సాహిత్య దిగ్గజం-రా.రా
- February 28, 2025
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శను ఒక ప్రామాణిక సాహిత్య ప్రక్రియగా అభివృద్ధి చేసింది రాచమల్లు రామచంద్రారెడ్డి. శ్రీశ్రీ ఆయనను ‘‘క్రూరుడైన విమర్శకుడు’’ అన్నాడు. కాని వాస్తవంగా ఆయన మృదుస్వభావుడు, సౌమ్యశీలి. ఆయన వ్యక్తులలోని లోపాలను, బలహీనతలను అర్థం చేసుకున్నారు తప్ప ఎవరినీ ద్వేషించలేదు.రా.రా.ను మర్చిపోతే మనం తెలుగులో ‘‘సాహిత్య విమర్శ’’ అన్న సాహితీ ప్రక్రియను మరిచిపోయినట్టే. నేడు సాహిత్య దిగ్గజం రా.రా జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
రా.రాగా ప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డి 1922 ఫిబ్రవరి 28న కడప జిల్లా పైరిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి భయపురెడ్డి దంపతులకు జన్మించారు. పులివెందుల హైస్కూలు చదువు ముగించి అనంతపురంలో ఇంటర్మీడియేట్ పూర్తిచేశారు. చెన్నైలోని ‘గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్‌లో చేరారు. 1941లో గాంధీ నిరాహారదీక్షకు మద్దతుగా కాలేజీలో జరిగిన సమ్మెలో పాల్గొని కళాశాల బహిష్కరణకు గురయ్యారు. క్షమాపణ చెప్పితే చేర్చుకుంటామని కాలేజీ యాజమాన్యం చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పడానికి ఆయన, చండ్ర పుల్లారెడ్డి నిరాకరించారు. అంతటి దేశభక్తుడాయన. 1944లో విశాలాంధ్రలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 1950లో మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యారు.జీవితం చివరి దాకా మార్క్సిజాన్నే గాఢంగా విశ్వసించారు.
1968లో ‘సంవేదన’ పత్రికను నడిపారు. కొద్ది కాలమే నడిచినప్పటికీ, ‘సంవేదన’ అద్బుతమైన కథా సాహిత్యాన్ని, విమర్శనా సాహిత్యాన్ని వెలువరించింది. 1970 నుండి 1976 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పని చేశారు. మార్క్స్, ఏంగెల్స్ సంకలిత రచనలు, లెనిన్ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్ కథలు మొదలైన రష్యన్ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని ‘హోచిమిన్’ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తర్వాత కాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అనుభవించారు. 1977లో ఈనాడులో సంపాదకులుగా చేరారు.
రారా గొప్ప కథకుడు. కథానికకు ఒక కొత్త ఒరవడినీ, నిర్వ చనాన్ని ఇచ్చారు. ఆయన రాసిన ‘కథానిక, శిల్పం’ అన్ని వ్యాసంలో కథానికా లక్షణాలను వివరిం చారు. ఆయన రాసిన 12 కథానికలు 1960లో ‘అలసిన గుండెలు’ పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. వాస్తవ సమాజ చిత్రం ఈ కథానికల్లో మనకు కనిపిస్తుంది. వివిధ రకాల పరిస్థితులలో వ్యక్తుల మధ్య ఏర్పడే సంఘర్షణ, పరిస్థితుల ఆధారంగా మారే మానవ స్వభావం, సంబంధాలు, మానవుల జీవితాలలో వ్యవస్థలు సృష్టించే అలజడుల్ని హృద్యంగా చిత్రించారు.
"జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే ఈ కథలలో చదివి షాక్ తింటాం’’ అన్నారు ప్రఖ్యాత రచయిత, సాహితీ విమర్శకులు కొడవటిగంటి కుటుంబరావు. జీవితానికి సంబంధించిన ఒక సత్యాన్నో, ఒక నీతినో, నియ మాన్నో, ఒక సూత్రాన్నో పాఠకునికి తెలియ చెయ్యాలి, అదే కథానిక లక్ష్యం అంటారు రా.రా. సాహిత్యానికి, అనుభూతికి మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరిస్తూ సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమేననీ, అనుభూతి లేకుండా సాహిత్యం లేదని అంటారు. ఒక్క వాక్యంలో పాత్రకు రూపకల్పన చేసే శక్తి రారాకు ఉన్నది. ఈ విషయంలో ఇప్పటి కథా రచయితలకు రా.రా. మార్గ దర్శకులు.
రా.రా విమర్శ, రా.రా వ్యక్తిత్వం, రా.రా వచనం... అదొక అద్భుతమైన కాక్‌టెయిల్. గొప్ప నవల, ఉత్తమ కవిత్వం. పరవళ్లు తొక్కే పద్యం ఇచ్చే కిక్కుని సాహిత్య విమర్శ ద్వారా ఇవ్వగలిగినవాడు రారా ఒక్కడే! ఆ మేజిక్ ఆయనకెలా తెలుసు? చలం జీవితాదర్శం, శ్రీశ్రీ ఖడ్గసృష్టి, గురజాడ కన్యాశుల్కం, రారా ‘సారస్వత వివేచన’ నన్ను ఒక్కలాగే పరవశుణ్ణి చేశాయి. నిద్రకి దూరం చేశాయి. ఏమిటి రారాకి తెలిసిన ఆ రహస్యం? చాలా సింపుల్. ఆయన నిష్కపటి. నిర్మొహమాటి. నిజాయితీని నిప్పుల్లో కాల్చుకుతినే కిరాతకుడు. చలం చెప్పినట్టు నువ్వో నేనో ఇప్పించే రెండు ఇడ్డెన్ల మీద ఇన్‌స్పైర్ అయి పొగిడే రకం అస్సలు కాదు. తాళ్లపాక అన్నమాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రారెడ్డి... రాయలసీమ సాహితీరుచుల్ని మనకందించిన ఈ ముగ్గురూ చిత్రంగా కడప జిల్లా వాళ్లే.
రాచమల్లు రామచంద్రారెడ్డి అంటే తెలుగు జాతి సమస్తం చేసుకున్న ఒక పుణ్యం. తెలుగు విమర్శకన్న ఒక బంగారు కల. తెలుగు సాహిత్యాకాశం మనకి ప్రసాదించిన కార్తీక పున్నమి వెన్నెల. ‘పాఠకుని హృదయానికి ఎక్కేది కళ. పాఠకుని చర్మాన్ని మాత్రమే తాకి, గిలిగింతలు పెట్టేది వినోదం. గిలిగింతల కొరకే సాహిత్యం చదివే పాఠకులు మెచ్చుకున్నారంటే, అది రచయితలకు ప్రమాదకరమే.’ అని హెచ్చరించారు.
స్వచ్ఛమైన సాహిత్యం కోసమే బతికిన అరుదైన వ్యక్తి రా.రా. సాహిత్యం పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం పట్ల కోపంతో ఊగిపోయిందీ ఆయనే. ‘క్షమించరాని నేరాలను తూర్పారబట్టేటప్పుడు మాత్రమే మా విమర్శలు నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాయ’ని రా.రా అన్నారొకసారి. సాహిత్యం పట్ల లోతైన అవగాహన, గొప్ప క్లారిటీ, రసహృదయం ఉన్న అరుదైన సాహితీవేత్త రారా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988, నవంబర్ 25న కన్ను మూశారు.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!