అమెరికా:గంటకు 148 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు..

- March 14, 2019 , by Maagulf
అమెరికా:గంటకు 148 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు..

అమెరికా గజగజా వణుకుతోంది. అగ్రరాజ్యాన్ని మంచు తుఫాను ఊపిరి తీసుకోకుండా చేస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి ఇప్పటికే 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంచు తుఫాను కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. స్కూళ్లు, వ్యాపారాలు మూతబడ్డాయి.

కొన్ని చోట్ల భారీ హిమపాతాకి తోడు పిడుగులు కూడా పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొన్ని లక్షల కుటుంబాలు చీకటలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారికంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫానును బాంబ్‌ తుపానుగా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారి పడిపోవడం.. ఒక వాహానాన్ని మరో వాహనం ఢీ కొన్న ఘటనలు భయపెడుతున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే కూడా అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com