హాస్య నట బ్రహ్మ ... !

- February 01, 2025 , by Maagulf
హాస్య నట బ్రహ్మ ... !

బ్రహ్మానందం... తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో నవ్వులే నవ్వులు. ఆఖరికి ఏదైనా వేదికపై కనిపించినా కేరింతలు వినిపిస్తాయి. ఒక స్టార్‌ హీరోకి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్‌ అతని సొంతం. అతనే నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం. తెలుగువారు మంచి హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. కామెడీని ఏ రూపంలో ఉన్నా, అది ఎవరు చేసినా ఆస్వాదిస్తారు. అందులోనూ బ్రహ్మానందం పండిరచే కామెడీ పూర్తిగా విభిన్నం. తన డైలాగులతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్‌తో కూడా నవ్వు తెప్పించగల నటుడు. అంతేకాదు, ఎలాంటి డైలాగు చెప్పకుండా తన ఎక్స్‌ప్రెషన్‌తోనే ప్రేక్షకుల్ని నవ్వించగల సమర్థుడు బ్రహ్మానందం. నేడు టాలీవుడ్ హాస్య నట బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం మీకోసం...

బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956,ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా చాగంటి వారి పాలెం గ్రామంలో నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్‌ వరకు చదివారు. ఆ తర్వాత చదివించే ఆర్థిక స్తోమత నాగలింగాచారికి లేకపోవడం వల్ల సన్నిహితులైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కాలేజీలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశారు.

ఖాళీ సమయాల్లో బ్రహ్మీ  సినిమా తారలను ఇమిటేట్‌ చేస్తూ స్నేహితులను నవ్విస్తూ ఉండేవారు. అంతేకాదు, విద్యార్థులకు వినోదాన్ని అందిస్తూనే పాఠాలు చెప్పేవారు. ఇది చూసిన ఆయన మిత్రులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఓసారి హైదరాబాద్‌ వచ్చినపుడు ప్రముఖ రచయిత ఆదివిష్ణు గారు పరిచయమయ్యారు. బ్రహ్మానందంలోని టాలెంట్‌ని గుర్తించిన ఆయన ఆరోజుల్లో  దూరదర్శన్‌లోని ‘పకపకలు’ అనే కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇప్పించారు. ఆరోజుల్లో దూరదర్శన్‌ తప్ప మరో టీవీ ఛానల్‌ లేని కారణంగా బ్రహ్మానందం చెప్పే జోకులు రాష్ట్రం నలుమూలల పాకాయి.

1985లో నరేష్‌ హీరోగా వేజెళ్ళ సత్యనారాయణ రూపొందిస్తున్న శ్రీతాతావతారం చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. విశేషం ఏమిటంటే.. బ్రహ్మానందం పుట్టినరోజైన ఫిబ్రవరి 1న తొలిసారి మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. ఈలోగా బ్రహ్మానందం గురించి జంధ్యాలకు తెలియడంతో తను చేస్తున్న సత్యాగ్రహం చిత్రంలో గుండు హనుమంతరావు కాంబినేషన్‌లో ఒక క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ తర్వాత చంటబ్బాయ్‌ షూటింగ్‌ సమయంలో బ్రహ్మానందంను చిరంజీవికి పరిచయం చేశారు జంధ్యాల. అప్పుడు తను నటిస్తున్న పసివాడి ప్రాణం చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ ఇప్పించారు చిరంజీవి. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని కూడా ఎవరికీ తెలీదు. అలా మూడు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేశారు.  

1987 జూలై 23న పసివాడి ప్రాణం విడుదలైంది. అదే సమయంలో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు అహ నా పెళ్లంట చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చే అరగుండు పాత్రను సుత్తి వేలుతో చేయించాలి అనుకున్నారు. అయితే ఆ టైమ్‌కి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయినా అతని డేట్స్‌ బాగా ట్రై చేశారు. కానీ, వీలుపడలేదు.

ఆ సమయంలో రామానాయుడికి సత్యాగ్రహం చిత్రంలో నటించిన బ్రహ్మానందం గుర్తొచ్చి ఆ క్యారెక్టర్‌ అతనితో చేయించమని దర్శకుడు  జంధ్యాలకు చెప్పారు. అప్పుడు బ్రహ్మానందంకి ఫోన్‌ చేసి పిలిపించారు. అలా సుత్తివేలు చెయ్యాల్సిన పాత్ర బ్రహ్మానందంకి దక్కింది. అహ నా పెళ్ళంట విడుదలై ఘనవిజయం సాధించింది. 16 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 5 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా బ్రహ్మానందంకి పెద్ద బ్రేక్‌ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి.

