వరల్డ్ ఎర్త్ డే... !

- April 22, 2025 , by Maagulf
వరల్డ్ ఎర్త్ డే... !

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పునరుత్పాదకశక్తి  వినియోగానికి తోడ్పడాలని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన పర్యావరణ అనుకూల  విద్యుత్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని, 2025 సంవత్సర ఎర్త్ డే సందర్భంగా ఎర్త్ డే. ఓఆర్ జి (EARTH DAY.ORG) అనే అమెరికా సంస్థ పిలుపునిచ్చింది.ఈ సంస్థ కృషి వల్లే 1970, ఏప్రిల్ 22 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ ఎర్త్ డే ఘనంగా నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. 2025 నాటికి ధరిత్రి దినోత్సవం 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 2025 ఎర్త్ డే ముఖ్య ఇతివృత్తం ‘మన శక్తి, మన గ్రహం’.

పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి 1969లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో (UNESCO) సమావేశంలో, శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ భూమిని, శాంతిభావనను గౌరవించే రోజును ప్రతిపాదించాడు. దీనిని మొదట మార్చి 21, 1970న, ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం మొదటి రోజున పాటించాలని ప్రతిపాదించారు. 

ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ యు థాంట్ సంతకం చేసారు. ఒక నెల తర్వాత, యునైటెడ్ స్టేట్స్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణ బోధనను నిర్వహించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. నెల్సన్, హేస్ ఈ కార్యక్రమానికి ఎర్త్ డే (ధరిత్రి దినోత్సవం) అని పేరు పెట్టారు.

పునరుత్పాదక శక్తి వనరులు (రెన్యువబుల్ ఎనర్జీ)   అపరిమితమైన శక్తి వనరులకు ఉదాహరణలు సౌరశక్తి, పవన విద్యుత్, జీవ ఇంధనాలు మొదలగునవి.  పునరుత్పాదకం కానీ లేదా పునరుద్ధరించలేని శక్తి వనరులు (నాన్ రెన్యువబుల్ ఎనర్జీ) తిరిగి నింపలేని  లేదా తిరిగి పొందలేని  పర్యావరణానికి హాని కలిగించే శక్తి వనరులకు ఉదాహరణలు బొగ్గు, పెట్రోల్, శిలాజ ఇంధనాలు మొదలగునవి. ఇవి గ్రీన్‌హౌస్  వాయువులను విడుదల చేయటం వలన ‘గ్లోబల్ వార్మింగ్’ పెరిగి  వాతావరణ మార్పులు సంభవిస్తాయి.  

వాతావరణ మార్పుల కారణంగా నాసా ప్రకారం, భూమిపై గ్లోబల్ వార్మింగ్ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 59 డిగ్రీల ఫారెన్‌హీట్ (15 డిగ్రీల సెల్సియస్) వద్ద ఉంది. గాలి, నీరు, నేల, ధ్వని కాలుష్యాలు పెరుగుతున్నాయి. 1970 నుండి జీవవైవిధ్య నష్టం 73%గా ఉంది. ఏడాదికి  10 మిలియన్ హెక్టార్లలో అటవీ నిర్మూలన జరుగుతోంది.

పెరుగుతున్న మానవ జనాభా, పెరుగుతున్న వినియోగం సహజ వనరులపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది నీటి కొరత, ఆహార అభద్రత, ఆవాసాల నాశనానికి దారితీస్తుంది. మరోవైపు, ప్లాస్టిక్‌ల ఉత్పత్తి, పారవేయడం మహాసముద్రాలు, పల్లపు ప్రాంతాలు, పర్యావరణ వ్యవస్థలలో కాలుష్యానికి, వన్యప్రాణులకు, ఆహార గొలుసులకు అంతరాయం కలిగిస్తుంది. 1970ల చివరి నుండి, ఓజోన్ స్థాయిలు సగటున 4% తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ పునరుత్పాదకశక్తి వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా చైనా, అమెరికా పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా ప్రస్తుతం పవన, సౌరవిద్యుత్ రెండింటిలోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఉరుగ్వే దేశం పునరుత్పాదకశక్తి వనరుల నుంచి 98%  విద్యుత్తును ఉత్పత్తి చేసే స్థాయికి మారింది. భారతదేశం పునరుత్పాదక శక్తి వినియోగం కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో భాగంగా  2030 నాటికి దాని శక్తి అవసరాలలో 50% పునరుత్పాదకశక్తి వనరుల నుంచి సాధించాలని, 2030 నాటికి  CO2 ఉద్గారాలను  ఒక్క బిలియన్  టన్ను తగ్గించాలని, 2070 నాటికి నికర-సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది.

