IPL 2025: ధనా ధన్ క్రికెట్ కి సర్వం సిద్ధం!

- March 21, 2025 , by Maagulf
IPL 2025: ధనా ధన్ క్రికెట్ కి సర్వం సిద్ధం!

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ 18వ సీజ‌న్ మార్చి 22న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. పది జట్లు ట్రోఫీ కోసం పోటీపడతాయి.

కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈసారి టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కోల్‌కతాలో ఆరెంట్ అలర్ట్ !

అయితే ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌కు వాతావరణం ప్రధాన సమస్యగా మారింది. ఆర్సీబీ – డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ భారీ వర్ష సూచనతో రద్దయ్యే అవకాశముంది. దక్షిణ బెంగాల్ ప్రాంతంలో గురువారం నుండి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరగనున్న మార్చి 22న కోల్‌కతా నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ ప్రకటించారు. కోల్‌కతాలో వర్ష సూచన నేపథ్యంలో, క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

అయితే, వర్షం తక్కువగా ఉంటే మ్యాచ్ తడిసిన మైదానంపై DLS (డక్‌వర్త్ లూయిస్) పద్ధతిలో పూర్తయ్యే అవకాశముంది. కానీ, వర్షపాతం ఎక్కువగా ఉంటే మ్యాచ్ పూర్తిగా రద్దవ్వొచ్చు. ఐపీఎల్ 18వ సీజన్ తొలి రోజు వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

ఇది అంతకు ముందే తమ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని భావించిన జట్లకు నిరాశ కలిగించొచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూసే అభిమానులు వాతావరణ సూచనలతో ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com