దేశ అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కృషి వెలకట్టలేనిది: సీపీ సుధీర్ బాబు

- January 26, 2025 , by Maagulf
దేశ అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కృషి వెలకట్టలేనిది: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: ఈరోజు రాచకొండ కమీషనరేట్ పరిధిలోని అంబర్ పేట సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ సుధీర్ బాబు  జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ.. దేశరక్షణలో సైన్యం ఎంత గొప్ప పాత్ర పోషిస్తోందో దేశ అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా అంతే గొప్పగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ట్రాఫిక్, క్రైం వంటి ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని పేర్కొన్నారు. ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో ఘర్షణల నివారణలో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. 

తమ విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలని, తప్పులను పునరావృతం చేయకూడదని పేర్కొన్నారు. నూతనంగా జాయిన్ అయిన అధికారులు, కానిస్టేబుళ్లు సీనియర్ అధికారుల అనుభవం నుండి మెళకువలు నేర్చుకోవాలని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పని చేయాలని సూచించారు. సమిష్టి కృషితోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యం అవుతుందని, పోలీసులు అందరూ కలసికట్టుగా ఒక కుటుంబంలా పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాచకొండ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించి, ప్రజలకు సేవ చేసేందుకు సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. ఏఆర్ విభాగపు సిబ్బంది సంక్షేమం కోసం మెడికల్ క్యాంపుల నిర్వహణ, ఉచిత రోగ నిర్దారణ పరీక్షల వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అని తెలిపారు. భవిష్యత్తులో కూడా వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసు అమరవీరుల అమర త్యాగాలను స్మరించుకోవాలని సిబ్బందికి సీపీ సూచించారు.  

ఈ కార్యక్రమంలో డిసిపి క్రైమ్స్ అరవింద్ బాబు, ఎస్ ఓ టి డి సి పి మురళీధర్, డిసిపి శ్యాంసుందర్, అదనపు డీసీపీ ఏఆర్, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com