ఉపరాష్ట్రపతిపై సచిత్ర పుస్తకం ..

- August 10, 2019 , by Maagulf
ఉపరాష్ట్రపతిపై సచిత్ర పుస్తకం ..

భారత ఉపరాష్ట్రపతి రెండేళ్ళ ప్రస్థానం మీదరూపొందించిన సచిత్ర పుస్తకం ( కాఫీ టేబుల్ బుక్) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. "లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్" పేరిట ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపు దిద్దింది. చెన్నై వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించనున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రెండేళ్ళ ప్రస్థాన విశేషాలతో కూడిన సచిత్ర పుస్తకాన్ని (కాఫీటేబుల్ బుక్) ఈ ఆదివారం చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. "లిజనింగ్, లెర్నింగ్ & లీడింగ్" పేరిట కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, సమాచార ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ పర్యవేక్షించనున్నారు.

గత రెండేళ్ళలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్న 330 కీలకమైన కార్యక్రమాల విశేషాలతో ఈ పుస్తకాన్ని రూపు దిద్దారు. విశాల భారతంలో విస్తారంగా పర్యటించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రెండేళ్ళలో 61 స్నాతకోత్సవాల్లో ప్రసంగించారు, 35 కార్యక్రమాల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు, 97 శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థలను సందర్శించారు. అంతే కాదు 25 ప్రత్యేక స్మారక ప్రసంగాలు చేశారు. పనామా, గ్వాటెమాల, కోస్టారికా, మాల్టా లాంటి దేశాలను సందర్శించిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే కావడం విశేషం. ఈ పుస్తకంలో ఉపరాష్ట్రపతి 4 ఖండాల్లోని 19 దేశాల సందర్శనతో కూడిన దౌత్యపరమైన వివిధ కార్యక్రమాలకు చోటు కల్పించారు. రాజ్యసభ ఛైర్మన్ గా ఉపరాష్ట్రపతి సాధించిన విజయాలు, రాజ్యసభ గొప్పతనాన్ని చాటేందుకు, సామర్థ్యాన్ని పెంచేందుకు ఆయన చేపట్టిన వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను సైతం ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.

ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంతో పాటు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్, ఇస్రో మాజీ డైరక్టర్ కస్తూరి రంగన్, భారత మాజీ అటార్ని జనరల్ కె. పరాశరన్, తుగ్లక్ పత్రిక ఎడిటర్ స్వామినాథన్ గురుమూర్తి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డా. ప్రతాప్ సి. రెడ్డి, వి.ఐ.టి. వ్యవస్థాపక ఛైర్మన్ డా. జి. విశ్వనాథన్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com