ఢాకాలో ఆరుగురు ఉగ్రవాదులు హతం

- July 01, 2016 , by Maagulf

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో దాదాపు 11 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్‌ ముగిసింది. గుల్షన్‌ ప్రాంతంలోని రెస్టారెంట్‌ను ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకోగా.. భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్ర చెర నుంచి బందీలను విడిపించారు. కాగా.. బందీలను విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు బలయ్యారు. 

ఢాకాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్‌ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్‌ రెస్టారెంట్‌పై నిన్న రాత్రి కొందరు ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం రెస్టారెంట్‌ సిబ్బందితో పాటు పలువురు విదేశీ పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, 100 మంది కమాండోలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. రెస్టారెంట్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులకు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ముష్కరుల నుంచి 13 మందిని రక్షించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ఖైదా వేర్వేరుగా ప్రకటించుకున్నాయి. ఢాకాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సమీక్షించారు. ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండించారు. ఢాకాలో భారత హైకమిషన్‌ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ దిల్లీలో తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com