ఇజ్రాయేల్ లో వరుసగా మూడు బస్సు పేలుళ్లు

- February 21, 2025 , by Maagulf
ఇజ్రాయేల్ లో వరుసగా మూడు బస్సు పేలుళ్లు

ఇజ్రాయేల్: వరుస బస్సు పేలుళ్లతో ఇజ్రాయేల్ ఉలిక్కిపడింది.స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం బాట్‌యామ్‌ సిటీలో మూడు బస్సుల్లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. హమాస్‌తో కాల్పులు విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పేలుడు ఘటన జరగడం గమనార్హం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బాట్‌యామ్ నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాంబు స్క్యాడ్‌తో సహా ఎమర్జెన్సీ దళాలు అక్కడకు చేరుకుని.. విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బాట్‌యామ్‌ మేయర్ టజ్వికా బ్రోట్ ధ్రువీకరించారు.

మరోవైపు, పేలుళ్ల వెనుక పాలస్తీనా ఉగ్ర సంస్థలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇజ్రాయేల్‌ రక్షణశాఖ మంత్రి కాట్జ్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లో గుర్తించిన పేలుడు పదార్థాలు… తాజా ఘటనలో పరికరాలు ఒకేలా ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఉగ్రదాడి అనడానికి పలు ఆధారాలు లభ్యమవుతున్నాయని వివరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశానికి పిలుపునిచ్చినట్లు తెలిపింది.

గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీల్లో చనిపోయిన నలుగురు ఇజ్రాయెలీల మృతదేహాలను హమాస్‌ అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అందులో ఒ మృతదేహం తమ దేశానికి చెందిన మహిళది కాదని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com