ప్రపంచ హోమియోపతి దినోత్సవం
- April 10, 2025
ఉష్ణం ఉష్ణేన శీతలం. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి వంటి సామెతలను మనం తరచూ వింటూ ఉంటాం. కానీ, ఈ సామెతలను ప్రామాణీకరించి, దానికి చికిత్స ప్రక్రియకు అన్వయింపచేసి ఒక వ్యాధి దేనివలన వస్తుందో దానికి విరుగుడు కూడా అదే అనే సూత్రంపై హోమియో వైద్య విధానం పనిచేస్తోంది.రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం..జర్మనీకి చెందిన శామ్యూల్ హనీమన్ ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.
రోగి.. రోగం.. ఔషధం.. అన్న మూడు అంశాలకు హోమియోపతిలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వస్థత, అస్వస్థత, వ్యాధి ఈ అంశాలను ‘రోగ’ పరంగా కాక ‘రోగి’ పరంగా విశ్లేషించాలి అన్నది హోమియో వైద్య మౌలిక సూత్రం. మనిషిని కేవలం ఒక రోగిలా, యంత్రంలా చూస్తూ నిమిషాలలో చీటీ రాసి ఇచ్చేయడం కాకుండా.. మనిషిని, అతని తత్వాన్ని.. అతని శరీరంలో తలెత్తిన సంక్షోభాన్ని సానుకూలంగా అర్థం చేసుకుని, దానిని బట్టి చికిత్స చేయడం ఇందులోని మౌలిక అంశం.
హోమియోపతి వైద్య పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన శామ్యూల్ హనీమన్ 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలో జన్మించారు. స్వతహాగా అల్లోపతి వైద్యుడైన వీరు ఆనాటి అల్లోపతి వైద్యంలో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రోగికి మందుల దుష్ప్రభావాలు లేకుండా, స్వస్థత చేకూర్చడానికి తక్కువ ఖర్చుతోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారు తీసుకు వచ్చిన వైద్య ప్రక్రియే హోమియోపతి. గ్రీకు భాషలో హోమియోపతి అనగా 'అదే విధమైన బాధ' అని అర్థం.
శరీరానికి ఏ విధమైన బాధ ఉందో, అదే విధమైన బాధను శరీరంలోనికి మందుల ద్వారా చొప్పించడం వల్ల అసలు రుగ్మతను నిర్మూలించడం. అంటే ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధకు విరుగుడు కూడా అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతి మూల సూత్రం.
ఈ వైద్యంలో ప్రతి వ్యక్తి భిన్నమైన వ్యక్తే. వ్యాధితో పాటు అతని వ్యక్తిత్వం కూడా ము ఖ్యమే. ప్రతీ రోగి.. రోగం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని గుర్తించి, వ్యక్తిని అర్థం చేసుకొని దాని ఆధారంగా వ్యాధిని సమూలంగా నయం చేయడం ఈ విధానంలోని ప్రత్యేకత. తన సమస్యను తానే నయం చేసుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది హోమియోపతి వైద్యం. ఆ నయం చేసుకునే శక్తి అనేది మన అందరిలోనూ ఉంది. ఇతర వైద్య విధానాలు వ్యాధి లక్షణాలను పోగొట్టడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాయి.
అల్లోపతి వైద్యవిధానంలో వ్యాధి నుంచి సత్వర ఉపశమనం లభించగా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అల్లోపతి వైద్యంలో రోగానికి వైద్యం చేస్తారు. ఈ వైద్యం ద్వారా సత్వర ఉపశమనం లభిస్తుంది. కానీ, శాశ్వత పరిష్కారం మాత్రం లభించదు. అల్లోపతి వైద్యంలో రోగాన్ని అణచివేసే యత్నం జరుగుతోంది తప్ప ఆ రోగానికి మూలమైన ఇతర అంశాలను తొలగించే ప్రయత్నం జరగదు.
హోమియోపతిలో వ్యక్తి మానసిక లక్షణాలను సైతం పరిగణనలోనికి తీసుకుంటారు. రోగం రావడానికిగల మూలాలను విశ్లేషించి ఔషధం ఇవ్వడం జరుగుతోంది. అల్లోపతి వైద్యంలో రోగ లక్షణాలను బట్టి మందులు రాస్తారు. ఇందులో రోగి మనస్తత్వం, స్వభావం, అలవాట్లు, అనుభూతులు, రాగద్వేషాలు, జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలతో సహా అన్నీ పరిగణనలోకి తీసుకొని తగిన మందు నిర్ధారిస్తారు. హోమియో వైద్యులు రోగితో ఎక్కువ సమయం చర్చిస్తారు. ఈ సమయంలో రోగి బాధను వైద్యుడు ఆలకిస్తాడు. మనో ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తరువాతే ఔషధం ఇస్తారు. ఇది రోగికి చాలా సంతృప్తి ఇస్తుంది. నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం లేనిదే ఏ ఔషధం కూడా పని చేయదు.
