గ్లామరస్ యాక్ట్రెస్ - శ్రుతి హాసన్
- January 28, 2025
అపజయాలకు వెరవకుండా, విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ ‘క్రాక్’తో కేక పుట్టించింది. తరువాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాల తరువాత శ్రుతి కెరీర్ లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో వీరనారసింహారెడ్డి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ పార్ట్ 1 చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తన లక్కీ చామ్ తగ్గిపోలేదని నిరూపిస్తూ ఉంది. నేడు గ్లామరస్ యాక్ట్రెస్ శ్రుతి హాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓసారి తెలుసుకుందాం..!
శ్రుతి హాసన్ పూర్తి పేరు శ్రుతి రాజ్యలక్ష్మి హాసన్. 1986 జనవరి 28న చైన్నైలో జన్మించింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక. తల్లిదండ్రులు ఇద్దరూ మేటి నటులు. కమల్ లోక నాయకుడిగా జేజేలు అందుకుంటూ ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తున్నారు. ఇక సారిక ఒకప్పుడు అందాల తారగా జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. వారి వారసురాలుగా శ్రుతి హాసన్ బాలనటిగానే హే రామ్లో భళా అనిపించింది. తండ్రి కమల్ హాసన్ లాగే తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా కూడా అలరించింది. తన తండ్రి ‘ఈనాడు’ సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శ్రుతి ఆ తరువాత “ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు, హాయ్ నాన్న” చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేసింది.
అనగనగా ఓ ధీరుడుతో తెలుగు వారి ముందు నాయికగా నిలచిన శ్రుతికి ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అప్పట్లో అందరూ ఆమెను ఐరన్ లెగ్ అనీ అన్నారు. సరిగా అప్పుడు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్లో నాయికగా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. శ్రుతి హాసన్ కెరీర్ లో తొలి బిగ్ హిట్ ‘గబ్బర్ సింగ్’. అప్పటి దాకా శ్రుతికి ఉన్న ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర చెరిగిపోయి ‘గోల్డెన్ లెగ్’గానూ మారింది. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో శ్రుతి హాసన్ హంగామా చేసింది. కొన్ని విజయాలు, మళ్ళీ పరాజయాలు. ఆమె కెరీర్ గ్రాఫ్‌లో పలు అప్స్ అండ్ డౌన్స్.
2022లో శ్రుతి నటించిన క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు లభించాయి. ఈ రెండు చిత్రాల తర్వాత 2023 సంక్రాంతికి నందమూరి నట సింహం బాలకృష్ణతో నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌తో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే ఏడాది వచ్చిన నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో ప్రత్యేక అతిధి పాత్రలో నటించడమే కాకుండా నానితో కలిసి ఒక పాటలో ఆడి పాడింది. ఇక ఆ సంవత్సరం చివర్లో ప్రభాస్ - నీల్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్ 1 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ చెన్నై సుందరి. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ చిత్రం, తమిళ మక్కల్
సెల్వన్ విజయసేతుపతి ట్రైన్ చిత్రం, తెలుగులో ప్రభాస్ సరసన సలార్ పార్ట్-2లో నటిస్తుంది. ఈ మూడు చిత్రాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
తన బహుముఖ ప్రజ్ఞతో సినీ ప్రయాణాన్ని అద్భుతంగా సాగిస్తున్న శ్రుతి రియల్ లైఫ్ లోనూ పలు మలుపులు ఉన్నాయి. సింగిలా లేక ఎవరైనా లివింగ్ పార్ట్‌నర్ ఉన్నాడా అన్న ప్రశ్నకు “మీరు ఏమనుకుంటే అదే” అంటూ చమత్కారంగా సమాధానమిచ్చింది శ్రుతి. తన వ్యక్తిగత జీవితం గురించి శ్రుతి మాట్లాడుతూ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయని తెలిపింది. ఏది ఏమైనా తన రూటే సెపరేటు అంటూ సాగుతున్న శ్రుతి హాసన్ తన కెరీర్లో మరిన్ని సక్సెస్‌లు సొంతం చేసుకోవాలని మా గల్ఫ్ కోరుకుంటుంది.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