1992లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమాతో బ్రహ్మానందం కెరీర్‌ తారా స్థాయికి చేరింది. సంవత్సరానికి 30కి పైగా సినిమాలు చేస్తూ బిజీ కమెడియన్‌ అయిపోయారు. హీరో ఎవరైనా బ్రహ్మానందం మాత్రం సినిమాలో కామన్‌ అనే స్థాయికి ఆయన కెరీర్‌ ఎదిగింది. ఒక దశలో బ్రహ్మానందం లేకుండా ఏ స్టార్‌ హీరో సినిమాగానీ, ఒక రేంజ్‌ హీరో సినిమా గానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం ఉండడం వల్లే బిజినెస్‌ జరిగాయి.

బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉందా అని ఒకప్పుడు అనుకునేవారు, అంతలా అన్నీ సినిమాల్లోనూ ఉండేవారు అతను. అతని కోసం అగ్ర నటులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. రచయితలు బ్రహ్మానందం కోసం వైవిధ్యమయిన పాత్రలు సృష్టించేవారు. 'మన్మధుడు' లో లవంగం, 'రెడీ' లో మేక్ డోనాల్డ్ మూర్తి, 'బాద్ షా' లో పిల్లి పద్మనాభ శర్మ, 'అదుర్స్' లో భట్టి, 'కృష్ణ' లో బాబీ ఒకటేమిటి చాలా పాత్రల్లో గచ్చిబౌలి దివాకర్, బద్దం భాస్కర్, కిల్ బిల్ పండేయ్, సిప్పీ, హల్వా రాజ్, జిలేబి, దువ్వ అబ్బులు ఇలా అంటిలో అయన నవ్వులు పండించినవే.

స్టార్ హీరో సినిమా అంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మి డేట్స్‌ని బట్టి మన స్టార్ హీరోలు షూటింగ్ అడ్జస్ట్ చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. రోజుకి 18 గంటలు పని చేస్తూ.. ఇప్పటివరకు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఈ జెనరేషన్ వాళ్లకు కూడా బ్రహ్మానందం హాట్ ఫేవరెట్. సోషల్ మీడియాలో ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. బ్రహ్మానందం మీమ్ వేయకపోతే మీమర్స్ కి ఆరోజు గడవదు.

బ్రహ్మానందం పోషించిన పాత్రల్లోని మేనరిజమ్స్‌, ఊతపదాలు, డైలాగులు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లిపోయాయి. దైనందిన జీవితంలో వాటిని తరచుగా వాడడం జనానికి అలవాటైపోయింది. అలాంటి వాటిలో చిత్రం భళారే విచిత్రంలోని ‘నీ ఎంకమ్మా’,  మనీ చిత్రంలోని ‘ఖాన్‌తో గేమ్స్‌ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్‌’, ధర్మచక్రం చిత్రంలోని ‘ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా’, అనగనగా ఒకరోజు చిత్రంలోని ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు’, నువ్వు నాకు నచ్చావ్‌ చిత్రంలోని ‘రకరకాలుగా ఉంది మాస్టారూ’, ఎన్నో చిత్రాల్లో వాడిన పదం ‘జఫ్ఫా’, పోకిరి చిత్రంలోని ‘పండగ చేస్కో’, ఢీ చిత్రంలోని ‘నన్ను ఇన్‌వాల్వ్‌ చెయ్యకండి రావుగారూ’, దూకుడులోని ‘నా పెర్‌ఫార్మెన్స్‌ మీకు నచ్చినట్టయితే ఎస్‌ఎంఎస్‌ చేయండి’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం చెప్పిన డైలాగులకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

తెలుగు సినిమా చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందారు. కేవలం ఒక్క ముఖ కవళికలుతో మాత్రమే నవ్వులు పండించగలడు అని అతనికి అప్పట్లో చాలా పేరు ఉండేది. ఆ మహానటుడి తరువాత అంతటి గొప్ప పేరు సంపాదించారు బ్రహ్మానందం. కేవలం ముఖకవలికలతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తగల నటుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records) లో చోటు సంపాదించారు అంటే అతను ఎంత కష్టపడ్డారు అన్నది తెలుస్తుంది.

