ఏపీలో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం..

- April 04, 2025 , by Maagulf
ఏపీలో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అందుబాటులోకి వచ్చింది. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెలాఖరులోగా దశలవారీగా మిగిలిన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇదో కీలక ఘట్టం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో రిజిస్ట్రేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక మందితో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

10 నిమిషాల వ్యవధిలో అమ్మకం, కొనుగోలు, సాక్షులు పని పూర్తిచేసుకొని వెళ్లే విధంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. 26 జిల్లాల్లో 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ మొదలవుతుందని అన్నారు. ఇక మీదట రోజుల తరబడి వేచిచూసే ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. భూ వివాదాలు లేకుండా, సంస్కరణలు తీసుకొస్తున్నామని, అభివృద్ధికోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నామని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com