కాంగ్రెస్ మేధో రాజకీయవాది-జైరాం రమేష్

- April 10, 2025 , by Maagulf
కాంగ్రెస్ మేధో రాజకీయవాది-జైరాం రమేష్

జైరాం రమేష్...ఈపేరు వింటే ముందుగా గుర్తుకువచ్చేది పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు మరియు కాంగ్రెస్ రాజకీయాలు. ఆర్థికవేత్తగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో స్థిరపడ్డ రమేష్, కేంద్రమంత్రిగా అభివృద్ధి కంటే పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యతనిచ్చి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రాజకీయ మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న రమేష్‌పై  ప్రతేక కథనం...

జైరాం రమేష్ 1954, ఏప్రిల్ 9న ఒకప్పటి మైసూర్ రాష్ట్రంలోని చిక్‌మగళూరులో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సి.కె.రమేష్, శ్రీదేవి దంపతులకు జన్మించారు. రమేష్ బాల్యం, విద్యాభ్యాసం రాంచీ, బొంబాయి(ముంబై)లలో జరిగింది. బాంబే ఐఐటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని కార్నెగీ మిలన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు.

రమేష్ రాజకీయాల్లోకి రాకముందు వరల్డ్ బ్యాంకులో కోద్ది కాలం పనిచేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి ప్రముఖ ఆర్థికవేత్త లోవరాజ్ వద్ద ఆర్థిక విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మరియు ఎనర్జీ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1989-91 వరకు విపి సింగ్ మరియు చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో పనిచేశారు. 1991లో జైరాం పివి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక రంగంలో పనిచేయడం మొదలుపెట్టారు.

1991-96 వరకు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ మరియు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీలతో కలిసి పనిచేశారు. పివి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో రమేష్ కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో కాశ్మీర్ స్పెషల్ మిషన్  విభాగంలో సైతం పనిచేశారు. 1996-98 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంకు సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలోనే పివి ఆర్థిక సంస్కరణలు పూర్తిగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి.

1999-2004 వరకు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన కీలక సభ్యుడిగా రమేష్‌ సేవలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ని గుర్తించాయి. కర్ణాటక సీఎం ఎస్.ఎం కృష్ణ ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా 2002 నుంచి 2004 వరకు కొనసాగారు. ఇదే సమయంలో అప్పటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఏపీ ఆర్థిక సలహా సంఘంలో సభ్యుడిగా కొనసాగారు.

రమేష్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కొనసాగుతూ వచ్చారు. 80వ దశకం నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పాలసీ విభాగంలో పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రచన విభాగంలో పనిచేశారు. రాజీవ్ మరణం తర్వాత పివి హయాంలోనే రమేష్ రాజకీయంగా పార్టీలో గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చారు. అయితే, పివితో సన్నిహితంగా ఉంటూనే రమేష్ సోనియా గాంధీకి, ఆమె వ్యక్తిగత కార్యదర్శి  విన్సెంట్ జార్జిలతో సైతం మైత్రి సాగించారు. సోనియా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె రాజకీయ మేధో శిబిరంలో రమేష్ సభ్యుడయ్యారు.  

2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పచిన మ్యానిఫెస్టో మరియు ప్రచార కమిటీల్లో ప్రణబ్ ముఖర్జీతో కలిసి పనిచేసి పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించారు. పార్టీ గెలుపులో జైరాం రమేష్ పాత్రను గుర్తించిన సోనియా గాంధీ తన రాహుల్ గాంధీని రాజకీయంగా తీర్చిదిద్దే బాధ్యతను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాహుల్ నమ్మే అతికొద్దీ వ్యక్తుల్లో జైరాం ఒకరు.

2004లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రమేష్ యూపీఏ 1 ప్రభుత్వ పథకాల రూపకల్పన మరియు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ జాతీయ సలహాదారు కౌన్సిల్లో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-09 వరకు రమేష్ పూర్తిగా పార్టీ వ్యవహారాల్లోనే గడిపారు. 2009 ఎన్నికల్లో పార్టీ ఎన్నికల వ్యూహాల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో మరియు గాంధీల వద్ద రమేష్ పరపతి బాగా పెరిగింది.

2009-14 వరకు కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖల ( స్వతంత్ర), గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పర్యావరణ మరియు అటవీ శాఖల మంత్రిగా దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు అడవులను నరకడానికి అనుమతులు నిరాకరించి అంతర్జాతీయ స్థాయిలో బాగా ప్రాచుర్యం పొందారు. అలాగే, దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తామని 2009లో ఐక్యరాజ్య సమితి వాతావరణ సమావేశాల్లో హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షకు మారథాన్ మరియు వాక్ థాన్ లను ప్రభుత్వం తరపున నిర్వహించడం మొదలైంది కూడా రమేష్ గారి హయాంలోనే కావడం విశేషం.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రమేష్ బాధ్యతలు చేపట్టే నాటికి ఆ శాఖలో చేయాల్సిన పని చాలా మిగిలిపోయి ఉండిపోవడంతో, దానిపై శ్రద్ద పెట్టి ఉపాధి హామీ పథకానికి చెల్లింపు బకాయిలు మరియు భూ పరిహార చట్టం రూపకల్పన వంటి కీలకమైన వ్యవహారాలను త్వరతగతిన రమేష్ పూర్తిచేశారు. రమేష్ హయాంలో పలు భారీ నీటి వనరుల సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయ్యాయి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహ, ప్రచార మరియు సోషల్ మీడియా బాధ్యతలను భుజాన వేసుకున్న రమేష్, పార్టీ గెలుపు కోసం వార్ కంట్రోల్ రూమ్‌లోనే 24x7 గడిపారు. అయితే, అప్పటి వరకు పార్టీ ద్వారా లబ్ధిపొందిన సీనియర్లు, కేంద్రమంత్రులు ముఖం చాటేయడం మరియు మోడీ మానియా దేశమంతటా ఉండటంతో జైరాం కష్టానికి గుర్తింపు రాకపోగా, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది.

2014-24 వరకు మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తరపున అలుపెరుగని పోరాటం చేస్తున్న నేతల్లో జైరాం ఒకరు. మోడీ ప్రజా వ్యతిరేక పాలనా విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆరు పదుల వయస్సులోనూ చాలా కష్టపడుతూ వచ్చారు. దేశంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని సన్నిహితుల వద్ద ఇప్పటి అంటారు. రమేష్ తన రాజకీయ మార్గదర్శనంలో మొదటి పదేళ్ళపాటు ఏమి నేర్చుకొని రాహుల్ గాంధీని 2014 నుంచి రాజకీయ ఓనమాలు దిద్దించారు.

రాహుల్ జనాల్లోకి వస్తేనే కాంగ్రెస్ బ్రతుకుందని నమ్మిన వ్యక్తుల్లో జైరాం ఒకరు. గత దశాబ్దంలో రాహుల్ చేపట్టిన ప్రజా ఉద్యమాలు, పాదయాత్రల్లో జైరాం పాత్ర చాలా కీలకం. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని అధికార గద్దె మీద కూర్చోబెట్టడమే తన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన ఆయన తన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com