ప్రజాకవి-వేములపల్లి శ్రీకృష్ణ
- April 09, 2025
వేములపల్లి శ్రీకృష్ణ .. చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా’’ గీతం తెలుగు సాహిత్య కీర్తికిరీటంలో కలికి తురాయి. ఆ ఒక్క గీతంతో తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి అని ఇప్పటి తరం తెలుగువారిలో చాలా మందికి తెలీక పోవచ్చు. పైగా ఆయన రాసిన ఈ ఒక్క గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గళం శ్రీకృష్ణ వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగుజిలుగులను వేనోళ్ళ కొనియాడారు. నేడు ప్రజాకవి, రాజకీయవేత్త వేములపల్లి శ్రీకృష్ణ వర్థంతి సందర్బంగా ప్రత్యేక కథనం..
కామ్రేడ్ శ్రీకృష్ణగా సూపరిచితులైన వేములపల్లి శ్రీకృష్ణ 1917లో ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే తమ ప్రాంతానికి చెందిన మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, పరంధామయ్య, పమిడిముక్కల లక్ష్మణరావు, కంఠంనేని వెంకటరత్నం తదితర ప్రముఖులతో ఏర్పడ్డ పరిచయం మరియు కమ్యూనిస్టు దిగ్గజం పులుపుల వెంకట శివయ్య గార్ల మార్గదర్శనంలో వామపక్ష భావజాలం పట్ల మక్కువ పెంచుకొని కమ్యూనిస్టు పార్టీకి దగ్గరయ్యారు.
ప్రభల కృష్ణమూర్తి, ప్రతాప రామసుబ్బయ్య, ఏటుకూరి బలరామమూర్తి, అమరవాది కృష్ణమూర్తి తదితరులతో ఏర్పడిన బంధాలు, సంబంధాలు కారణంగా 1935-36 మధ్యలో పార్టీ అగ్జిలరీ విభాగంలో ప్రవేశించారు. 1938లో పార్టీ సభ్యత్వం పొందారు. చీరాలలోని ఐ.ఎల్.టి.డి. కార్మికుల సమ్మె పోరాటంలో పోలీసు కాల్పులు జరిగిన సమయంలో సమ్మెలోని కార్మికుల సహాయార్ధం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించి వచ్చిన ఆదాయమంతా కార్మికులకు అందించారు.
శ్రీకృష్ణ బి.ఏ.పట్టా అందుకున్న తరువాత కొంతకాలం బందరు (మచిలీపట్నం) పట్టణంలోని మ్యూచువల్ ఇన్సూరెన్సు కంపెనీలో ఉద్యోగం చేసారు. అదే సమయంలో గుంటూరు నుంచి కామ్రేడ్ శివయ్య పిలుపుతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ రహస్య యంత్రాంగ నిర్వహణ బాధ్యత చేపట్టారు. 1937లో కొత్తపట్నంలో నిర్వహించిన రాజకీయ పాఠశాలకు హాజరై, ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడ్డారు.
1948లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అనంతరం రెండుసార్లు రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులుగా మరియు రెండుసార్లు జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికై సమర్థతతో బాధ్యతలు నిర్వర్తించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో సిపిఐ వైపు నిలిచారు. చివరి శ్వాస వరకు ఆ పార్టీలోనే కొనసాగారు.
1952 లో బాపట్ల నియోజకవర్గం నుంచి తొలిసారి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికైన శ్రీకృష్ణ 1962, 1972లలో మంగళగిరి నుంచి ఎమ్యెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962-64 వరకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేశారు. అలాగే, పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
1964-65 మధ్యలో జరిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో భాగంగా ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళగిరి ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1975లో పైలట్ త్రాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. నేటికి ఆ పథకం వినియోగంలోనే ఉండటం విశేషం. అలాగే, 1977లో మంగళగిరిలోనే డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయించారు.
1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొని గేయ రచనలోనూ, వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1942-43 లో హిట్లర్ సైన్యాలను మాస్కో వద్ద రెడ్ ఆర్మీ అటకాయించి తిప్పికొడుతున్న రోజుల్లో ‘మాస్కో పొలిమేరల్లోనా’ కోలాటం పాట, నాటి బెంగాల్ కరవుపై ‘బ్రహ్మపట్నం పోదామంటే’ అంటూ, కయ్యూరు వీరులపై… ఇలా ఎన్నో ఉద్యమ పాటలు ఆయన రాశారు.
