సీఎం రేవంత్ దావోస్ పర్యటన.. పెట్టుబడుల సమీకరణ పై సమీక్ష
- January 13, 2025
హైదరాబాద్: పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఇప్పటికే దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల్లో పేరుగాంచిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లోని సానుకూలాంశాలను ప్రపంచ వేదికపై ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాది అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాయన్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
జనవరి 20వ తేదీ నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో.. రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిని రేవంత్ రెడ్డి సమీక్షించారు. గతేడాది ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయి… అవి ఏయే దశలో ఉన్నాయని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారిగా పెట్టుబడులు
ఈ సందర్భంగా గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి 14 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని…. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని.. వీటి ద్వారా రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని… అధికారులు సీఎంకు వివరించారు.
18 ప్రాజెక్టుల్లో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని… పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని తెలిపారు. కంపెనీల వారిగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం చర్చించారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారిగా పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
దావోస్ పర్యటనకు ప్రణాళికలు..
ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు ముఖ్యమంత్రి దావోస్ లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటన లో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్‌కు విశిష్ట గుర్తింపు
- గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!