వైద్యం సున్నితంగా, శీఘ్రంగా, శాశ్వ తంగా జరగాలన్నది హోమియో వైద్య ధ్యేయం. ఔషధాల వల్ల అవాంఛనీయ దుష్ఫలితాలు తలెత్తకుండా ఉండేందుకు వాటిని ప్రత్యేక పద్ధతిలో పల్చన (potentization) చేసి వాడటం మొదలు పెట్టారు. ఆ ప్రక్రియ ద్వారా రస... విష.. పాషాణాలను సైతం అమృత తుల్యమైన ఔషధాలుగా మార్చి, దుష్ప్రభావాల బాధ.. బెడద లేకుండా ఔష ధాన్ని సూక్ష్మాతి, సూక్ష్మమైన మోతాదులో వాడటం కీలకమైన అంశం.
ప్రతి పదార్థానికి భౌతిక, రసాయనిక ధర్మాలే కాక, వైద్య ధర్మాలు కూడా ఉంటాయని దాని ఆధారంగానే ఎందుకూ పనికిరానిదిగా భావించే వాటిలోనుండి కూడా మందు తయారు చేయవచ్చు. ఉదాహరణకు ఇసుక నుండి తయారు చేసిన "సైలీషియా" హోమియోపతిలో సర్జన్‌గా పనిచేస్తుంది. ఉప్పు నుండి తయారు చేసిన ‘నేట్రమ్మూర్’ కేన్సర్‌కు మందుగా పనిచేస్తుంది. ఔషధ ధర్మాల నిర్ధారణకు ఆ మందులను ముందుగా మానవులపై మాత్రమే ప్రయోగించి చూడటం అన్న విధానానికి పునాది వేసిందే హోమియో వైద్యం.
మానవ శరీరంలో అత్యున్నత కేంద్ర వ్యవస్థ మెదడు. అందుచేత వైద్యం అనేది శరీరం నుంచి కాకుండా మనసు దగ్గర నుంచి ఆరంభించాలి అనేది హోమియో సిద్ధాంతం. హోమియోలో ఒక రోగానికి ఒక మందు అని కాకుండా రోగిని పూర్తిగా పరిశీలించిన తరువాత ఒకేవిధమైన సమస్యపై వెళ్లిన ఇద్దరు రోగులకు వేర్వేరు మందులు కూడా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. శస్త్రచికిత్స ప్రక్రియ తప్ప మిగిలిన అన్ని సాధారణ శారీరక, మానసిక, దీర్ఘకాలిక రుగ్మతలకు అన్నింటికీ ఇతర వైద్య విధానాలలో లేని వెసులుబాట్లు హోమియో వైద్యంలో ఉన్నాయి.
ఆధునిక అల్లోపతి వైద్యంలో ఒక జబ్బుకు ఒక మందు వేయడం వల్ల అది మరో స్థాయికి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. అయితే హోమియో వైద్యంలో దీనికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ మందులు ప్రకృతిలో దొరికే పదార్థాలతోటే తయారుచేస్తారు. హోమియో మందులు జన్యుస్థాయికి వెళ్లి శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు కలగవు.
యూరప్‌లో ‘క్రూప్’ వ్యాధి ప్రబలినప్పుడు జర్మనీలో ప్రమాదకరమైన ‘స్కార్లెట్ ఫీవర్’ వచ్చినప్పుడు, రష్యాలో కలరా వ్యాధి సోకినప్పుడు లక్షలాది మందిని రక్షించిన చరిత్ర హోమియోపతికి ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో పసిపిల్లల పాలిట మహమ్మారి అయినా మెదడు వాపు వ్యాధి విషయంలో ఈ వైద్యంలోని చిన్న హోమియో గుళిక చేసిన అసాధారణ ప్రతిభ మన అందరికీ తెలుసు. ఇక చికెన్ గున్యా, స్వైన్‌ఫ్లూ, కరోనా లాంటి మహమ్మారిపై జరిగిన వివిధ పరిశోధనల ఫలితంగా హోమియోపతి ఔషధాల పనితీరును మనం ఒప్పుకోక తప్పదు.
విశిష్టమైన హోమియోపతి వైద్య విధానం పట్ల మొదట్లో ప్రజలకు నమ్మకం కలుగలేదు. క్రమేపీ ప్రజలు విశ్వసించడంతో ప్రభుత్వాలూ ఈ విధానాన్ని గుర్తించాయి. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రత్యామ్నాయంగా హోమియో వైద్యం అందుబాటులో ఉంది. యూరప్ దేశాల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉండగా అందులో ఫ్రాన్స్ది మొదటిస్థానం. అదేవిధంగా జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ మరియు నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో వంటి దేశాలు కూడా హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. భారత దేశంలో హోమియో వైద్య విధానంలో 180 వైద్య కళాశాలలు, 40 పీజీ వైద్య కళాశాలలు ఉన్నాయి. మూడు లక్షల మందికి పైగా శిక్షణ పొందిన వైద్యులు సేవలందిస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్