ప్రజా రాజకీయవేత్త-బ్రాహ్మణయ్య

- January 13, 2025 , by Maagulf
ప్రజా రాజకీయవేత్త-బ్రాహ్మణయ్య

అంబటి బ్రాహ్మణయ్య ...నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నాయకుడు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైనా వెళ్లే నాయకుడిగా ఆయనకి పేరుంది.ఎన్టీఆర్ మీద అభిమానంతో తెదేపాలో చేరిన ఆయన ఆ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా సారథ్య బాధ్యతల్లో సుదీర్ఘ కాలం కొనసాగారు. వార్డు మెంబర్ నుంచి ఢిల్లీ పార్లమెంట్ దాక సాగిన ఆయన ప్రస్థానం మొత్తం ప్రజా సేవతోనే ముడిపడి ఉంది. నేడు ప్రజా రాజకీయవేత్త అంబటి బ్రాహ్మణయ్య జయంతి. 

అంబటి బ్రాహ్మణయ్య 1940, జనవరి 13న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని రాజకీయ ఉద్దండులకు నిలయమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నాగాయలంక తాలూకా వక్కపట్లవారిపాలెం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన అంబటి రాయుడయ్య, వెంకట సుబ్మమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తూ రైతుగా స్థిరపడ్డారు. 

అంబటి బ్రాహ్మణయ్య గారు చిన్నతనం నుంచే సామాజిక అంశాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచిన తమ ప్రాంతానికి చెందిన వామపక్ష నేతలు చండ్ర రాజేశ్వరావు, రామలింగయ్య, సనకా బుచ్చి కోటయ్య స్పూర్తితో విద్యార్ధి దశలో వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. వారి మద్దతుతోనే 1964లో నంగేగడ్డ పంచాయితీ వార్డు మెంబరుగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1970-81 వరకు వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచ్‌గా, 1981-86 వరకు అవనిగడ్డ సమితి అధ్యక్షుడిగా బ్రహ్మణయ్య పనిచేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో ప్రజలకు కోసం తన సొంత నిధులతో నిత్యావసర వస్తువులను అందించారు.  

 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (తెదేపా)ని స్థాపించిన తర్వాత అవనిగడ్డ ప్రాంతం నుంచి మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ, అప్పటి మచిలీపట్నం జనతా మాజీ ఎమ్యెల్యే వడ్డి రంగారావు గార్లతో కలిసి ఎన్టీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. తెదేపా ఆవిర్భవం నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో తెదేపాను అన్ని వర్గాలకు దగ్గర చేసేందుకు ఆయన కృషి చేశారు. 

 1985,1989,1994 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి తెదేపా తరపున పోటీ చేసిన సింహాద్రి సత్యనారాయణ గారి విజయం కోసం పనిచేశారు. 1983లో కాంగ్రెస్ దిగ్గజం మండలి కృష్ణారావు చేతిలో సత్యనారాయణ ఓటమి పాలైనా, ఆయన్ని తర్వాత వరసగా మూడు పర్యాయాలు గెలవడంలో బ్రాహ్మణయ్య కీలకంగా వ్యవహరించారు. 1985-86 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లా పార్టీ  కన్వీనర్‌గా, 1986-88 వరకు జిల్లా పార్టీ కార్యదర్శిగా, 1988-90 వరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ ఆయన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.  

1990-94 వరకు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ప్రజా పోరాటాలు చేపట్టారు. 1994 ఎన్నికల్లో తెదేపా జిల్లాలోని 17 స్థానాలకు గానూ 16 గెలుచుకుంది. 1994లో అవనిగడ్డ నియోజకవర్గానికి సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆయన పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు కోరిక మేరకు మచిలీపట్నం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తిపై ఘన విజయం సాధించారు. 

ఎన్టీఆర్ అంటే బ్రాహ్మణయ్యకు ఎంతో అభిమానం. తన పనితీరును గుర్తించి రాజకీయంగా ప్రోతషించిన ఆ మహానాయకుడి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ స్ధాపించిన అన్న తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ వీరాభిమానులైన అప్పటి ఎమ్యెల్యేలు పరిటాల రవి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పి.ఇంద్రా రెడ్డి, దాస్యం ప్రణయ్ భాస్కర్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, దేవినేని నెహ్రూలతో కలిసి చేరాల్సి వచ్చింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి తెనాలి లోక్‌సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రబాబు నాయకత్వంలోని తెదేపా అభ్యర్థి, నటి శారద చేతిలో ఓటమి పాలయ్యారు. 

1996లో చంద్రబాబు ఆహ్వానం మేరకు పరిటాల రవి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గార్లతో కలిసి తిరిగి తెదేపాలో చేరారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయంలో సైతం ఆయన కీలక పాత్ర పోషించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ దిగ్గజ నేత, అప్పటి సిట్టింగ్ ఎంపీ కావూరి సాంబశివరావు మీద సంచలన విజయం సాధించారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనా, 2005-09 వరకు మళ్ళీ జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి 2009 ఎన్నికల్లో పార్టీకి మునుపటి ఊపును తీసుకొచ్చారు. 2009లో అవనిగడ్డ నుంచి పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎమ్యెల్యే, మినిష్టర్ మండలి బుద్ధప్రసాద్ మీద విజయం సాధించారు. 

బ్రాహ్మణయ్య గారి ఐదు దశబ్దాల పాటు రాజకీయాల్లో నిస్వార్థనేతగా ప్రజాసేవలో తరించించారు. సమస్యల చెప్పుకోవడానికి తన దగ్గరికి వచ్చే ప్రజలను ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి పనులు చేసిపెట్టేవారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాల ప్రజల రవాణా కష్టాలను తీర్చడానికి తన ఎంపీ లాడ్స్ నిధులతో కల్వర్టులు, వంతెనలను నిర్మించారు. ఉల్లిపాలెం- భవానీపురం వంతెన నిర్మాణం కోసం కృషి చేశారు. ప్రతిపక్ష సమయంలో సైతం ప్రజల కోసం ఆయన  పనిచేస్తూ పోయారు. స్థానిక సంస్థల ద్వారా ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశారు. తొమ్మిదేళ్లు తెదేపా జిల్లా అధ్యక్షుడిగా ఎందరో యువనేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని నాయకులుగా తయారు చేశారు. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు చేసిన అంబటి బ్రాహ్మణయ్య 2013, ఏప్రిల్ 21న గుండెపోటుతో తన 75వ ఏట కన్నుమూశారు. ఆయన స్మారకార్థం ఉల్లిపాలెం- భవానీపురం వంతెనకు అంబటి బ్రహ్మణయ్య ఉల్లిపాలెం- భవానీపురం వంతెనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేసింది. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com