నిరాడంబరతకు మారుపేరు అనగాని...!

- January 27, 2025 , by Maagulf
నిరాడంబరతకు మారుపేరు అనగాని...!

అనగాని భగవంతరావు... తెలుగునాట సచ్చిల రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నేతల్లో ఆయన ఒకరు. ప్రజాసేవే పరమావధిగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. చేపట్టిన ప్రతి పదవికి న్యాయం చేసిన అతి కొద్దీ మంది నాయకుల్లో ఆయన ఒకరు. నేడు మాజీ మంత్రి వర్యులు అనగాని భగవంతరావు వర్థంతి. 

అనగాని భగవంతరావు 1923, మే27న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా అనగానివారి పాలెం గ్రామంలో మధ్యతరగతి  రైతు కుటుంబానికి చెందిన అనగాని కోటయ్య, వెంకాయమ్మ గార్లకు జ్యేష్ట పుత్రునిగా జన్మించారు. వీరి ప్రాధమిక విద్య నుంచి ఎస్.ఎల్.సి వరకు రేపల్లెలోని జిల్లా పరిషత్ హైస్కూలులోను, కళాశాల విద్య గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీలో పూర్తిచేసి నాగపూర్ యూనివర్సిటీ నుండి యం.ఏ డిగ్రీ, 1949లో యల్.యల్. బి డిగ్రీ పూర్తి చేశారు.

గుంటూరు నగరంలోని అప్పటి ప్రముఖ న్యాయవాది శ్రీ యం.హనుమంతురావు వద్ద అప్రంటీసుగా శిక్షణ పొంది 1951లో రేపల్లెలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్రజలతో సంబంధం ఏర్పడి ఒక ప్రక్క న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ మరో ప్రక్కు ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గంటూరు జిల్లా గీత పారిశ్రామిక సత్యాగ్రహ కార్యాచరణ సంఘం అధ్యక్షునిగా ఎన్నికై 1954లో జరిగిన కల్లుగీత సత్యాగ్రహంలో బడుగు బలహీన వర్గాల పెన్నిధి సర్దార్ గౌతు లచ్చన్నతో కలిసి పాల్గొన్నారు.

రైతు బాంధవుడు ఆచార్య రంగా మీదున్న అభిమానంతో 1955లో జరిగిన ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో ఉన్న  కూచినపూడి నియోజకవర్గం నుండి కృషీకార్ లోక్ పార్టీ తరపున ఐక్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నాయకుడు మాకినేని బసవపున్నయ్య గారిపై ఘనవిజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 

1956 నుండి 1957 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంఘ అధ్యక్షులుగా వున్నారు. 1957 డిసెంబర్ నుండి 1960 జూన్ వరకు నాటి సీఎం  నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమలు మరియు దేవాదాయ శాఖామాత్యులుగా నియమితులైనారు. 1960లో నీలం అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులుగా వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా పాటు భగవంతరావు గారు కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత 1964 నుండి 1966 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు విలేజ్ ఇండ్రస్ట్రీస్ బోర్డుకు అధ్యక్షులుగా ఉన్నారు.

1967లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి కూచినపూడి నియోజకవర్గం నుండి మరలా ఎన్నికైనారు. 1969 జూలైలో అప్పటి  సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో చేనేత, సహకార చక్కెర ఫ్యాక్టరీలు, కోర్టులు, జైళ్ళ న్యాయశాఖా మాత్యులుగా నియమితులైనారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా బ్రహ్మానందరెడ్డితో పాటు వీరు కూడా రాజీనామా చేశారు. కాసు తరువాత ఏర్పడిన పి.వి. నరసింహారావు గారి మంత్రివర్గంలో భగవంతరావుగారు 1971 నుండి 1972 వరకు ఆర్థిక శాఖామాత్యులుగా పనిచేసినారు. 

1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మూడవసారి కూచినపూడి నియోజకవర్గం నుండి తిరిగి పోటీచేసి విజయం సాదించి మరలా పి.వి. నరసింహరావు గారి మంత్రివర్గంలో ఆర్ధిక శాఖామాత్యులుగా నియమితులై 1973 జనవరిలో జరిగిన ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ఏర్పడిన రాష్ట్రపతి పాలన ప్రకటించే వరకు కొనసాగారు. 1978 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి పక్షాన ఉంటూ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కూచినపూడి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన నాటి నుండి రాజకీయాలలో అంతచురుకుగా పాల్గొనలేదు. తదుపరి చాలా కాలం అస్వస్థులు కావడంతో క్రియాశీలక రాజకీయాల నుంచి విరమణ పొందారు.  

భగవంతరావు స్నేహశీలి, తన రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆప్యాయంగా పలకరించేవారు. కూచినపూడి నియోజకవర్గ రాజకీయాల్లో అయన ప్రత్యర్థిగా ఉన్న రైతు నాయకుడు మాజీ ఎమ్యెల్యే ఈవూరి సుబ్బారావు గారితో సైతం రాజకీయాలకు అతీతంగా సన్నిహితంగా మెలిగారు. రేపల్లె ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. 1970ల్లోనే రేపల్లెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించడమే కాకుండా, కాలేజీ కోసం కావాల్సిన భవన సముదాయం కోసం తన నివాసాన్ని విరాళంగా ఇచ్చారు. ఆయన దాతృత్వానికి మెచ్చిన నాటి ప్రభుత్వం ఆ కళాశాలకు "అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల"గా నామకరణం చేస్తూ జీవో జారీ చేసింది.     

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలం పాటు క్రియాశీలకంగా ఉన్న అనగాని భగవంతరావు అవినీతి, బంధుప్రీతికి దూరంగా ఉంటూ నీతి నిజాయితీలే తన ఆరో ప్రాణంగా బ్రతికారు. తన వారసులను సైతం రాజకీయ రంగానికి దూరంగా పెంచారు. అయితే, భగవంతరావు గారి స్పూర్తితో ఆయన సోదరుడు రంగారావు గారి కుమారుడైన అనగాని సత్యప్రసాద్ రాజకీయ రంగ ప్రవేశం చేసి రెపలే నుంచి హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా గెలవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో  రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.           

రాజకీయాలలో ఉన్నత విలువలకు, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన అనగాని భగవంతరావు అనారోగ్యం కారణంగా 1986, జనవరి 27న హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజాప్రతినిధిగా చేసిన సేవల ద్వారా రేపల్లె, కూచినపూడి ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 

- డి.వి.అరవింద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com