కెన్యా  దాని  విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం జియోథర్మల్ విద్యుత్ ద్వారానే పొందుతున్నది.   డెన్మార్క్‌  దేశంలో 50% కంటే ఎక్కువ విద్యుత్తు పవన శక్తి  నుంచి ఉత్పత్తి అవుతుంది. 2026 నాటికి, స్పెయిన్‌లో 30%, నెదర్లాండ్స్లో 17%, జర్మనీలో 23% విద్యుత్ ను  పవన శక్తి నుంచి పొందనున్నాయి.  గత కొద్దికాలంగా  పునరుత్పాదక ఇంధన ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.  గత దశాబ్దంలో సౌర ఫలకాల తయారీ ఖర్చు తగ్గిపోయినది.  దీనివల్ల అవి అందుబాటులో ఉండటమే కాకుండా, చౌకైన విద్యుత్ తయారీ సులభతరం అవుతున్నది. 

2010 – 2020 మధ్య సౌర ఫలకాల ధరలు 93% వరకు తగ్గాయి.రెన్యువబుల్ ఎనర్జీ కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు ఇది ఒక ఆర్థిక విప్లవం. పునరుత్పాదక శక్తితో కూడిన పరిశ్రమలు, రవాణా మరియు వ్యవసాయ రంగం తదితర రంగాలలో విస్తరించి ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు, అవకాశాలను  సృష్టిస్తుంది. 

2022లో విడుదలైన 13వ అమెరికా జాతీయ సౌర ఉద్యోగుల సంఖ్య గణన ప్రకారం, అమెరికా  అంతటా 2,63,883  మంది సౌరశక్తి కార్మికులు ఉన్నారు. వారు సౌర ఫలకాల తయారీ,  పంపిణీ, నిర్వహణ కోసం పనిచేస్తున్నారు.  ఇది 2021తో  పోలిస్తే సౌర ఉద్యోగాలలో 3.5% వృద్ధిని సూచిస్తుంది.  పునరుత్పాదక శక్తి భారీ ఆర్థిక అవకాశాలని సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 14 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.  

2022 – 2030 మధ్య  క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు అమెరికా కుటుంబాలకు $27-–$38 బిలియన్లను ఆదా చేయగలవు. ‘మన శక్తి, మన గ్రహం’అనే  2025 సంవత్సర ధరిత్రి  దినోత్సవం  ఇతివృత్తాన్ని ప్రజలకి తెలియచేసి, పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకోవటం ద్వారా  మనమందరం ఆరోగ్యకరమైన,  సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోవటానికి, భూమిని వాతావరణ మార్పుల నుంచి రక్షించుకోవటానికి,  ప్రజలను విజ్ఞానవంతులను చేయవలసిన  బాధ్యత మనపై ఉన్నది.

పునరుత్పాదక శక్తి ఈ పరిస్థితిని, జీవన ప్రమాణాలను, ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం  పునరుత్పాదక శక్తి,  వాయు కాలుష్యాన్ని తగ్గించటం  వలన ఆస్తమా, బ్రోన్కైటిస్, గుండెపోటు మరియు  స్ట్రోక్‌లతో సహా శ్వాసకోశ,  హృదయ సంబంధ వ్యాధులు  గణనీయంగా తగ్గిపోతాయి.  మహిళల ఆరోగ్యం, వాయు కాలుష్యం  వల్ల ప్రభావితమవుతుంది.

ఉదాహరణకు  రొమ్ము క్యాన్సర్, అండాశయ వ్యాధులు తల్లి ఆరోగ్య ప్రమాదాలు మొదలగునవి  తగ్గిపోతాయి. పునరుత్పాదక శక్తి వినియోగం వలన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గి  వాతావరణ మార్పులతో  సంబంధం ఉన్న వేడిగాలులు, వరదలు, అంటు వ్యాధుల వ్యాప్తి వంటి  సమస్యలు  నివారించపడతాయి. వ్యాధి నియంత్రణ,  నివారణ కేంద్రాలు (CDC) ప్రకారం పునరుత్పాదకశక్తి వలన  వాయు కాలుష్యం, వాతావరణ మార్పు, పర్యావరణ విపత్తులతో సంబంధం ఉన్న ఒత్తిడి, ఆందోళనలు తగ్గటం  ద్వారా మానసిక ఆరోగ్యం  మెరుగుపడుతుంది.

ఎర్త్ డే రోజున, కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలు కలిసి వస్తారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పించారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com