రష్యాపై ఆంక్షలతో యూరో నష్టం కోట్లాది డాలర్లు

- November 06, 2018 , by Maagulf
రష్యాపై ఆంక్షలతో యూరో నష్టం కోట్లాది డాలర్లు

బ్రస్సెల్స్‌:రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల యురోపియన్‌ యూనియన్‌ (ఇయు) వంద బిలియన్ల యూరోల వరకు నష్టపోయిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆంక్షల విధానం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం లేకపోయినా ఇయు మాత్రం కోట్లాది డాలర్లు నష్టపోయిందన్నారు. స్పానిష్‌ వార్తాపత్రిక ఎల్‌ పైస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, ఇయు-రష్యా సంబంధాలు అధ్వాన్న రీతిలో వుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇయు, రష్యాల మధ్య ప్రధానంగా వివాదం తలెత్తడానికి కారణం ఆంక్షలేనని, అమెరికా నుండి వచ్చిన ప్రత్యక్ష ఆదేశాల మేరకు ఇయు ఈ ఆంక్షలను రష్యాపై విధించిందని లావ్‌రోవ్‌ విమర్శించారు. ఇలా చేయడం వల్ల అమెరికాకు వచ్చిన నష్టం ఏమీ లేదని, కానీ ఇయు అలా కాదని, దారుణంగా దెబ్బ తిందని అన్నారు. ఆంక్షల వల్ల ఇయు దేశాలకు కలిగిన నష్టం అంచనాలు మారుతూ వచ్చాయన్నారు. కొన్ని వర్గాల అంచనాల ప్రకారం, వంద బిలియన్ల డాలర్ల వరకు ఈ నష్టం వుందని పేర్కొన్నారు. యురోపియన్‌ యూనియన్‌ రాజకీయ నేతలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

దీనిపై ప్రతీకార చర్యలు తీసుకోవాల్సిన రష్యా మాత్రం 2014లో యురోపియన్‌ ఉత్పత్తులపై తాము విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి సిద్ధపడింది. ప్రతీకార చర్యలు రద్దు చేయడానికి సంసిద్దతను వ్యక్తం చేసామని లావ్‌రోవ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com