ఇండియన్ మెడికల్ లెజెండ్-డా.ప్రతాప్ సి రెడ్డి
- February 05, 2025
వేల కోట్లు..9 పదుల వయసు. ఈ సమయంలో ఎవరైనా ఏమనుకుంటారు. సంపాదించింది చాలు. విశ్రాంతి తీసుకుందాం.జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అని.కానీ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాత్రం అలా అనుకోరు.ఆయన 9 పదుల వయసులోనూ యువకుడి మాదిరిగా ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ రోజూ యువ వైద్యుల వలే తన వైద్య వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. తన వయసును లెక్కచేయకుండా కూడా వారానికి ఆరు రోజుల పాటు ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ అంకితభావం, ఈ కృషి వల్లే ఆయన్ను విజయాలు వరించాయి. నేడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి జన్మదినం.ఈ సందర్భంగా ఆయన జీవన ప్రస్థానం మీద ప్రత్యేక కథనం మీకోసం...
డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి పూర్తి పేరు ప్రతాప్ చంద్రా రెడ్డి. 1933, ఫిబ్రవరి 5న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా అరగొండ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన చంద్రశేఖర రెడ్డి, రాజ్యలక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం చిత్తూరులో పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం మద్రాస్ (చెన్నై) వెళ్లారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్ మరియు బీఎస్సి పూర్తి చేసిన అనంతరం1958లో కర్నూలు మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
మద్రాస్ నగరంలోని స్టాన్లీ మెడికల్ కళాశాలలో కార్డియాలజీలో ఎండి పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కన్సాస్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్నల్ మెడిసిన్స్‌లో రెసిడెన్సీ, మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. అనంతరం మిస్సోరీ స్టేట్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా సేవలందించారు. అమెరికాలో బిజీగా ఉన్న సమయంలోనే తన తండ్రి గారి కోరిక మేరకు ఇండియా తిరిగి వచ్చి ఢిల్లీ ఎయిమ్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు.
భారతదేశంలో వైద్య రంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో 1983లో తన మిత్రులతో కలిసి చెన్నై కేంద్రంగా 150 పడకలతో అపోలో హాస్పిటల్ ఏర్పాటైంది. దేశంలోనే మొదటి కార్పొరేట్ వైద్యశాలగా అపోలో భారత వైద్య చరిత్రలో నిలిచింది. అప్పటి వరకు విదేశాల్లో ఉన్న డాక్టర్లు సైతం అపోలోలో పనిచేసేందుకు ఇండియాకు వచ్చారు.నాణ్యమైన వైద్యానికి నమ్మిక అపోలో అనే గుర్తింపును ప్రజల్లో సంపాదించుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 పైగా హాస్పిటల్స్, 6000పైగా ఫార్మసీ కేంద్రాలు మరియు 2000కు పైగా రిటైల్ మెడికల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రుల సంస్థ రూ. 70,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో లిస్టెడ్ కంపెనీలో 29.3% వాటాను కలిగి ఉంది.
దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్తలలో డాక్టర్ రెడ్డి ఒకరు. తన జీవితంలో అన్ని సాధించిన ఆయన..ఇప్పటికీ చురుగ్గా వైద్య వృత్తిని నిర్వర్తిస్తారు. అపోలో ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వారంలో ఒక్క రోజు మాత్రమే సెలవు తీసుకుంటారు. ఆరు రోజుల పాటు .. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రికి వెళ్తారు.
డాక్టర్ ప్రతాప్ రెడ్డికి నలుగురు కుమార్తెలు ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, శోభనా కామినేని, సంగీత రెడ్డి. వీరిలో ప్రీతారెడ్డి అపోలో ఆసుపత్రులకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంగీత రెడ్డి జాయింట్ MD, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌లుగా సునీత, శోభన ఉన్నారు. వీరంతా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో కీలక పాత్రలను నిర్వహిస్తూ..విజయవంతమయ్యారు. ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
డాక్టర్ రెడ్డి వైద్య రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నిరుపేద చిన్నారులకు కావాల్సిన వైద్య సేవలకు అయ్యే ఖర్చును తమ హాస్పిటల్ ఫాండేషన్ తరపున భరిస్తున్నారు. అలాగే, చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, మంచి నీటి ప్లాంట్స్ స్థాపించారు. తన స్వస్థలమైన అరగొండ గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగానే తమ ఆసుపత్రుల్లో వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకున్నారు. వైద్య రంగం మీద పరిశోధనలు జరిపే ప్రఖ్యాత అంతర్జాతీయ మెడికల్ కళాశాలలకు భారీగా విరాళాలు ఇచ్చారు.
వైద్య మరియు సామాజిక సేవా రంగాల్లో విశేషమైన కృషి చేసిన ఆయన్ని 1991లో పద్మభూషణ్, 2010లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్రం ఆయన్ని సత్కరించింది. ఇవే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక అవార్డులను, హానరరీ డాక్టరేట్లను సైతం డాక్టర్ రెడ్డి అందుకున్నారు.
తన వ్యాపార సామ్రాజ్యంలో కూతుర్లను విజయవంతంగా భాగస్వాములను చేసిన డాక్టర్ రెడ్డి..మూడో తరం సక్సెస్ లోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందుకోసమే ఇప్పటికీ 9 పదుల వయసులోనూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఆయనకు 10 మంది మనవలు మరియు మనవరాళ్లు ఉన్నారు. వారందరి ఆసక్తులను తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే వారికి అపోలోలో కీలక బాధ్యతలు అప్పగించారు. వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలు ఇంకా పెరగాలని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







