పార్లమెంటులో హైదరాబాద్‌లోని విషమ పరిస్థితులను గురించి చెన్నారెడ్డి చేసిన ప్రసంగాలు నెహ్రూ, రాజాజీ వంటి వారిని ఆకర్షించాయి. దీంతో చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ విప్ గా ఎన్నికయ్యారు.
1952 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. 27 ఏళ్ల పిన్నవయసులోనే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్‌గా పనిచేశారు. 1957 ఎన్నికల్లోలో అదే స్థానం నుంచి రెండవసారి గెలిచిన ఆయన, 1962లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1967 ఎన్నికల్లో తాండూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావును ఓడించి నాలుగో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామినేట్ చేశారు. అలా.. ఉక్కు, గనుల శాఖా సహాయ మంత్రిగా ఉండగానే, గత తాండూరు ఎన్నికల్లో చెన్నారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఓడిన రామచంద్రరావు హైకోర్టుకెళ్లటం, ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వటమే గాక ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించటంతో 1968లో చెన్నారెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి చట్ట సభలకు దూరమయ్యారు.
1974లో అనర్హతా కాలం ముగిశాక ఇందిర సూచన మేరకు గవర్నర్ పదవి చేపట్టారు. తర్వాత యూపీ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1978లో మేడ్చల్ నుంచి పోటీచేసి గెలుపొంది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. 1978- 79, 1989 -90లలో రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా సేవలందించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సాంఘిక, ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని చెన్నారెడ్డి సహించలేకపోయారు. 1956లోనే ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన చెన్నారెడ్డి, 1969 – 70 తెలంగాణ ఉద్యమ సారథిగా నిలిచారు. తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్)ని ఏర్పాటు చేసి 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 సీట్లలో పది గెలిచి సత్తాచాటారు. తెలంగాణ ప్రజల మనోభావా లను గమనించిన ఇందిర పిలుపు మేరకు టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
ఆయన సీఎంగా ఉండగానే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి వేగం పెరిగింది. ఆయన పాలనాకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గన్నవరం నుంచి శాసన సభకు ఎన్నికైన సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్యను రాష్ట్ర డ్రయినేజీ బోర్డు చైర్మన్ పదవి తీసుకునేలా మొదట మర్రి ఒప్పించగలిగారు. అధికారులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి.
వికారాబాద్ ప్రాంతానికి ఆయన ఎనలేని సేవలను అందించారు. జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ‘కోట్‌పల్లి’నిర్మాణం ఆయన చలువే. దీనివల్ల తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు కల్పతరువుగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ పట్టణానికి తాగునీటి సరఫరాకై అక్కడికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని శివారెడ్డిపేట వద్ద శివసాగర్ పేరుతో 1967లో చెరువును తవ్వించారు. నేటికీ ఈ చెరువే నేటికీ స్థానికుల దాహం తీరుస్తోంది.
పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడే.. గ్రామాల్లోని మట్టి రోడ్లను కంకర, బీటీ రోడ్లుగా మార్చే పథకం ప్రారంభించారు. వికారాబాద్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారేందుకు ఆయనే కారణం. 1965లోనే వికాస్ మండలిని స్థాపించి, దాని ఛైర్మన్‌గా ఉండి పలు కళాశాలల ఏర్పాటుకు కృషిచేశారు. అనంతగిరిలో 1968లో శ్రీ అనంత పద్మనాభ (ఎస్ఏపీ) పీయూసీ కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే ప్రారంభింపచేశారు.
పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ పదవిని చేపట్టాలని ఇందిర ఆదేశించడంతో చెన్నారెడ్డి చండీగఢ్ వెళ్లి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రజలకు, పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన సందర్భాల్లో పార్టీ నాయకత్వంతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడానికి వెనుకాడలేదు. అలాగే.. ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీతో రాజీపడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉన్నత పదవులు స్వీకరించడం కూడా చెన్నారెడ్డి రాజకీయ జీవితంలో భాగమే.
1989 డిసెంబర్లో సీఎం పదవిని రెండోసారి అధిష్టించిన మర్రి చెన్నారెడ్డి ఏడాదికే పార్టీలోని అసమ్మతి కారణంగా రాజీనామా చేశారు. తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. చెన్నారెడ్డి.. సీఎం పదవిలో కన్నా గవర్నర్ పదవిలోనే ఎక్కువ కాలం పనిచేశారు. గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం నిజమైన అధికారాలున్న నేతగా కనిపించడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే.
ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో రాజకీయ ధురంధరుడిగా పేరు తెచ్చుకున్న మర్రి చెన్నారెడ్డి.. 1996, డిసెంబరు 2 న తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే కన్నుమూశారు. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి పాలనా దక్షతకు సంబంధించిన ఆనవాళ్లు నేటికీ తెలుగునేల నాలుగు చెరగులా ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







