హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్

- January 24, 2025 , by Maagulf
హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. సింగపూర్ పర్యటనతో మొదలైన ఈ ప్రయాణం, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో దావోస్‌లో ముగిసింది.

సింగపూర్ పర్యటనలో పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం దావోస్‌లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని, ప్రపంచ స్థాయి సంస్థల సీఈవోలు, చైర్మన్లతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో ఈ సమావేశాలు కీలకంగా నిలిచాయి.

ఈ పర్యటన ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా, ఈసారి నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించడం రాష్ట్రానికి గొప్ప విజయంగా నిలిచింది. వీటి ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ముఖ్యంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రానికి కొత్త శక్తిని తెస్తాయని అంచనా వేయబడుతోంది.సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఈ పర్యటన తెలంగాణ అభివృద్ధికి మరింత గణనీయమైన తోడ్పాటు అందించింది. భవిష్యత్‌లో ఈ పెట్టుబడుల ప్రభావం రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి రంగాలపై స్పష్టంగా కనిపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com