టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు

- February 24, 2025 , by Maagulf
టన్నెల్‌లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు

హైదరాబాద్: హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించింది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది.కన్వేయర్‌ బెల్టు సహాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండడం..ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసమవడం, నీరు.. బురద.. బోరింగ్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలడంతో వాటిని బయటికి తీసుకురావాలని.. ఆ తర్వాతే లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు.

ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు.లోపల ప్రమాదం జరిగిన తీరును.. ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్‌ను(మ్యాప్) తయారు చేశారు.దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు.లోపలికి వెళ్లేందుకు దీన్ని వినియోగించుకుంటారు. మరోవైపు ముందుగా సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరించడం కోసం తగిన సామాగ్రిని పంపిస్తున్నారు.అలాగే ఆక్సిజన్ అందించే వీ ట్యూట్‌ను పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన తీరుపై రెస్క్యూ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి.టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్లాలి, అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు.కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది.దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది.ఇవన్నీ జరగాలంటే కనీసం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com