క్రియేటివ్ చిత్రాల దర్శకుడు - చంద్రశేఖ‌ర్ యేలేటి

- March 04, 2025 , by Maagulf
క్రియేటివ్ చిత్రాల దర్శకుడు - చంద్రశేఖ‌ర్ యేలేటి

సినీ పరిశ్రమలో చాలా మంది ద‌ర్శ‌కులు ఒక సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత స‌క్సెస్ అవుతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ కొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే క‌థ‌ను కొత్త‌గా చెప్పాలి..లేదంటే తెలిసిన క‌థ‌నే కొత్త‌గా చూపించాలి అని అనుకుంటారు. అందులో మొద‌టి వ‌రుస‌లో ఉండే ద‌ర్శ‌కుడు చంద్రశేఖ‌ర్ యేలేటి. కేవలం ఈయ‌న తెలుగులో సినిమాలు తీసినందుకే ఇక్క‌డ ఉండిపోయాడు అని చాలా మంది అభిప్రాయ ప‌డుతుంటారు. ఈయ‌న ఆలోచ‌న‌లు, సినిమాలోని పాత్ర‌లు నిజ‌జీవితం నుండి ప్రేర‌ణ పొందినట్లు ఉంటాయి. ఈయ‌న కెరీర్‌లో తీసిన‌వి 7 సినిమాలు మాత్ర‌మే. అందులో ప్ర‌తి సినిమా ఒక్కో జోన‌ర్‌లో తెర‌కెక్కాయి. నేడు చంద్రశేఖ‌ర్ యేలేటి ఆయన సినీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ...
 
చంద్రశేఖ‌ర్ యేలేటి 1973, మార్చి 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో యేలేటి సుబ్బారావు దంపతులకు జన్మించారు. వారి స్వస్థలం తుని మండలం రేఖవానిపాలెం గ్రామం. విజయవాడ దగ్గర్లోని గన్నవరం వద్ద ఉన్న సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్లస్ టూ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత విశాఖలోని మెరైన్ కమ్యూనికేషన్స్ సంస్థలో మెరైన్ కమ్యూనికేషన్స్ డిగ్రీ రెండో సంవత్సరంలో మానేశారు. ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు, దర్శకధీరుడు రాజమౌళి భార్య రమా, సంగీత దర్శకుడు కీరవాణి భార్య శ్రీవల్లిలు యేలేటికి దగ్గర బంధువులు.

యేలేటి చిన్న నాటి నుంచే సృజనాత్మకంగా ఆలోచించేవారు. అందుకే ఆయన డిగ్రీ రెండో సంవత్సరంలోనే ఆపేసి తన బంధువు గంగరాజు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ సంస్థలో క్రియేటివ్ డిజైనర్‌గా పని చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో సినిమా రంగంలోకి గుణ్ణం గంగరాజు తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తీసిన  ‘లిటిల్ సోల్జ‌ర్స్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేశారు. ఈ సినిమా తీస్తున్న సమయంలోనే సినిమా మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత గంగరాజుతో కలిసి పలు యాడ్స్ అండ్ కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్ తీశారు.

యాడ్ ఫిలిమ్స్ చేస్తూనే గుణ్ణం గంగ‌రాజు నిర్మించిన  అమృతం సిరీయ‌ల్‌కు మొద‌ట ప‌ది ఎపిసోడ్ల‌కు ద‌ర్శ‌కుడిగా పనిచేసిన త‌ర్వాత యేలేటి ‘ఐతే’ సినిమాను తెర‌కెక్కించారు. అమృతం సిరియ‌ల్‌కు నిర్మాత‌గా వ్యవ‌హ‌రించిన గుణ్ణం గంగ‌రాజు గారే ‘ఐతే’ చిత్రాన్ని నిర్మించారు. థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం 2003 ఏప్రిల్ 11న విడుద‌లైంది. క‌మర్షియ‌ల్‌గా ఈ చిత్రం మంచి స‌క్సెస్‌ను సాధించండంతో పాటు నేషనల్ అవార్డ్, నంది అవార్డ్ వంటి రెండు ప్రెస్టీజియస్ అవార్డులు కూడా వచ్చాయి. ఇదే సినిమా త‌మిళ్‌లో ‘నామ్‌’గా, మ‌ల‌యాళంలో ‘వాంటెడ్‌’గా రీమేక్ అయింది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు దక్కించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది చంద్రశేఖర్ యేలేటి  సాధించి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు.

