ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025

- January 22, 2025 , by Maagulf
ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరవ ఎడిషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025 క్రీడా పోటీలు ఈరోజు ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లలతో కూడుకున్నదని తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా రేయింబవళ్లు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు వ్యక్తుల మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసులు స్వతః సిద్ధంగా చక్కటి ఫిట్ నెస్ తో క్రీడా సామర్థ్యం కలిగి ఉంటారని, 1956 జాతీయ ఫుట్ బాల్ జట్టులో ముగ్గురు హైదరాబాద్ పోలీసు అధికారులు ఉండడం మనకు గర్వకారణం అని గుర్తు చేసారు. విధి నిర్వహణలో బిజిగా ఉన్నప్పటికీ వారానికి కనీసం మూడు గంటల పాటు క్రీడలకు సమయం కేటాయించాలని సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల నిర్వహణలో మరియు నేర నియంత్రణలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉందని మరింత అంకిత భావంతో పనిచేస్తూ ఆ మంచిపేరును కొనసాగించాలని సూచించారు. 

ఈ ముగింపు వేడుకలలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ మూడు రోజులపాటు సాగిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న అన్ని జట్లను మరియు విజేతలను అభినందించారు.తమ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసులకు మానసికోల్లాసాన్ని అందించే లక్ష్యంతో ఈ రాచకొండ పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.రాచకొండ అన్ని జోన్లు మరియు వివిధ పోలీసు విభాగాల నుంచి 25 క్రీడా విభాగాల్లో మొత్తం ఎనిమిది జట్లు, 1000 మంది పోలీసు క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, రన్నింగ్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పలు రకాల ఇండోర్ మరియు ఔట్ డోర్ క్రీడా పోటీలలో పాల్గొన్నారని తెలిపారు.  పోలీసు సిబ్బందితో పాటు రాచకొండ కమిషనరేట్ మినిస్టీరియల్ సిబ్బంది ఈసారి కూడా ఉత్సాహంగా ఈ క్రీడాపోటీలలో అభినందనీయం అని పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో సిబ్బందికి నాయకత్వం వహించడంతోపాటు వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొన్నారు. క్రీడా పోటీలలో పొందిన ఆనందంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా పని చేయాలని కమిషనర్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి మల్కాజ్గిరి పద్మజ, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమణారెడ్డి, డిసిపి ఎస్ఓటి 2 మురళీధర్, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, పలువురు అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com