50వ దశకం ప్రారంభంలో మొదలైన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో కామ్రేడ్ బొడ్డు గోపాలం గారి కోరిక మేరకు శ్రీకృష్ణ "చేయెత్తి జై కొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ పాటను 1952లో పల్లెటూరు చిత్రంలో ఘంటసాల పాడగా తెలుగునేల నాలుగు చెరగులా మార్మోగింది. ఈ పాటలోని తొలి శరణమే ఆ తర్వాత 1980వ దశకంలో ఎన్టీఆర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమానికి నినాదమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం అయ్యారు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!!’’ అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో. తెలుగుత తట్టిలేపి దేశ రాజకీయాల్లో చైతన్యం కలిగించింది. ఈ పాటను వేములపల్లి శ్రీకృష్ణ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా ఉండే ప్రజానాట్యమండలి కోసం రాశారు. కానీ ఈ పాట నటరత్న ఎన్టీరామారావుకు ఉపయోగపడినంతగా కమ్యూనిస్టు పార్టీకి ఉపయోగపడలేదంటుంటారు.
తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజాకవి శ్రీకృష్ణ పాత్రికేయ రంగంలో సైతం విశేషంగా రాణించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్న సమయంలో సైతం ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలకు పనిచేశారు. 1964లో పార్టీ చీలిక ఏర్పడిన తర్వాత సిపిఐ అనుబంధ పత్రిక విశాలాంధ్రకు 1968-72 వరకు సంపాదకత్వం వహించారు.
సమైక్యవాదనికి గట్టి మద్దతుదారుగా నిలిస్తూ వచ్చిన ఆయన 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో జరిగిన జైఆంధ్ర ఉద్యమాలను వ్యతిరేకిస్తూ సంపాదకీయాలు రాశారు. సమైక్యవాదానికి గట్టిగా మద్దతు తెలిపినందుకు మంగళగిరిలోని ఆయన ఇంటికి జైఆంధ్ర ఉద్యమకారులు నిప్పుకూడా పెట్టారు. అయినప్పటికి ఆయన వెనకకి తగ్గకుండా తన వాదానికి కట్టుబడ్డారు.
శ్రీకృష్ణ గారు జీవించి ఉన్నత కాలం కార్మిక శ్రేయస్సుకు పాటుపడుతూ వచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడిన ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. వారి కోసం చట్టసభల్లో పోరాడి విజయాలు సాధించారు, అనుకూల చట్టాలు చేయించారు. రాజ్ బహదూర్ గౌర్, కె. ఎల్. మహేంద్ర, కొల్లా వెంకయ్య వంటి ఎందరో కార్మిక నేతలతో కలిసి పనిచేశారు.
శ్రీకృష్ణ 80వ దశకం నాటికి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆయన భారత్- సోవియట్ మిత్రమండలి, శాంతి స్నేహ సంఘాల అభివృద్ధికి శ్రమించారు. అఖిల భారత శాంతి సంఘం నాయకుడు రమేశ్ చంద్రతో కలిసి అవిరళ కృషి చేశారు. అనేక దేశాల్లోనూ పర్యటించారు. హైదరాబాద్ సి.ఆర్.ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి కొండాపూర్‌లో సి.ఆర్.ఫౌండేషన్ వృద్ధాశ్రమం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
విస్తృత జీవితానుభవాలతో, రాజకీయ ఉద్యమానుభావాలతో రాటుదేలిన వేములపల్లి శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి తలపండిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు. ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన శ్రీకృష్ణ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. మూడుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైనప్పటికి చివరి వరకు రిక్షాలోనే ప్రయాణించేవారు.
నమ్మిన సిద్దాంతాన్ని కడదాకా ఆచరించి చూపిన నిబద్దత కలిగిన ప్రజా నాయుకుడు వేములపల్లి శ్రీకృష్ణ 2000, ఏప్రిల్ 8న అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోనే మరణించారు. వారి చివరి కోరిక మేరకు మరణానంతరం నేత్రాలను హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి వారి కుటుంబ సభ్యులు దానం చేశారు.
‘‘మనసులోని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పటం అలవర్చుకోండి. ప్రజల దైనందిన సమస్యలు తెల్సుకుని సాన్నిహిత్యం పెంచుకోండి. చెప్పే మాటలకూ, చేసే పనులకూ దూరం పెరిగే కొద్దీ మీకు ప్రజలు దూరమవుతారు. సిద్ధాంత పరిజ్ఞానంతోపాటు వాస్తవ పరిస్థితుల అధ్యయనం అవసరం.’’ అనే స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు ఆయన్ను తెలుగుజాతి చరిత్రలో చిరస్మరణీయునిగా నిలిపాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!