40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1250 సినిమాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. ఇన్నేళ్ల సినీ కెరియర్ లో బ్రహ్మానందాన్ని ఆరు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్, మూడు సైమా అవార్డులు వరించాయి. అహ నా పెళ్లంట సినిమాలో అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డును అందుకున్నారు. ఐదు కళాసాగర్ పురస్కారాలు, తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు, పది సినీగోయర్స్ పురస్కారాలు, ఎనిమిది భరతముని పురస్కారాలు, రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం, ఆటా (అమెరికా), సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. అలాగే విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. పద్మమోహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌, జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి, స్వర్ణ కమలాలతో "కనకాభిషేకం" చేశారు.


బ్రహ్మానందం మంచి కమెడియన్ మాత్రమే కాదు.. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఆయన మిమిక్రీను చాలా ఎంజాయ్ చేస్తానని ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సైతం చెప్పారు. కమెడియన్‌గా ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2010లో దేశంలోనే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం. ఇప్పుడు సినిమాలను తగ్గించి తనలోని కళానైపుణ్యానికి పదునుపెట్టారు. అలానే 'మై ఎక్స్ పీరియన్స్ విత్ గాడ్' అనే పుస్తకాన్ని రాశారు.

ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తను రాష్ట్రపతి భవన్ కి వెళ్లి పద్మశ్రీ అవార్డు అందుకోగలిగానంటే దానికి తన కష్టం ఒక్కటే కారణం కాదని.. ఇలాంటి స్థితి కల్పించింది దేవుడే అని అంటారు బ్రహ్మానందం. అందుకే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పేపర్ పై రాయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల చెప్పారు బ్రహ్మి. ఆ పుస్తకం చదివి బ్రహ్మానందం అనేవాడు ఒకడుండేవాడు.. వాడు దేవుడిని నమ్ముకున్నాడు.. మనం కూడా నమ్ముకుందామని ఒక్కరైనా అనుకోవాలని.. అందుకే పుస్తకం రాసినట్లు చెప్పుకొచ్చారు.

తనని వెండి తెరకి పరిచయం చేసిన దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణను, తనకు సినీ గురువైన హాస్యబ్రహ్మ జంధ్యాలను మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. తనని కనిపెట్టింది వారే అంటారు బ్రహ్మానందం వినయంగా. నాదేముంది నన్ను చూసి రచయితలు వైవిధ్యమయిన పాత్రలు రాసారు, వాళ్ళు రాసిన విధంగా నేను చేశాను. అంతే! అందులో నా గొప్పతనం ఏముంది అన్నట్టు అంటారు, కానీ, రచయితలు రాసినా దాన్ని తెర మీద పండించాలి అంటే ఎంత కష్టపడాలి. అన్నిటికంటే నవ్వించటమే కష్టం అని అందరూ అంటారు.

సినీ పరిశ్రమలో ప్రతిభే అన్నింటికీ మించిన బ్యాక్‌ గ్రౌండ్‌. మనం ఇది చేయాలి.. ఆ స్థాయి అందుకోవాలని లెక్కలేసుకొని అడుగుపెడితే ఫలితం ఉండదు. ఏ నిచ్చెన ఎక్కాలో, ఎంత దూరం వెళ్లాలో దేవుడు నిర్ణయించేశాడన్నది నా గట్టి నమ్మకం. అలాగని మన ప్రయత్నాలు ఆపకూడదు. ఏమీ లేదే అని బాధ పడకూడదు. నా  వెనుక ఏముందని ఇంత దూరం వచ్చేశా? బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రవితేజ.. వీళ్ల వెనుక ఉన్నదేంటి? పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, కథానాయకుల కుమారులు ఎందుకు చిత్రసీమలో రాణించలేకపోతున్నారు? అంటారు ఆయన.

ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పలువురు నూతన కమెడియన్‌లు పరిచయం కావడంతో వారికీ అవకాశాలివ్వాలన్న ఉద్దేశంతో బ్రహ్మీ కాస్త పక్కకు తప్పుకున్నారు. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. బ్రహ్మీ  నటుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా. ప్రస్తుతం తన ఊహలకు తగ్గట్టుగా బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయన ఇలానే నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం! 


- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com