‘ఐతే’ చిత్రం త‌ర్వాత యేలేటికి విభిన్న క‌థ‌ల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనే గుర్తింపు వ‌చ్చింది. దీని త‌ర్వాత ఛార్మీ, జ‌గ‌ప‌తిబాబు, శ‌శాంక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘అనుకొకుండా ఒక రోజు’ అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించారు. హీరోయిన్ లైఫ్‌లో ఒక రోజు మిస్స‌యింది. ఆ ఒక్క రోజు ఎలా మిస్స‌యింది? అస‌లు ఆ రోజు ఏం జ‌రింగింది? అనే కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త ఎక్సిపీరియెన్స్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఇచ్చారు.

డ్ర‌గ్స్ వాడేవారు, మూఢ న‌మ్మ‌కాల‌ను ఎక్కువ‌గా న‌మ్మేవారు ఇద్ద‌రూ ఒక‌టే.. వీళ్లిద్ద‌రూ పిచ్చివారే అనే సారాంశంతో ఈ చిత్రాన్ని ముగించారు.ఇలాంటి కథతో సినిమా తీయొచ్చు కానీ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దకపోతే పెద్ద డిజాస్టర్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక్కడే యేలేటి గొప్పతనం మొత్తం బయటపడింది. తన టేకింగ్‌తో మాయచేశారు. ఇప్పుడైనా ఈ సినిమాని సరదాగా పెట్టుకుంటే కదలకుండా క్లైమాక్స్ వరకు చూసేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా చాలా బాగా కుదిరాయి. గంగరాజు నిర్మాతగా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

వెంటవెంటనే సినిమాలు చేసేయాలని, ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో యేలేటి ఉండరు. అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలకు కనీసం రెండు లేదా మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అలా ‘ఐతే’ తర్వాత రెండు సంవత్సరాలు టైమ్ తీసుకొని ‘అనుకోకుండా ఒక రోజు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఏలేటి. ఆ మూవీ కూడా నంది అవార్డులను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో యేలేటి డిమాండ్ మరింత పెరిగిపోయింది. దాంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది.
 
మ్యాచో స్టార్‌ గోపిచంద్‌తో యేలేటి బాంబే బ్ల‌డ్ గ్రూప్ అనే కాన్సెప్ట్‌తో  ‘ఒక్క‌డున్నాడు’ సినిమాను తెర‌కెక్కించారు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా స‌క్సెస్ కాకపోయినా ఈ చిత్రం కాన్సెప్ట్‌తోనే హాలీవుడ్‌లో ‘గెట్ ద గ్రింగో’ అనే సినిమా తెర‌కెక్కింది. హాలీవుడ్ సైతం మ‌నోడి ఐడియాని తీసుకున్నాడంటే యేలేటి ఆలోచ‌న‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు.

మంచు మ‌నోజ్‌ హీరోగా యేలేటి తీసిన  ‘ప్ర‌యాణం’ సినిమా మొత్తం ఏయిర్‌పోర్ట్‌లోనే తెర‌కెక్కింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా సాహసం, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మనమంతా చిత్రాలు సైతం కొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌వే. ఈ రెండు చిత్రాల‌కు రావాలినంత‌ గుర్తింపు రాలేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన చెక్ సినిమా త‌ప్పితే ఈయ‌న తెర‌కెక్కించిన 6 సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యంలా ఉంటాయి.

- డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com