సినిమా రివ్యూ: ‘మ్యాడ్ స్క్వేర్’

- March 29, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మ్యాడ్ స్క్వేర్’

మ్యాడ్ (MAD)’ అనే టైటిల్‌తో గతేడాది వచ్చిన సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కిన సినిమానే ఈ ‘మ్యాడ్ స్క్వేర్’. ఆ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయం దక్కించుకుంది. కొత్త కుర్రాళ్లు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్‌లోనూ ఈ కుర్రాళ్లే మెయిన్ లీడ్ పోషించారు. మరి, ఈ మ్యాడ్ స్క్వేర్ డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్నట్లు ప్రమోషన్లయితే భలే గట్టిగా చేశారండోయ్ ఈ సినిమాకి. చూద్దా.. అంత సీనూ సినిమా.. రిలీజ్ తర్వాత సినిమాకి వుందో లేదో తెలుసుకుందాం.

కథ:
ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన హీరోలు ముగ్గురు. ఈ ముగ్గురితో పాటూ వున్న మరో కామెడీ హీరో ఊరిలో పెళ్లికి సిద్ధమవుతాడు. ఫ్రెండ్స్‌కి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ, ఎలాగో తెలిసిపోతుంది. దాంతో ముగ్గురు ఫ్రెండ్స్ తమ బెటాలియన్‌తో పెళ్లింట్లో దిగబడిపోతారు. ఎదురు కట్నమిచ్చి చేసుకుంటున్న పెళ్లి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని లడ్డూ (పెళ్లి కొడుకు) తండ్రి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో పాపం మన లడ్డూ చాలా అవమానాలు కూడా భరించాల్సి వస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ తాళి కట్టే సమయానికి పెళ్లికూతురు వేరే కుర్రాడితో లేచిపోతుంది. దాంతో ఫ్రస్టేషన్‌లో వున్న తన ఫ్రెండ్ లడ్డూని గోవాకి తీసుకెళ్తారు మన ముగ్గురు హీరోలు. అక్కడ మాంచి ఎంజాయ్‌మెంట్‌లో వుండగా.. మ్యూజియంలో అత్యంత విలువైన ఓ డైమండ్ మిస్ అయ్యిందన్న న్యూస్ బయటికి వస్తుంది. ఈ ఇష్యూ కాస్తా మన హీరోల మెడకి చుట్టుకుంటుంది. అసలు ఆ డైమండ్ ఎలా మిస్ అయ్యింది.? మన హీరోలకీ, ఆ డైమండ్ ఇష్యూకీ సంబంధం ఏంటీ.? ఓ  వైపు పోలీసుల నుంచీ, మరోవైపు గ్యాంగ్‌స్టర్స్ నుంచీ తప్పించుకోవడానికి మన హీరోలు చేసే సాహస ప్రయత్నాలు ఎలా వున్నాయ్.? తెలియాలంటే ‘మ్యాడ్ స్క్వేర్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
నార్నే నితిన్ ఈ సినిమాకి మెయిన్ లీడ్ హీరో. ఆల్రెడీ తొలి పార్ట్‌లో తనదైన సెటిల్డ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడీ యంగ్‌స్టర్. అలాగే, ‘ఆయ్’ సినిమాతో సెకండ్ హిట్‌నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ముచ్చటగా మూడో సారి ఈ సినిమాలోనూ తనదైన నటనతో కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ఇక, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ బాగా డామినేట్ చేస్తాడు. తన బాడీ లాంగ్వేజ్, హిలేరియస్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో కట్టి పడేస్తాడు. రామ్ నితిన్ మంచి సపోర్ట్. మరో ఇంపార్టెంట్ రోల్  అయిన లడ్డూ పాత్రలో కనిపించిన కుర్రాడు విష్ణు తొలి పార్టులో మాదిరే  ఈ పార్టులోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటాడు. తండ్రి పాత్రలో మురళీ ధర్ గౌడ్ పాత్రలో పెద్దగా కొత్తదనమేమీ వుండదు కానీ, అవకాశమొచ్చినప్పుడల్లా నవ్విస్తాడు. గ్యాంగ్ ‌స్టర్‌  మ్యాక్స్ ‌పాత్రలో సునీల్, తింగరి పోలీసాఫీసర్‌ సెబాస్టియన్‌గా సత్యం రాజేష్ పాత్రలు ఆకట్టుకుంటాయ్. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నవ్విస్తాయ్.

సాంకేతిక వర్గం పని తీరు:
ఈ సినిమాకి నిర్మాణ విలువలు కథకి తగ్గట్లుగా వున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఆల్సో ఓకే. సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు మినహా.. ఇక, డైరెక్టర్ విషయానికి వస్తే, కళ్యాణ్ శంకర్‌లో మంచి కామెడీ విజన్ వుంది. తొలి పార్ట్‌‌లో కుర్రాళ్లు.. వాళ్ల కాలేజీ జీవితాలూ, లవ్ ట్రాక్స్.. ఇలా చాలా యూత్ కనెక్టింగ్ అంశాలతో కట్టి పడేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాప్‌కి వచ్చేసరికి రెండే రెండు పాయింట్లు పట్టుకున్నాడు. ఒకటి లడ్డూ పెళ్లి ఎపిసోడ్. రెండోది డైమండ్ దొంగతనం. ఓకే ఈ రెండు అంశాలతోనూ కథని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ, అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్‌ట‌ైనింగ్‌గా నడిపించడంలో కాస్త తడబడ్డాడు. ముఖ్యంగా సెకండాఫ్ బాగా విఫలమయ్యాడు. లడ్డూ పెళ్లి ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కోసం కథ గోవాకి షిప్ట్ అవుతుంది. అక్కడ డైమండ్ దొంగతనం..గ్యాంగ్‌స్టర్ మ్యాక్స్ ఎంట్రీ.. ఓ వైపు పోలీసుల ఛేజింగ్ ఇదంతా కంగాళీ అయిపోతుంది. అఫ్‌కోర్స్.! మా సినిమాకి కథ, కాకరకాయ లాజిక్కుల్లేవనీ.. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాజిక్కే అని ప్రచార చిత్రాల్లో చిత్ర బృందం కన్‌ఫామ్ చేసేసిందనుకోండి. సో, పెద్దగా లాజిక్కుల వెతక్కూడదు. కానీ, కొన్ని సీన్లు, కామెడీ కోసమే అయినా బలవంతంగా ఇరికించేసినట్లనపిస్తుంది. ఏది ఏమైతేనేం, వాళ్లు ముందే చెప్పేశారండోయ్.! లాజిక్కులు అడగొద్దని మళ్లీ మళ్లీ అదే మాట.! సో, ఎంటర్‌టైన్‌మెంట్ ఓన్లీ.

ప్లస్ పాయింట్స్:
ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్టైన్‌మెంట్..

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ ఓకే.. బట్ సెకండాఫ్ కాస్త సాగతీతే బాస్.!

చివరిగా:
 (MAD)2..! లాజిక్కుల్లేని పిచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ రెండింతలు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com